రాష్ట్రీయం

కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: లక్షలాది మంది నగరవాసులు సంక్రాంతికి సొంతూరు బాటపట్టారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఇదే అదనుగా చేసుకుని ప్రైవేటు, ప్రభుత్వ వాహనాలు చార్జీలు పెంచేసి జనాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. రిజర్వేషన్లు దక్కని వారు రోడ్డు రవాణాసంస్థ, ప్రైవేటు బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో అదనపుచార్జీలు వసూలు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ మాత్రం టిక్కెట్‌పై 50 శాతం అదనంగా వసూలు చేయాలని నిర్ణయించినా, బస్సు కండక్టర్లు మాత్రం వంద శాతం పెంచేశారు. ఈ సందర్భంగా ప్రయాణీకులు, కండక్టర్ల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ప్రయాణీకులు ఎవరైనా ప్రశ్నిస్తే పైఅధికారుల ఆదేశాల మేరకే వసూలు చేస్తున్నామని కండక్టర్లు చెబుతున్నారు. ఇక ప్రైవేట్ బస్లు ఆపరేటర్ల సంగతి సరేసరి. ప్రయాణికుల నుంచి అడ్డూఅదుపూలేకుండా దోచుకుంటున్నారు. మామూలు రోజుల్లో 600 రూపాయలున్న టిక్కెట్‌ను 2,500 రూపాయల వరకూ పెంచేశారు. విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, రాజమండ్రి, కడప, తిరుపతి, చిత్తూరు, బెంగళూరుకు భారీగానే పెంచేసి వసూలు చేస్తున్నారు. రైల్వే అధికారులు అదనంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. అయినా ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్లు దొరికితే ఒట్టు. వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంటోంది. ప్రతి రైలుకూ ‘నో రూమ్’ బోర్డు. సామాన్య ప్రయాణికుల కోసం జన్‌సాధారణ్ రైళ్లను నడుపుతున్నారు. హైదరాబాద్- విజయవాడ మధ్య ఏకంగా 60 రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశారు. జనసాధారణ్ రైళ్లలో హైదరాబాద్- విజయవాడకు కేవలం రూ. 120 చార్జీ నిర్ణయించారు. ఈ రైళ్ల కోసం సామాన్య ప్రయాణికులు ఎగబడుతున్నారు. యథాప్రకారం పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్లాట్‌ఫారం టిక్కెట్టు 10 నుంచి 20 రూపాలకు పెంచేశారు. ఇలా ఉండగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా, తెలంగాణ జిల్లాలకు దాదాపు 5,252 బస్సులు నడుపుతున్నట్టు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ యాదగిరి తెలిపారు. తెలంగాణకు 3,673 బస్సులు, ఆంధ్రాకు 1,579 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఏపీకి 500 బస్సులు, తెలంగాణకు 855 బస్సులు తిప్పుతున్నారు. జేబీఎస్ నుంచి ఆంధ్రాకు 230, తెలంగాణకు 1,426 బస్సులు నడుపుతున్నారు. కేపీహెచ్‌బీ నుంచి ఆంధ్రాకు 323, తెలంగాణకు 113 బస్సులు, ఉప్పల్ క్రాస్‌రోడ్డు నుంచి ఆంధ్రాకు 20, తెలంగాణకు 454, ఎల్‌బీ నగర్ నుంచి ఆంధ్రాకు 156, తెలంగాణకు 825 బస్సులు నడుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఎంజీబీఎస్ నుంచి రెగ్యులర్‌గా నడిచే బస్సులు ప్లాట్‌ఫామ్‌ల నుంచి బయలుదేరతాయని చెప్పారు. ప్రయాణికుల సమచారం కోసం తీతీతీ. టీఎస్‌ఆర్‌టీసీ ఆన్‌లైన్.ఇన్‌తో వివరాలను తెలుసుకోవచ్చు.