రాష్ట్రీయం

సమానత్వానికి చిహ్నం రామానుజ విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైథరాబాద్, ఆగస్టు 16: సమాజంలో సమానత్వం సాధించేందుకు, అంటరానితనాన్ని రూపుమాపేందుకు, దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించేందుకు వేయి సంవత్సరాల క్రితమే సమాజంలో ‘విప్లవం’ సృష్టించిన భగవత్ రామానుజుల భారీ విగ్రహం హైదరాబాద్ సమీపంలో ఏర్పాటుకానుంది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి నేతృత్వంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని శ్రీరామనగరంలో దీన్ని ఏర్పాటు చేశారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు రామానుజులు పాటుపడినందువల్ల ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ’ అని పేరుపెట్టారు. 216 అడుగుల ఎత్తుతో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో కూర్చుని ఉన్న భంగిమలో ఏర్పాటు చేసిన ఎతె్తైన విగ్రహాల్లో ఈ విగ్రహం రెండో అతిపెద్దదిగా పేరుతెచ్చుకోబోతోంది. ఇప్పటికే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కానీ చుట్టూ కట్టడాల నిర్మాణం పూర్తి కాలేదు. లాంఛనంగా ప్రారంభించలేదు. 40 ఎకరాల స్థలంలో ఏర్పాటవుతున్న స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ ప్రాజెక్టులో మొదటి దశ నిర్మాణాన్ని 2019 ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. నిర్ణీత సమయానికి అనుకున్నట్టుగానే పూర్తయితే దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేత ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజు జీయర్ ఇప్పటికే ప్రధానికి ఆహ్వాన లేఖ అందించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పరిధిలోకి వచ్చే ముచ్చింతల్ గ్రామ సమీపంలోని శ్రీరామనగరంలో రామానుజుల విగ్రహం ఏర్పాటు పూర్తయితే ఇది తెలంగాణకే మణికిరీటంగా మెరవనుంది. తెలంగాణలోనే కాకుండా భారత దేశంలో కూడా ఇంత భారీ విగ్రహం కూర్చుని ఉన్న భంగిమలో ఇప్పటి వరకు లేకపోవడం గమనార్హం. గుజరాత్‌లో సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ విగ్రహాన్ని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో 597 అడుగుల ఎత్తులో నిలుచుని ఉన్న భంగిమలో ఏర్పాటు చేస్తున్నారు. కూర్చుని ఉన్న భంగిమలో ఏర్పాటవుతున్న భగవత్ రామానుజుల పంచలోహ విగ్రహం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక రికార్డు నెలకొల్పబోతోంది. థాయిలాండ్‌లో ఏర్పాటు చేసిన గౌతమబుద్ధ కూర్చుని ఉన్న విగ్రహం 302 అడుగుల ఎత్తుతో అతి పెద్ద విగ్రహంగా పేరుతెచ్చుకుంది. వాస్తవంగా శ్రీరామనగరంలో భగవత్ రామానుజాచార్యుల విగ్రహాన్ని 302 అడుగుల కంటే మరింత ఎత్తుగా ఏర్పాటు చేయాలని త్రిదండి చిన్న జీయర్ భావించారు. అయితే ఈ విగ్రహం ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంది. దాంతో 300 పైగా అడుగుల ఎతె్తైన రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించలేదు. దాంతో విగ్రహం ఎత్తు 216 అడుగులకే పరిమితం చేయాల్సి వచ్చింది. చైనాలోని ఏరోసన్ కార్పోరేషన్ ఈ విగ్రహాన్ని వేర్వేరు భాగాలుగా తయారు చేసి, ఇక్కడకు తీసుకువచ్చి అమర్చారు. కమలం పువ్వులో కూర్చుని ఉన్న భంగిమలో విగ్రహం ఉంది. విగ్రహం అడుగుభాగంలో మూడంతస్తుల భవనం నిర్మాణమయింది. దీనికి ‘్భద్రవేది’ అని పేరుపెట్టారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోలు తదితరాలు ఉంటాయి. మొదటి అంతస్తులో 120 కిలోల బంగారుతో తయారు చేస్తున్న రామానుజుల మరో విగ్రహం ఏర్పాటు చేసి ఆలయం నిర్మించారు. బంగారు విగ్రహానికి నిత్య పూజలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో అంతస్తులో వేదిక్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటవుతోంది. రామనుజుల విగ్రహం చుట్టూ 108 దివ్యదేశాల మాడల్ ఆలయాలు నిర్మాణం అవుతున్నాయి. విగ్రహం ముందుభాగంలో 108 మెట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనావేశారు. ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చయింది. దీని నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేసేందుకు చిన్న జీయర్ ప్రయత్నిస్తున్నారు. శ్రీరామ నగరానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే వనె్న తెచ్చే ప్రాజెక్టుగా ఇది రూపొందుతోంది. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే కేంద్రంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.