రాష్ట్రీయం

కూటమికి గుడ్‌బై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: సీట్ల సర్దుబాట్లలో జాప్యంతో విసిగివేసారిపోయిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) మహాకూటమి నుంచి వైదొలిగింది. తాము డిమాండ్ చేస్తున్న సీట్లపై స్పష్టతనివ్వాలని అనేక సార్లు పత్రికాముఖంగా, వ్యక్తిగతంగా సీపీఐ నేతలు డిమాండ్ చేసినా కాంగ్రెస్ వౌనం వహించడంతో పార్టీలో తీవ్రమైన అసహనం, అసంతృప్తి నెలకొంది. చివరికి కూటమి నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుంది. ఎన్నికల్లో తమదారి తాము చూసుకుంటామని సీపీఐ నేతలు తేల్చిచెప్పేశారు. తాము ఐదు స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని పార్టీ ప్రకటించింది. శనివారం అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం రాత్రి వెల్లడించారు. ఈమేరకు ఆయనో ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెం, వైరా, హున్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లి అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని అనేక సార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో సీపీఐ నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చిందని చాడ అన్నారు. 5 అసెంబ్లీ స్థానాలకు పెంచాలని తాము అడిగినంత మాత్రాన ప్రాధేయపడినట్లుకాదని అన్నారు. కాంగ్రెస్‌తో అయ్యేపనికాదని, వేచి చూడడం మానేసి సొంతంగా పోటీ చేద్దామని సీపీఐలో వత్తిడి పెరిగింది. అలాగే మహాకూటమి సూచించిన విధంగా 3 అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలను తీసుకోవడానికి తాము సిద్ధంగా లేమని సీపీఐ నేతలు వెల్లడించారు. శుక్రవారం వరుస భేటీల్లోనూ కూటమి నుంచి వైదొలగాన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, టీజేసీ అధ్యక్షుడు కోదండరామ్, టీడీపీ అధ్యక్షుడు రమణతో సీపీఐ నేతల బృందం భేటీ అయింది. అసలే విపరీతమైన జాప్యంతో రగిలిపోతుండగా జానారెడ్డి సీపీఐ నేతలతో మాట్లాడుతూ ‘సీట్ల సంఖ్య విషయంలో మరో రెండు రోజుల్లో తేలుతుంది’అని అన్నారు. అలా చెప్పడం సీపీఐ నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఓ సందర్భలో జానాతో వారు వాగ్వివాదానికి దిగారు. జానా స్పందిస్తూ కాంగ్రెస్‌లో కూడా ఆశావహులు ఎక్కువగా ఉన్నారని, వారిని సర్దిచెప్పడానికి సమయం పట్టతోందని సీపీఐ నేతలకు నచ్చజెప్పబోయారు. అలాగే ఈవిషయంలో టీడీపీ చొరవ తీసుకోవాలని అధ్యక్షుడు రమణకు సీపీఐ నేతలు సూచించారు. ‘ మా అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయాలపై సీట్ల పంపకాలు ఉంటాయి’అని రమణ చెప్పారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌తో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. సీట్ల పంపకాల అంశం తనకు కూడా తలనొప్పిగా ఉందని కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. అసలు మహాకూటమికి పునాదులు వేసిందే సీపీఐ అన్న విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోతోందని కమ్యూనిస్టుల నాయకులు విమర్శించారు. ఏదిఏమైనా శనివారం తమ పార్టీ కచ్చితమైన నిర్ణయం తీసుకుని అభ్యర్థులను ప్రకటిస్తుందని సీపీఐ సీనియర్ నేత డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు.