రాష్ట్రీయం

ఏపీపై ప్రభావమెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరగనున్నది. తెలంగాణ ఓటర్లు ఇచ్చే తీర్పు ప్రభావం జాతీయ రాజకీయాలపై, ముఖ్యంగా పొరుగున ఉన్న ఆంధ్ర రాష్ట్రంపైనా భారీగా పడుతుంది. అయితే ఈ ప్రభావం ఎవరికి అనుకూలిస్తుందనేది విశే్లషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ నుంచి పూర్తిగా మకాం మార్చుకుని అమరావతి నుంచే పాలన చేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు రానని, మీరే చూసుకోవాలని తెలంగాణ నాయకులకు చెప్పారు. కానీ కాంగ్రెస్‌తో కలిసి ప్రజాకూటమిగా ఏర్పడిన తర్వాత ఆయనలో ధైర్యం పెరిగింది. తొలుత ఖమ్మంలో ప్రచారం నిర్వహించి ప్రతిస్పందన చూశారు. ఖమ్మంలో ప్రజల నుంచి తిరుగుబాటు రాకపోవడంతో మరింత ధైర్యంగా హైదరాబాద్‌లో కలియ తిరిగారు. హైదరాబాద్‌లోనూ ఆదరణ లభించడంతో, రాష్ట్ర పాలనపై, టీఆర్‌ఎస్ నాయకత్వంపై గళం పెంచారు. తెలంగాణ ఓటర్లు ఎటువంటి తీర్పు ఇవ్వనున్నారు? అనేది 11వ తేదీన తేలిపోనున్నది. టీఆర్‌ఎస్ తిరిగి అధికారం చేపడితే ఆంధ్ర ఓటర్లపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?, ఒకవేళ కాంగ్రెస్, టీడీపీ నేతృత్వంలోని ప్రజా కూటమి అధికారాన్ని చేపడితే అక్కడ రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయనే అంచనాలు, చర్చ జరుగుతున్నది. టీఆర్‌ఎస్సే తిరిగి అధికారం చేపడితే తొలుత జరిగేది కూటమి విచ్ఛిన్నమే! కారణం కూటమిగా ఏర్పడినందుకే దెబ్బతిన్నామని కాంగ్రెస్, టీడీపీ నాయకులు పరస్పరం విమర్శించుకుంటారు. ఆంధ్ర పార్టీ అయిన టీడీపీతో కలిసినందుకే తాము నష్టపోయామని కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెడతారు. టీడీపీ కూడా అంతే ఎదురు దాడి చేయక మానదు. ఒకవేళ కూటమి విజయం సాధిస్తే ఆంధ్రలో అనూహ్యంగా రాజకీయాలు మారుతాయి. ఫలితంగా ఓటర్లపై ప్రభావం పడుతుంది. ప్రజా కూటమి విజయం సాధిస్తే నాలుగైదు నెలల్లో ఆంధ్రలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అంతేకాకుండా ఆంధ్ర ప్రజలూ కూటమిని ఆదరించే అవకాశం లేకపోలేదు. అక్కడ పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌కు టీడీపీ చేదోడు అవుతుది. అయితే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను విడదీసిన కాంగ్రెస్‌కు మళ్లీ ప్రజలు జీవం పోస్తారా?, రాష్ట్రాన్ని విడదీసినందుకే ఇంత పెద్ద శిక్ష విధించిన ప్రజలు మళ్లీ ఆదరిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ప్రజల కోపం తాత్కాలికమే. 1984 సంవత్సరం ఆగస్టులో ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కర రావు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారన్న అపవాదు ఉన్నప్పటికీ, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు ఆయన్ను ఆదరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనిషి కోపం శాశ్వతం కాదు, కాల క్రమేణా దాని తీవ్రత తగ్గుతుంది. రాష్ట్ర విభజన జరిగి నాలుగున్నర
సంవత్సరాలు దాటింది కాబట్టి ప్రజల కోపం తీవ్రత తగ్గుతుందని, పైగా కాంగ్రెస్-టీడీపీల కొత్త కలయిక పట్ల ప్రజలు ఆసక్తిగా ఆదరిస్తారని విశే్లషకుల అంఛనా.
జగన్ జత కట్టేది ఎవరితో..!?
తెలంగాణ ఓటర్ల తీర్పు తర్వాత ఆంధ్రలో తప్పని సరిగా రాజకీయ సమీకరణలు మారుతాయి. కూటమి ఆంధ్రలోనూ ఏర్పడితే, దానిని ఎదుర్కొవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పావులు కదుపుతారు. అప్పుడు ఆయన శతృవుకు శతృవు మిత్రుడు అన్న చందంగా బీజేపీతో దోస్తీ చేస్తారా?, అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి సినీ నటుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జన సేన పార్టీనీ కలుపుకుని వెళతారా? అనే కోణంలోనూ పరిశీలకులు లెక్కలు వేస్తున్నారు. తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, అపద్ధర్మ మంత్రి కే. తారక రామారావు ప్రభృతులూ ఆంధ్రకు వెళ్ళి జగన్‌కు బాసటగా నిలిచే అవకాశమూ లేకపోలేదు. ఏదైనా తెలంగాణ ఓటర్ల తీర్పు తర్వాతే మరింత లోతైన అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది.