రాష్ట్రీయం

లక్ష్యానికి సుదూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 19: ‘అసమగ్రమైన ప్రణాళిక.. డిజైన్లను ఖరారు చేయటం.. భూ సేకరణ.. పునరావాసం.. పునర్నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం వల్ల 2004లో మొదలైన పోలవరం ప్రాజెక్టు అమలు మందగతిలో ఉంది. ఒప్పందపు నిబంధనలు పాటించటంలో నీటిపారుదలశాఖ వైఫల్యమూ ఇందుకు కారణం. అనుకున్న విధంగా 2019నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి ఆశించిన ప్రయోజనాలను పొందటం అసాధ్యమనిపిస్తోంద’ని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక తేల్చి చెప్పింది. ఏపీ ఆర్థికరంగ తీరుతెన్నులపై 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరపు గణాంకాల నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. 2016-17లో ప్రభుత్వం ఆర్థికరంగంపై రూ.35,217.73 కోట్లు ఖర్చు చేయగా అందులో ప్రధానంగా విద్యుచ్ఛక్తి- వౌలిక సదుపాయాలు- పెట్టుబడుల శాఖకు రూ.11,838.45 కోట్లు, జలవనరుల శాఖకు 10,637.24 కోట్లు, వ్యవసాయశాఖ 6687.98 కోట్లు, రోడ్లు- భవనాల శాఖ 3469.82 కోట్లు ఖర్చు చేశాయి. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు సాగునీటి పారుదల ప్రయోజనాలు, జల విద్యుదుత్పాదన, నాలుగు జిల్లాల్లో గృహ, పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చటం ప్రధాన ఉద్దేశ్యాలు కాగా కేంద్ర జలవనరుల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏపీ సర్కారు ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందా.. లేదా..? అమలు చేయటంలో తగిన పర్యవేక్షణ వ్యవస్థ ఉందా..లేదా అనే అంశాలపై ఆడిట్ నిర్వహించింది. 2005లో
అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల సంఘానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించింది. ఇందులో లోపాలను సవరించేందుకు నాలుగేళ్లు పట్టింది. తిరిగి 2009లో ఆమోదం పొందింది. కేంద్ర జలవనరుల సంఘం డీపీఆర్‌ను ఆమోదించక ముందే హెడ్‌వర్క్స్ పనుల అమలును అప్పగించింది. అనంతరం కేంద్ర జలవనరుల సంఘం సూచించిన డిజైన్ల మార్పుల కారణంగా ఒప్పందాలకు ముందుగానే ముగింపు పలకాల్సి వచ్చింది. ఒప్పందాలను ముగించే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మరో మూడేళ్ల వ్యవధి పట్టింది. ఈ విధంగా డిజైన్లలో మార్పులు, మూడేళ్ల జాప్యం కారణంగా పనుల విలువ రూ 2331.27 కోట్లకు పెరిగిందని నివేదిక తేల్చిచెప్పింది. 15 కాలువ ప్యాకేజీలలో ఏ ఒక్కటీ డిపార్టుమెంట్ ఒప్పందపు గడువులోగా భూ సేకరణ పూర్తిచేసి గుత్తేదారులకు అందించలేదు.. ముంపు ప్రాంతాల్లో ఇంకా 36వేల ఎకరాల భూ సేకరణ జరగాల్సి ఉంది.. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల పునరావాస, పునర్నిర్మాణ పనుల నిమిత్తం 26వేల 830 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని గత 12 సంవత్సరాల కాలంలో 1,05,601 కుటుంబాలకు గాను 4069 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారని 371 గ్రామాలకు గాను ఇంకా 192 గ్రామాల విషయంలో పునరావాస- పునర్నిర్మాణ ప్రణాళికను ఖరారు చేయాల్సి ఉందని వివరించింది. ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ముంపును నివారించేందుకు నిర్మించాల్సిన రక్షణ కట్టల విషయంలో పురోగతిలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. భూ సేకరణ, పునరావాస, పునర్నిర్మాణాలపై పెట్టిన ఖర్చు వివరాలను సమర్పించక పోవటంతో కేంద్రప్రభుత్వం నుండి రావాల్సిన రూ 1407.64 కోట్ల నిధులు నిలిచిపోయాయని స్పష్టంచేసింది. 2014 నుండి 2017 జూలై వరకు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు సాగునీటి అంశంపై 6598.7 కోట్లు ఖర్చు పెట్టింది. భారత ప్రభుత్వం పీపీఏ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 3349.7 కోట్లు తిరిగి చెల్లించింది. భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్‌లకు సంబంధించి రూ 1407.64 కోట్ల ఖర్చు వివరాలను ప్రభుత్వం పీపీఏకు వివరాలు సమర్పించని కారణంగా నిధులు మంజూరు కాలేదని ఆడిట్ నివేదిక స్పష్టంచేసింది. 2005 నాటికి డీపీఆర్‌లో ప్రాజెక్టు అంచనా విలువ రూ 10వేల 151 కోట్లు కాగా దీన్ని కేంద్ర జలసంఘం 2009లో ఆమోదించింది. 2010లో సవరించిన అంచనాలతో ప్రభుత్వం రూ 16,010.45 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. గత ఏడాది నాటికి డీపీఆర్ విలువ 55వేల 131 కోట్లకు చేరింది.. అయితే 2014 ఏప్రిల్ తరువాత అయ్యే వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించి మూడేళ్లు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంఒయు కుదరకపోవటంతో ప్రాజెక్టు వ్యయంలో రూ 3249 కోట్ల లోటు ఏర్పడిందని నివేదిక తేల్చింది. గతంలో హెడ్ వర్క్స్‌లో మితిమీరిన జాప్యం జరిగినా గుత్తేదారులకు లిక్విడేటెడ్ డ్యామేజీ విధించటంలో జలవనరులశాఖ విఫలమైందని ఆరోపించింది. అటవీ, పర్యావరణ అనుమతుల సాధనలో పర్యవేక్షణ కొరవడిందని ఆక్షేపించింది. కాగా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లలో వౌలిక వసతుల అభివృద్ధిని సమీక్షించిన కాగ్ 2006-12 మధ్య కాలంలో 25 ఐటీ యూనిట్లకు భూములు కేటాయించారని, ఇందులో రెండు రద్దుకాగా 14 యూనిట్లు మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయని వివరించింది. 2017 జూలై వరకు 22 నుంచి 101 నెలల సమయం గడవటంతో ఒక యూనిట్ ఇంకా ప్రారంభించలేదని ఎనిమిది యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నట్లు గుర్తించింది. 23 యూనిట్లకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 10వేల 809 ఉద్యోగాల కల్పన లక్ష్యం కాగా 2017 జూలై నాటికి కేవలం 4326 ఉద్యోగాలు మాత్రమే కల్పించారని ఐటీ ప్రాజెక్టుల అమలులో ఏపీఐఐసీ పర్యవేక్షణ కొరవడిందని ఆడిట్ నివేదిక పేర్కొంది. డెవలపర్లకు అనువుగాలేని భూములు కేటాయించటం వల్ల ప్రత్యామ్నాయ భూ కేటాయింపులో జాప్యం వల్ల విశాఖపట్నం మధురవాడ ఐటీ సెజ్‌లో ఉమ్మడి వసతులను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఉద్దేశ్యం పదేళ్ల తరువాత కూడా నెరవేరలేదని తేల్చి చెప్పింది. ఐటీ ప్రాజెక్టుల అమలు, ఇంక్యుబేటర్ల పనితీరుపై ప్రభుత్వ పర్యవేక్షణలేదని, ఫలితంగా ఐటీ యూనిట్లు, ప్రాజెక్టుల అమలులో అసాధారణ జాప్యం జరుగుతోందని ఆరోపించింది. ఇంక్యుబేషన్ కేంద్రాల నిర్మిత విస్తీర్ణాన్ని వినియోగంలోకి తీసుకురాలేక పోయిందని ఆశించిన విధంగా ఐటీ పరిశ్రమలు, అంకుర సంస్థలను ప్రోత్సహించటం ఉపాధి కల్పన సాధించిందనే భరోసాలేదని ఉటంకించింది. కాగా జీవ వైవిధ్య బోర్డు ఏర్పాటై దశాబ్ద కాలం గడిచినా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయటంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించింది. సింగల్ డెస్క్ విధానంలో లోటుపాట్లను సవరించుకోవాలని సూచించంది. కాగా తాతపూడి ఎత్తిపోతల పథకం, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టుల విషయంలో వచ్చిన మొత్తం కేంద్ర సాయం నిర్దేశిత గడువులోగా ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఫలితంగా ఈ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం తదుపరి సాయాన్ని విడుదల చేయలేదని, ప్రభుత్వం రూ 79.04 కోట్ల మేర సాయాన్ని పొందలేకపోయిందని వివరించింది. గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టులో భూ సేకరణ- పునరావాస- పునర్నిర్మాణ కార్యకలాపాలు పూర్తికాక పోవటంతో పనులు మొదలై 13 సంవత్సరాలు తరువాత కూడా 80వేల 600 ఎకరాల ఆయకట్టులో 11వేల 112 ఎకరాలకు సాగునీరు అందలేదని, పిల్లకాలువ పనుల్లో చెల్లింపు ధరలను తప్పుగా లెక్కించటం వల్ల రూ 1.49 కోట్ల దుబారా జరిగిందని ఆరోపించింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ హెడ్ వర్క్స్ తదితర ఆధునీకరణ పనుల్లో ఒప్పందం నుంచి తొలగించిన పని విలువను జలవనరులశాఖ తప్పుగా లెక్కించిందని దీనివల్ల ఖజానాపై 22.6 కోట్ల అదనపు ఆర్థికభారం పడిందని, హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో పంపులు, మోటార్లకు సంబంధించిన విద్యుత్ బిల్లుల చెల్లింపులో జరిగిన జాప్యం కారణంగా 2012-13 నుండి 2016-17 కాలానికి గాను ఆలస్యపు రుసుం రూపంలో రూ 14.33 కోట్ల నివారించదగిన ఖర్చు జరిగిందని, మరో రూ 17.9 కోట్ల మేర ఇంకా చెల్లించాల్సి ఉందని గుర్తించింది.