రాష్ట్రీయం

తిత్లీ విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అక్టోబర్ 11: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తిత్లీ పను తుపానుగా మారి గురువారం తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో వజ్రపుకొత్తూరు-బారవు మధ్య పలాసాకు తూర్పున తీరం దాటింది. తుపాను తీరం దాటినప్పుడు ఆ ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ఎక్కువగా కనిపించింది. తుపాను తీరం దాటేటప్పుడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గంటకు 130 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. దీనికి భారీ వర్షం తోడవడంతో ఈ రెండు జిల్లాల్లోని అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. తుపాను ప్రభావం వలన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎనిమిది మంది మరణించారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఎనిమిదవ తేదీన ఏర్పడిన అల్పపీడం, తొమ్మిదవ తేదీన వాయుగుండంగా మారింది. 9వ తేదీ రాత్రికి తుపానుగా మారింది. ఈ తుపానుకి తిత్లీ అని నామకరణం చేశారు. 10వ తేదీ మధ్యాహ్నానికి ఇది పెను తుపానుగా మారి శ్రీకాకుళం, గోపాల్‌పూర్ తీరాలకు గంటకు 14 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో దూసుకువచ్చింది. తిత్లీ తుపాను గురువారం తెల్లవారు జామున తీరం దాటినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియచేశారు. ఈ తుపాను రీ కర్వ్ తీసుకుని ఒడిశా తీరం మీదుగా పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లినట్టు అధికారులు తెలియచేశారు. గురువారం సాయంత్రం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గాలి, వానలు తగ్గుముఖం పట్టాయి. ఒడిశాలో గురువారం రాత్రికి కూడా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పెను తుపాను గురువారం ఉదయానికి తుపానుగా మారింది. ఇది మరింత బలహీనపడి గురువారం రాత్రికి వాయుగుండంగా మారనుంది. శుక్రవారం అల్పపీడనంగా మారుతుంది. దీని ప్రభావం ఇక ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉండదని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియచేశారు. కోస్తాలోని అన్ని పోర్టుల్లోను ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు.
ఇప్పటి వరకూ కోస్తా జిల్లాల్లో అనేక తుపాన్లు సంభవించాయి. అయితే తిత్లీ తుపాను ప్రభావం వలన గతంలో ఈ ప్రాంత ప్రజలు కనీవినీ ఎరుగనంతగా అతి భారీ వర్షాలు కురిసాయి. శ్రీకాకుళం జిల్లా గారలో 43 సెంటీ మీటర్లు, కంచిలిలో 35, సోంపేట మండలం బాతుపురంలో 21 సెంటీ మీటర్లు, పలాసాలో 19, ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ వద్ద 16, మందులో 15, కొర్లాం, యార్జి, అవకబద్ద వద్ద 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సంతబొమ్మాళిలో 10 సెంటీ మీటర్లు, హిరమండలంలోని లక్ష్మీనర్సన్నపేటలో తొమ్మిది, కళింగపట్నంలో ఎనిమిది సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అలాగే గురువారం ఉదయం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం, నర్సన్నపేట పాలకొండల్లో 11 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది. మొళియాపుట్టి, ఇచ్ఛాపురంలలో తొమ్మిది సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది. బూర్జలో ఏడు, సీతంపేటలో ఆరు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా కురుపాంలో 18 సెంటీ మీటర్లు, గుమ్మలక్ష్మీపురంలో 15, కొమరాడలో ఏడు సెం.మీ, వర్షం కురిసింది.
భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎనిమిది మంది మరణించారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామానికి చెందిన ముద్దాడ సూర్యారావు (46) శ్లాబ్ కూలి మరణించాడు. పాలకొండ డివిజన్ వంగర గ్రామానికి చెందిన తాడి అప్పలనరసమ్మ (62)పై చెట్టు విరిగి పడడంతో అక్కడికక్కడే మరణించింది. టెక్కలి డివిజన్‌లోని సంతబొమ్మాళి మండలం సున్నపల్లి గ్రామానికి చెందిన బొంగు దుర్గారావు (50), సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామానికి చెందిన అప్పలస్వామి (56), టెక్కలికి చెందిన కొల్లి లక్ష్మమ్మ (70), మందస మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన మనె్న సంతోష్‌కుమార్ (29), ఇదే గ్రామానికి చెందిన ఇప్పిలి కన్నయ్య (53) మరణించారు.
విజయగరం జిల్లాకు చెందిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. గత రాత్రి 11 గంటల సమయంలో ఒడిశాలోని రామయ్యపట్నం వద్ద పడవ బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు గల్లంతు కాగా, మరో ఇద్దరు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పతివాడ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో పూసపాటిరేగ మండలం పతివాడ పంచాయతీ బర్రిపేట గ్రామానికి చెందిన సూరపు రాము (20), వాసుపల్లి లక్ష్మయ్య (35)లతోపాటు తమ్మయ్యపాలెం గ్రామానికి చెందిన బాడి సత్తిబాబు (26) గల్లంతయ్యారు. అదే పడవలో ప్రయాణించిన బర్రిపేట గ్రామానికి చెందిన బర్రి అప్పన్న, అప్పయ్య సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. వీరంతా గత నెల 14న చేపల వేట నిమిత్తం జిల్లాలోని పూసపాటిరేగ మండలం పతివాడ నుంచి ఎనిమిది మంది మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్‌కు రెండు బోట్లలో బయలుదేరారు. వేట ముగించుకొని మత్స్యకారులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

హైవైపై భారీ వాహనాల బోల్తా
తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులతో కూడిన వర్షం కురియడంతో కోల్‌కత్తా-చెన్నై జాతీయ రహదారిపై భారీ వాహనాలు నేలకొరిగాయి. గంటకు 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచడంతో శ్రీకాకుళం-ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై సుమారు 10 కంటైనర్ వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. గాలుల తీవ్రత అధికంగా ఉన్నా, వాహనాలను నిలపకుండా ముందుకు వెళ్లడం వలన ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కేవలం కిలో మీటరు పరిధిలో 10 వాహనాలు అదుపుతప్పి బోల్తా పడ్డాయంటే గాలుల తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక విశాఖ నుంచి ఇచ్ఛాపురం, పలాసా ప్రాంతాలకు నడిచే ఆర్టీసీ బస్సులను గురువారం రద్దు చేశారు. ఈ విశాఖ నుంచి శ్రీకాకుళం మధ్య మాత్రమే బస్సులను నడిపారు. శ్రీకాకుళం-ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై గురువారం ఉదయం 10 గంటల తరువాత వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అలాగే భువనేశ్వర్, హౌరా నుంచి వచ్చే రైళ్లను భద్రక్ వద్ద నిలిపివేయగా, చెన్నై, విజయవాడ నుంచి విశాఖ మీదుగా హౌరా, భువనేశ్వర్ వెళ్లే రైళ్లను విశాఖ, విజయనగరం స్టేషన్లలో నిలిపివేశారు. తుపాను తీరం దాటే సమయంలో విశాఖ ఔటర్ హార్బర్‌లో ఉన్న వాణిజ్య నౌకలను విశాఖ, గంగవరం పోర్టుల్లోకి పంపించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే బోట్లను విశాఖ ఫిషంగ్ హార్బర్‌లో నిలిపివేశారు.
హైదరాబాద్ నుంచి విశాఖకు రావల్సిన రెండు ఇండిగో విమాన సర్వీసులను, బెంగళూరు నుంచి విశాఖ రావల్సిన ఒక విమాన సర్వీసును, ఢిల్లీ నుంచి విశాఖకు రావల్సిన ఇండిగో సర్వీసును రద్దు చేశారు. ఈ విమానాల్లో వెళ్లాల్సిన ప్రయాణికులకు గురువారం సాయంత్రం ప్రత్యేక విమానాల్లో వారి వారి గమ్యాలకు చేర్చారు.
ఊపిరి పీల్చుకున్న విశాఖ వాసులు
నాలుగేళ్ల కిందట విశాఖ నగరాన్ని కుదిపేసిన హుదూద్ ఇంకా ప్రజల ముందు కదలాడుతోంది. ఈనేపథ్యంలో వచ్చిన తిత్లీ తుపాను వలన మళ్లీ విశాఖలో ఎటువంటి విలయం సంభవిస్తుందోనని ఇక్కడి ప్రజలు భయపడ్డారు. కానీ తుపాను తీరం దాటే సమయంలో విశాఖ నగరంలో తేలికపాటి జల్లులు కురిసాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో విశాఖ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.