రాష్ట్రీయం

ముంపు గ్రామాలపై మళ్లీ పేచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా భద్రాచలం రెవెన్యూ గ్రామం ఆనుకుని, ఆంధ్రలో విలీనమైన నాలుగు పంచాయితీ గ్రామాలను మళ్లీ తెలంగాణలో విలీనం చేసే విషయమై రెండు రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కింది. సిఎం చంద్రబాబుతో ఈ నాలుగు గ్రామాల గురించి మాట్లాడితే, ఇచ్చేందుకు అంగీకరించారని సిఎం కె చంద్రశేఖరరావు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు ప్రకటన చేశారు. ఖమ్మం పర్యటన సందర్భంగా ఒకసారి, తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయమై ప్రెజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా మరోసారి కెసిఆర్ ప్రకటించారు. కాగా అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఒకసారి ప్రకటన చేశారు. విజయవాడలో విలేఖర్ల సమావేశంలో కూడా ఆంధ్ర సిఎం చంద్రబాబు ఈ విషయం తనకేమీ తెలియదని ఇటీవల అన్నారు. ఈ నాలుగు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేసే ప్రతిపాదనపై ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని ఒక్కటే తెలంగాణలో విలీనం చేశారు. ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్న ఎటిపాక, పురుషోత్తంపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు ఆంధ్రలోకి వెళ్లాయి. గోదావరి గట్టునే విస్తరించి ఉన్న చర్ల, వాజేడు, దుమ్ముగూడెం, వెంకటాపురం మండలాలకు తెలంగాణ ప్రజలు వెళ్లాలంటే మధ్యలో ఆంధ్రలో విలీనమైన గ్రామాలున్నాయి. దీనివల్ల స్ధానిక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారు. ఈ నాలుగు పంచాయితీ గ్రామాల పరిధిలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. పైగా భద్రాచలం రామయ్య ఆస్తులన్నీ ఈ గ్రామాల్లో ఉన్నాయి. పురుషోత్తంపట్నంలోనే భద్రాచలం రామాలయానికి చెందిన 900 ఎకరాలు ఉన్నాయి. భద్రాచలంలో కలిసిపోయినన రాజుపేట, శ్రీరాంనగర్ కాలనీ కూడా ఆంధ్రలో విలీనమయ్యాయి. విలీనమైన నాలుగు పంచాయితీల్లో 12041 ఎకరాలు ఉన్నాయి. భద్రాచలం రెవెన్యూ గ్రామం కేవలం 2067 ఎకరాలకు పరిమితమై విస్తరించేందుకు అవకాశం లేకుండా పోయింది. భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా తగిన స్ధలం లేదు. స్ధానిక గిరిజన ప్రజల ఆకాంక్షల మేరకు సిఎం కెసిఆర్ ఈ విషయమై ఏపి సిఎం చంద్రబాబుతో చర్చించారు. ఈ విషయాన్ని కెసిఆర్ రెండుసార్లు బహిరంగంగా ప్రకటించారు. చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు కూడా కెసిఆర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, పోలవరం ప్రాజెక్టు వల్ల బూర్గంపహాడ్ మండలం నీట మునుగుతుంది. ఈ ప్రాజెక్టుకు అవాంతరాలు లేకుండా ఉండాలంటే బూర్గంపహాడ్ రెవెన్యూ గ్రామం ఆంధ్రాలో విలీనం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు 2014లోనే లేఖ రాసింది. బూర్గంపహాడ్‌ను తొలుత ముంపు మండలాల విలీన గ్రామాల్లో కలిపినా, చివరకు మినహాయించి, ఆరు గ్రామాలనే ఆంధ్రాలో విలీనం చేశారు. ప్రస్తుతం కెసిఆర్ కోరుకుంటున్న నాలుగు పంచాయితీ గ్రామాల్లో ఎటపాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఆంధ్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. స్మార్ట్ విలేజిగా ఎటపాకను ఖరారు చేసింది. ఎటపాక మండల, రెవెన్యూ డివిజన్ కేంద్రం, భద్రాచలంకు కేవలం రెండు కి.మీ దూరంలో ఉంది.
కాగా పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన ఖమ్మం జిల్లాకు చెందిన వేలేరుపాడు, కుక్కనూరు మండలాలకు వెళ్లాలంటే ఆంధ్రకు రోడ్డు సదుపాయం లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉన్న అశ్వారావుపేట పరిసరాల్లో నుంచి ఈ మండలాల ప్రజలు ఏలూరుకు వెళ్లాల్సి వస్తోంది. తమకు బూర్గంపహాడ్ రెవెన్యూ గ్రామంతో పాటు వేలేరుపాడు, కుక్కనూరు నుంచి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చేందుకు అడ్డుగా ఉన్న తెలంగాణకు చెందిన గ్రామాలు, వీలైతే అశ్వరావుపేటను కూడా తమ రాష్ట్రంలో విలీనం చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతున్నట్లు సమాచారం. సున్నితమైన అంశాలైనందున ఈ విషయాలపై అధికారులు బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.
రాష్ట్ర భౌగోళిక విభజన పూర్తయినందున ఇప్పుడు గ్రామాలు అటూ, ఇటూ మారాలంటే పార్లమెంటులో ఏపీ పునర్విభజన చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. పైగా రెండు రాష్ట్ర అసెంబ్లీలు కూడా ఈ ప్రతిపాదనలకు తమ అభిప్రాయం తెలపాల్సి ఉంటుంది. ఈ అభిప్రాయాలు ఎలా ఉన్న, పార్లమెంటు సవరణలు సరిపోతాయి. వాస్తవానికి కెసిఆర్ పేర్కొన్నట్లు నాలుగు పంచాయితీ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయడం వల్ల ఏపీకి వచ్చే నష్టమేమీ లేదు. కానీ పోలవరం ప్రాజెక్టుకు అవరోధాలు తొలగించేందుకు బూర్గంపహాడ్, అశ్వరావుపేట పరిసరాల్లోని కొన్ని గ్రామాలను తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలో విలీనమయ్యేందుకు అంగీకరిస్తుందా? శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాచలానికి వెళ్లనున్నారు. ఆ రోజు కెసిఆర్ ఏమైనా ఈ అంశంపై తదుపరి ప్రకటన చేస్తారా? ఆంధ్ర ప్రభుత్వం ఇంతవరకు బహిరంగంగా ఈ విషయమై స్పందించలేదు. ముంపు మండలాల గ్రామాల విలీనం ప్రక్రియ సాఫీగా జరుగుతుందా? లేక అలజడికి దారితీస్తుందా? వేచిచూడాల్సిందే.