ఆంధ్రప్రదేశ్‌

వైసిపిని కుంగదీస్తున్న వలసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. భూమాతో సహా ఎనిమిది మంది ఒకే బృందంగా టిడిపిలో చేరిపోవడంతో మొదలైన వలసలు కొనసాగుతునే ఉన్నాయి. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో వైకాపా ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి తీవ్ర ఇబ్బంది కలిగించింది. ఆయనతోపాటు వరుపుల సుబ్బారావు టిడిపిలోకి వెళ్లిపోతున్నారు. వచ్చే నెలలో మరికొంతమంది ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ వలసలు ఎక్కడితో ఆగుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి వరకూ అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన వారంతా ఇప్పుడు ఆపార్టీ గూటికే చేరారు. పట్టిసీమతో సహా అనేక అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన వైకాపా ఎమ్మెల్యేలు, ఇప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాయాల్సి వస్తుంది.
నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి తాము పార్టీ వీడి వెళ్లిపోతున్నామని వలస వెళ్లిన ఎమ్మెల్యేలు చెపుతున్నారు. అయితే, అందులో ఎంత వాస్తవం ఉంది? సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా పెద్దగా పనులు జరగడం లేదన్నది నిజం. ఆమాటకు వస్తే, చాలా జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మాటను, ఆయా జిల్లాల్లోని అధికారులే ఖాతరు చేయడం లేదు. వారికి తెలియకుండా బదిలీలు జరిగిపోతున్నాయి. విశాఖ జిల్లా ఎస్పీ నియామకం ఆ జిల్లా ఎమ్మెల్యేలకే తెలియదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు, ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి ఎమ్మెల్యేలు కనీసం టీచర్లను, కానిస్టేబుళ్లను కూడా బదిలీ చేయించుకోలేని దుస్థితి ఉంది. అధికారులకు వ్యతిరేంకగా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా, చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోపోగా, ఎమ్మెల్యేల వైఖరినే తప్పుపడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో వైకాపా నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల మాటకు ఏమేరకు విలువుంటుందో వేచి చూడాలి.ఇక కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశించి ఆ పార్టీలోకి వెళ్లారని చెపుతున్నారు. మరికొంతమంది మంత్రి పదవి ఇస్తే, వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. చంద్రబాబు క్యాబినెట్‌లో ఇంకా చాలా మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. అలాగే నామినేటెడ్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. వైకాపా నుంచి వలస వెళ్లిన ఎమ్మెల్యేల్లో ఎంతమందికి చంద్రబాబు ఈ పదవులను కట్టబెట్టగలరు? అదే జరిగితే, టిడిపిలో అసంతృప్తులు, అసమ్మతులు ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అంశాన్ని పక్కనపెడితే, జగన్ వైఖరి నచ్చకే తాము పార్టీ నుంచి వెళ్లిపోతున్నామని వలసపోతున్న ఎమ్మెల్యేలు చెపుతున్నారు.
21 మంది ఎమ్మెల్యేలు తనతో వస్తే, ప్రభుత్వాన్ని పడగొట్టడం పెద్ద పనేం కాదని జగన్ అనడం, ఆ మాటను అధికార పార్టీ సీరియస్‌గా తీసుకుని ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. ప్రస్తుతానికి పదికి చేరుకున్న వలస పక్షుల సంఖ్యను అధికారపార్టీ ఎంతవరకూ పెంచుతుందో వేచి చూడాలి! జగన్ వైఖరి నచ్చలేదని చెపుతున్న వారు టిడిపిలోకి వస్తున్నారు? వాళ్లు ఎంత కాలం ఆ పార్టీలో ఎంత కాలం కొనసాగుతారు? వచ్చే ఎన్నికలకు కూడా అదే పార్టీలో ఉంటారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న
ఇదిలా ఉండగా పార్టీ నుంచి ఒక్కరొక్కరుగా వెళ్లిపోతున్నారు. అయినా, జగన్ స్పందించకపోవడం గమనార్హం. వలసపోతున్న ఎమ్మెల్యేలను నిరోధించేందుకు జగన్ ఎందుకు ప్రయత్నించడం లేదు? అసెంబ్లీ సాక్షిగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయించడానికి జగన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోగా, సభలో ఆ పార్టీ అభాసుపాలైంది. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయించడానికి ఆయన చేసిన పోరాటం ఫలించలేదు. అవిశ్వాస తీర్మానాలను అధికారపార్టీ బుల్డోజ్ చేసేసింది. జగన్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఒంటికాలిపై లేచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సమయం దొరికినప్పుడల్లా చురకలు వేస్తునే ఉన్నారు. ఇటువంటి ఘటనలు పార్టీ ప్రతిష్ఠతోపాటు, జగన్ ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీశాయి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జగన్ తీసుకుంటున్న చర్యలేంటో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.

మారుతున్న నంద్యాల రాజకీయం

టిడిపిలో ఇమడలేని స్థితిలో మాజీ మంత్రి శిల్పా పార్టీని వీడే అవకాశం లేకపోలేదు

కర్నూలు, మార్చి 30 : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వైకాపా నుంచి తెలుగుదేశంపార్టీలో చేరడంతో కర్నూలు జిల్లా నంద్యాలలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. భూమా చేరికతో నంద్యాల శాసనసభా నియోజకవర్గం టిడిపిలో మూడు వర్గాలు తయారయ్యాయి. దీంతో అప్పట్లోనే ఒకే ఒరలో మూడు కత్తులు ఇముడుతాయా అనే అనుమానం తలెత్తింది. ఈ నేపథ్యంలో భూమాతో మాజీ మంత్రి ఫరూక్ కలిసిపోవడంతో మూడు వర్గాలు కాస్త రెండయ్యాయి. శిల్పా మోహనరెడ్డి మాత్రం భూమాతో కలిసి పనిచేయలేని పరిస్థితులు ఉండటంతో ఆ రెండు వర్గాల మధ్య విభేదాలు రాజుకుంటూనే ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలో ఈ రెండు వర్గాలు పట్టుదలకు పోతుండటంతో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. ఈ పరిస్థితుల నడుమ శిల్పా అనుచరుడు తులసిరెడ్డిపై దాడి జరగడంతో ఆయన వర్గం ఉలిక్కి పడుతోంది. అంతేగాక భూమా పార్టీలో చేరిన తరువాత తమ ప్రాధాన్యత తగ్గుతోందన్న ఆందోళనలో శిల్పా మోహనరెడ్డిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నంద్యాల పట్టణంలో రహదారుల విస్తరణ కార్యక్రమం ప్రారంభం కావడం, ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడమే కాకుండా అధికారులు కూడా ఎమ్మెల్యే నాగిరెడ్డి సూచనలను పాటించడం శిల్పాకు ఇబ్బందికరంగా మారిందని భావిస్తున్నారు. తాజాగా తులసిరెడ్డిపై దాడి ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన శిల్పా మోహనరెడ్డికి ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదని చర్చించుకుంటున్నారు. భూమా చేరిక తరువాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శిల్పా మోహనరెడ్డి ఆలోచనలో పడ్డారని వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నా ఆశ్చర్యం లేదని పలువురు పేర్కొంటున్నారు. భూమా పార్టీని వీడినా ఇంత వరకూ వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జిని నియమించకపోవడం దీనికి బలాన్నిస్తోందని విశే్లషకులు భావిస్తున్నారు. కాగా భవిష్యత్తు కార్యాచరణపై శిల్పా మోహనరెడ్డి తొందరపడి నిర్ణయాలు తీసుకోరని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. పార్టీలో జరుగుతన్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించి చక్కదిద్దుతారనే ఆశాభావంతో ఉన్నారు.