రాష్ట్రీయం

ఇంతలోనే.. నూరేళ్లు నిండాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎక్కడో హైదరాబాద్.. మరెక్కడో అమలాపురం.. నాలుగు రోజులపాటు ఆటలు, ఆపై విహారయాత్రలో ఆనందంగా గడిపి ఇంటిముఖం పట్టిన 35 మంది వైద్య విద్యార్థుల్లో నలుగురు విజయవాడ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం, మరో 9 మంది తీవ్రంగా గాయపడిన దుర్ఘటన ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ రాష్ట్రాల్లో విషాద ఛాయలు నింపింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ నగరానికి చేరుకున్నారు. ఇంతలోనే నూరేళ్లు నిండాయా? అంటూ రోదిస్తున్న తల్లిదండ్రులను చూసిన అందరి గుండెలు బరువెక్కాయి. పలువురు చికిత్స పొందుతున్న ఆంధ్రా ఆసుపత్రి, మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరిగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పరుగులు తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చూసి తల్లిదండ్రులు విలపించిన తీరు చుట్టుపక్కల వారి గుండెల్ని పిండేశాయి. మృతులలో హైదరాబాద్ సంతోష్‌నగర్‌కు చెందిన రాజారామ్ (22), ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తండ్రి ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్. రాజారామ్‌కు ఒక సోదరుడున్నాడు. ఉదయానే్న ఆసుపత్రికి చేరుకున్న తండ్రి శ్రీనివాసమూర్తి, అతని భార్య కుమారుని శవంపై పడి హృదయాలవిసేలా కన్నీరు మున్నీరయ్యారు. కూకట్‌పల్లికి చెందిన మోకా విజయ తేజ ముఖమంతా ఛిద్రమై పోయింది. గుర్తించలేని రూపంలో ఉన్న కొడుకుని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. మీడియాతో కూడా మాట్లాడలేక రోదిస్తూ దూరంగా ఉండిపోయారు. నిజామాబాద్ జిల్లా బైంసాకు చెందిన గిరి లక్ష్మణ్ నిరుపేద అయినప్పటికీ తల్లిదండ్రులు గర్వపడేలా చదువుకుంటున్నాడు. తన కుటుంబానికి అండగా నిలుస్తానని, గర్వపడే ర్యాంక్ తెచ్చుకుంటానని తమతో చెబుతుండేవాడని మిత్రులు చెప్పారు. తమ ఆశలన్నీ అడియాసలయ్యాయంటూ తల్లిదండ్రులు రోదించారు. కరీంనగర్‌కు చెందిన ఉదయ్ ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. విగతజీవిగా మారిన బిడ్డను చూసి తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఇక ఈ దుర్ఘటనకు కారణభూతుడైన డ్రైవర్ శివశంకర్ కుటుంబం మధ్యాహ్నం తర్వాత ఆసుపత్రికి చేరుకుంది. గతంలో గుంటూరులో ఉన్న ఈ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది.
రాజారామ్ నేత్రాలు దానం
మృతుల్లో ఒకరైన రాజారామ్ నేత్రాలను అతని తండ్రి శ్రీనివాసమూర్తి స్థానిక స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకుకు దానమిచ్చారు. తన బిడ్డ చనిపోయినా అతని నేత్రాలతో మరో ఇద్దరు చూపు పొందుతారని ఆయన రోదిస్తూ మీడియాకు చెప్పారు.
మరో ఇద్దరి పరిస్థితి విషమం
కాగా,ప్రమాదంలో గాయపడిన 31 మంది వైద్య విద్యార్థుల్లో 9 మంది తీవ్ర గాయాలతో ప్రమాద స్థలం సమీపంలోని ఆంధ్ర హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎస్.రాజేష్, కె.సుజిత్ పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన విద్యార్థులు ఎన్ అంకిత్, ఎన్.అభిలాష్, ఆర్.నవనీత్ రాథోడ్, ఎం.సురేష్ గోపి, ఎస్.సాయి రామిరెడ్డి, నాగు నాయక్‌కు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కలెక్టర్ బాబు ఎ ను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మంగళవారం నగరానికి చేరుకుని ముందుగా చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఆపై ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను సందర్శించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఈ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సహాయం, తదితర వివరాలను మంత్రికి వివరించారు.
హైదరాబాద్‌కు మృతదేహాలు
ఇదిలా ఉంటే పోస్ట్‌మార్టం అనంతరం నలుగురి మృతదేహాలను ప్రత్యేక అంబులెన్సులో హైదరాబాద్ పంపించగా, ప్రాథమిక చికిత్స అనంతరం మిగతా వైద్య విద్యార్థులను ప్రత్యేక వోల్వో ఎసి బస్సులో పంపించారు. వారి వెంట రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు కూడా వెళ్లారు. క్షతగాత్రులను నగర మేయర్ కోనేరు శ్రీధర్, అధికారులు పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన బస్ డ్రైవర్ వేముల శివవంకరరావుపై వివిధ సెక్షన్ల కింద భవానీపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

చిత్రం... చనిపోయిన తన కుమారుడు రాజారామ్ నేత్రాలను
దానంగా ఇస్తూ భోరుమని విలపిస్తున్న శ్రీనివాసమూర్తి