రాష్ట్రీయం

శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 14: శ్రీవారి వార్షికబ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 4 నుంచి 4.45 గంటల మధ్య మకర లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈకార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు చల్లా రామచంద్రా రెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, జేఈఓలు శ్రీనివాసరాజు, పోలభాస్కర్, ఇన్చార్జ్ సీవీ ఎస్వో శివకుమార్ రెడ్డి, విఎస్‌ఓ రవీంద్రారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్లు రమేష్ బాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన గురువారం 46,969 మంది భక్తులు దర్శించుకోగా 21,774 భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీలో భక్తులు వేసిన కానుల ద్వారా రూ. 2 కోట్లు ఆదాయం లభించింది.

పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 12 పర్యాయాలు ప్రభుత్వం తరపున గరుడ సేవ రోజున పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం తనకు లభించిందని, రాష్ట్ర ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు వీలుగా జలదీక్ష చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గురువారం ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 17వ తేదీ రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. గరుడ వాహన సేవను అధిరోహించే మలయప్ప స్వామి, గరుడ వాహనానికి అలంకరించే పట్టువస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గురువారం పట్టువస్త్రాలను సమర్పించడానికి కుటుంబ సమేతంగా వచ్చారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన గురువారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ముఖ్యమంత్రికి తలపాగా చుట్టి వెండి పళ్లెంలో పట్టువస్త్రాలను ఉంచి ఆయన తలపై పెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు వెంటరాగా అక్కడ నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తలపై మోసుకువచ్చిన పట్టు వస్త్రాలతో ధ్వజ స్తంబానికి నమస్కరించుకుని మూలవిరాట్టు వరకు తీసుకువెళ్లి అర్చకులకు అప్పగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా టీటీడీ తరపున అర్చకులు సీఎంకు శేషవస్త్రాన్ని సమర్పించారు. అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వర స్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రాచ్ఛారణతో వేదపండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈసందర్భంగా 2019 సంవత్సరాల డైరీలు, క్యాలెండర్లను ఆలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 12 పర్యాయాలు ప్రభుత్వం తరపున శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లాంఛనాలు ఇచ్చే భాగ్యం లభించిందన్నారు. నా ఇంటి కులదైవం వేంకటేశ్వరుడని చెప్పారు. ఆయన పాదాల చెంత పుట్టానని, అందుకే తనకు ప్రాణబిక్ష పెట్టాడన్నారు. అందుకే తాను భగవంతుని ఒకటే కోరుతున్నానని, రాష్ట్ర అభివృద్ధి పథంలో నడవాలని, పేదరికం తొలగి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆశీర్వదించాలని తాను కోరుకున్నానని చెప్పారు. ప్రజలకు తాగు, సాగునీరు, పరిశ్రమలకు నీరు అందించేందుకు జలదీక్ష చేస్తున్నానని జల భద్రతకు కృషి చేస్తున్నానని సీఎం అన్నారు. బుధవారం పోలవరంలో గ్యాలరీ వాక్ నిర్వహించామన్నారు. గురువారం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగస్వాములం అయ్యానని, శుక్రవారం జలసిరికి హారతి ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటానన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ జలసిరి హారతి కార్యక్రమాలు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద నిర్వహిస్తామన్నారు. మరో రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాలో జలసిరి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సమస్త మానవాళికి నీరు అవసరమని చెప్పారు. వచ్చే ఏడాది మే నాటికి పోలవరం పనులను ఒక స్థాయికి వస్తాయని, పనులు వేగంగా జరుగుతున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాఫర్ డ్యాం, బీసీఎఫ్ డ్యాంలను ప్రారంభిస్తామన్నారు. ఏకకాలంలో అన్ని పనులు ప్రారంభిస్తున్నామని, జూన్‌లో గ్రావిటీతో నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తిరుమల తరహాలోనే పవిత్రంగా అమరావతిలో శ్రీవారి ఆలయం ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లోని అనేక ప్రాంతాల్లో హంద్రీ-నీవా ద్వారా నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.