రాష్ట్రీయం

వేడెక్కిన టీడీపీ-బీజేపీ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, నవంబర్ 8: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కేంద్రంగా గత కొంత కాలంగా ఉప్పు-నిప్పులా మారిన టీడీపీ-బీజేపీ వివాదాలు గురువారం పతాకస్థాయికి చేరాయి. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలంటూ టీడీపీకి చెందిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చేసిన సవాల్‌కు బీజేపీకి చెందిన మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు సై అనడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం స్థానిక వెంకట్రామన్న గూడెంవద్ద నిర్వహించతలపెట్టిన బహిరంగ చర్చను పోలీసులు అడ్డుకున్నారు. బాపిరాజు, మాణిక్యాలరావును గృహనిర్బంధం చేశారు. వివరాలిలావున్నాయి... పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గం 2014 ఎన్నికల్లో బీజేపీకి కేటాయించారు. అక్కడి నుండి పోటీచేసిన పైడికొండల మాణిక్యాలరావు ఎన్నికల్లో విజయం సాధించి, రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా చేరారు. అయితే ఎన్నికల అనంతరం నుండి టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు మొదలయ్యాయి. పొత్తు చెడిపోయిన నాటి నుండి ఈ విభేదాలు తీవ్రతరమయ్యాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలతో, బహిరంగ చర్చలకు సవాళ్ళు విసురుకోవడం ప్రారంభించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చ అంటూ మాజీ మంత్రి మాణిక్యాలరావు ఇటీవల పెంటపాడులో జరిగిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఒకరిపై ఒకరు పత్రికా సమావేశాలు నిర్వహించి విమర్శలు గుప్పించుకున్నారు. బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి మాణిక్యాలరావుకు జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు సవాల్ విసిరారు. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో గురువారం ఉదయం 10 గంటలకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసరడంతో మధ్యాహ్నం 3 గంటలకు చర్చకు వస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు స్పందించారు. దీంతో నియోజకవర్గంలో తెలుగుదేశం, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దీనితో ముందుజాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. గురువారం బహిరంగ రచ్చకు రావాలని పిలుపునిచ్చిన జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు బుధవారం రాత్రికే వెంకట్రామన్నగూడెం చేరుకున్నారు. ఇది తెలుసుకున్న పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన బయటకు రావడానికి ప్రయత్నించడంతో అడ్డుకున్నారు. జెడ్పీ చైర్మన్‌కు అనుకూలంగా మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ వెంకట్రామన్నగూడెం చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ బాపిరాజును బందోబస్తుతో ఆయన స్వగ్రామం నల్లజర్ల తరలించారు. అలాగే బహిరంగ చర్చకు వెళ్ళడానికి ప్రయత్నించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన నివాసానికి బీజేపీ నేత సోము వీర్రాజు చేరుకోవడంతో గృహనిర్బంధం నుంచి బయటకు వచ్చేందుకు మాణిక్యాలరావు ఇంటి గోడ పైనుంచి దూకడానికి ప్రయత్నించారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. డీఎస్పీలు ఎన్.మురళీకృష్ణ, ఎస్ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, వంద మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
కన్నా, జీవీఎల్, కావూరి హౌస్ అరెస్ట్
గుంటూరు: తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పట్ల పోలీసుల దురుసు వైఖరిని ప్రశ్నించేందుకు, ఆయనను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు జీవీఎల్, గోకరాజు గంగరాజు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావులను పోలీసులు అడ్డుకున్నారు. గురువారం బీజేపీ నేతలు తాడేపల్లిగూడెం వెళ్తున్న సందర్భంలో కనకదుర్గమ్మ వారధి వద్ద పోలీసులు అడ్డుకోవడం, తదనంతర పరిణామాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడ్డుకోవడంతో కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు నేతలు కార్లు దిగి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. దాదాపు అర్ధగంటకు పైగా బైఠాయించడంతో రెండుకిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పరిస్థితి చేజారిపోతుండటంతో పోలీసులు బలవంతంగా కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, కావూరి సాంబశివరావు, గోకరాజు గంగరాజు ఇతర నేతలను అరెస్ట్ చేసి గుంటూరు నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి సొంత పూచీకత్తుతో గుంటూరులోని కన్నా స్వగృహానికి నేతలను తరలించి హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్లపాడు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తంచేశారు. నేతలను కన్నా ఇంటికి తరలించడంతో తిరిగి అక్కడి నుంచి హిందూ కాలేజీ సెంటర్ వరకు కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా వెళ్లి కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. ప్రధాన కూడలిలో ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. కాగా బీజేపీ రాష్ట్ర నాయకుల అరెస్ట్‌లను యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌నాయుడు, కార్యవర్గ సభ్యులు తీవ్రంగా ఖండించారు.

చిత్రాలు.. తాడేపల్లిగూడెంలో జడ్పీ చైర్మన్ బాపిరాజును అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
*కనకదుర్గ వారధి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తంచేస్తున్న కన్నా, జీవీఎల్ తదితరులు