రాష్ట్రీయం

ఉత్కంఠకు నేడు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: జడ్జిమెంట్ డే రానే వచ్చింది. మూడు రోజులుగా ఈవీఎమ్‌లలో నిక్షిప్తమైన ఓట్ల నిధి దక్కేదెవరికి? అందలం కోసం వారాల తరబడి సాగిన హోరాహోరీ పోరులో అంతిమ విజేత ఎవరు? ఎగ్జిట్ పోల్స్, వ్యక్తిగత సర్వేల సారమెంతో మరికొన్ని గంటల్లో నిగ్గుదేలనుంది. సవాళ్లను, విమర్శలను ఖాతరు చేయకుండా తెలంగాణలో ముందస్తు ఎన్నికల భేరి మోగించిన తెరాసకు జనం జేజేలు పలుకుతారా? అనూహ్య కలయికతో ఏర్పడ్డ ప్రజాకూటమిని గద్దెనెక్కిస్తారా? భిన్న అంచనాలు, నేల విడిచి సాముచేసిన కథనాలు పార్టీల అధినేతల్నే కాదు.. కొండంత ఆశతో బరిలోకి దిగిన అభ్యర్థులనూ డైలమాలో పడేశాయి. ఇంతకీ తెలంగాణ ఓటు ఎటు? తెలంగాణను సాధించుకున్నది తానేనంటున్న కేసీఆర్ తన అజేయత్వాన్ని మరోసారి నిరూపించుకోనున్నారా లేక తెలంగాణ ఇచ్చింది తామేనంటూ పలు పార్టీలను అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ అధికార ఆశలు ఫలిస్తాయా? సందేహాలు, సంశయాల మధ్య ఈవీఎమ్‌లు తెరుచుకోనున్నాయి. గుప్పిట దాగిన తెలంగాణ ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పబోతోంది. ఎవరికీ మెజార్టీ రాకపోతే పరిస్థితి ఏమిటి? అతిపెద్ద పార్టీనే గవర్నర్ పిలుస్తారా లేక ఎన్నికలకు ముందే జత కట్టిన ప్రజాకూటమిని సీట్ల సంఖ్యను బట్టి ఆహ్వానిస్తారా? తుది ఫలితం ఎలా ఉన్నా ప్రజాతీర్పే శిరోధార్యం. ఇలా ఉండగా నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలన, నాలుగు నెలల ఉత్కంఠతకు నేటితో తెరపడనుంది. మూడు రోజుల కిందట ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు నేడు వెల్లడికానుంది. తెలంగాణలో ప్రజలు ఇచ్చే తీర్పు ఈ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. నాలుగైదు నెలల్లో దేశవ్యాప్తంగా జరుగబోయే సార్వత్రిక ఎన్నికలను, దేశ
రాజకీయాలను ప్రభావితం చేయనుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, నాలుగున్నరేళ్ల పాటు పాలనను అందించిన తెలంగాణ రాష్ట్ర సమితికి తిరిగి ప్రజలు పట్టం కడతారా లేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈసారైనా తమ విధేయతను చాటుకుంటారా? అనేది ఈ ఫలితాలు తేల్చనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికార పగ్గాలు చేపట్టిన తెరాస పదవీకాలం ముగియడానికి తొమ్మిది నెలల ముందే శాసనసభను రద్దు చేసి ప్రజాతీర్పును కోరిన విషయం తెలిసిందే. తన నాలుగున్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నమ్ముకొని తెరాస సాహాసోపేతంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. కాగా తెరాస ప్రజలకు ఇచ్చిన హామీలను వమ్ము చేసిందని, తెలంగాణ రాష్ట్రంకోసం ప్రజలు కన్న కలలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి ప్రధాన ప్రత్యర్థిగా బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమదేనని చాటడానికి జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ఎన్నికలను వేదికగా మార్చుకున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీపీఐ జాతీయ అధ్యక్షుడు సురవరం సుధాకర్‌రెడ్డితో వివిధ రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, స్టార్ కాంపెయినర్స్ హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం తిరిగి తెరాసకే పట్టం కట్టండని తన వంటిచేత్తో రాజకీయ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన కేసీఆర్ మాట నెగ్గుతుందా? ప్రధాన ప్రత్యర్థి ప్రజాకూటమి వాదనకు ప్రజాతీర్పు తలొగ్గుతుందా అనే ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లో తెరపడనుంది.
చిత్రం..ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని ఈవీఎంలకు పహారా కాస్తున్న సాయుధ బలగాలు