ఆంధ్రప్రదేశ్‌

మంత్రి పదవి రేసులో సోమిరెడ్డి--- ఉగాది విస్తరణలో చోటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 3: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో ఎమ్మెల్సీ సోమిరెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 19 మంది మంత్రులు ఉన్నారు. ఎమ్మెల్యేల నిష్పత్తి మేరకు మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇవ్వవచ్చు. త్వరలో చేపట్టనున్న విస్తరణలో ఒక సీటును ముస్లింలకు, మరొక స్థానం ఎస్సీలకు కేటాయిస్తానని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించడంతో మిగిలిన నాలుగు అవకాశాల కోసం ఎమ్మెల్యే బారులు తీరుతున్నారు. అయితే వీటిలో ఇటీవల వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూలకు చంద్రబాబు మాట ఇచ్చినట్లు సమాచారం. ఇక మిగిలిన రెండు స్థానాలకు పోటీ అంతా ఇంతా కాదు. ఒక వేళ కొందరిని తొలగించే పరిస్థితి ఏర్పడితే మరికొంత మందికి అవకాశం వచ్చినట్లే. ఈ కోవలో రాష్ట్రంలోనే సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యునిగా గుర్తింపు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సోమిరెడ్డికి ఈ దఫా అవకాశం తప్పకుండా వస్తుందని ఆయన అనుచరులు గట్టి నమ్మకంతో ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం మంత్రివర్గంలో నారాయణ ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణ రూపంలో పలు గురుతర బాధ్యతలను చంద్రబాబు ఆయనకు అప్పగించారు. ఈ కారణంతో ఆయన జిల్లాపై దృష్టి సారించలేక పోతున్నారు. దీనికి తోడు జిల్లాలో అధికార పక్షం కంటే అధికంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండడం, వారు తరచూ మంత్రిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తుండడంతో వారిని దీటుగా ఎదుర్కొనే విషయంలో అన్ని శాఖలపై సమగ్ర పట్టున్న సోమిరెడ్డి గురించి ఆలోచించే అవకాశం ఉంది.

శేషాచలం అడవుల్లో
ఆగని స్మగ్లింగ్!
రూ.3 కోట్లు విలువ చేసే
ఎర్రచందనం దుంగలు పట్టివేత
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఏప్రిల్ 3: ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ప్రభుత్వం, రెవెన్యు, పోలీసు ఉన్నతాధికారులే రంగంలోకి దిగినా ప్రయోజనం కన్పించడం లేదు. కడప -చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని కుక్కలదొడ్డి సమీపంలో రూ.3కోట్లు విలువ చేసే ఎర్రచందనం దుంగలను ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 80 దుంగలతో పాటు లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా పెద్ద ఎత్తున ఎర్రకూలీలు వారి కంటబడ్డారు. ఈ సమయంలో దాడిచేయగా కూలీలు పరారయ్యారు. 80దుంగలు, లారీని స్వాధీనం చేసుకున్నారు. ప్రతినిత్యం ఎర్రచందనం శేషాచలం అడవుల్లో ప్రత్యేకించి రైల్వేకోడూరు అటవీ ప్రాంతంలో కోట్లరూపాయలు విలువచేసే ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
సంతలో పశువుల్లా
ఎమ్మెల్యేలను కొంటున్నారు
రఘువీరారెడ్డి ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, ఏప్రిల్ 3: రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేస్తోందని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య విధానంలో ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర ఆదివారం సాయంత్రం అనంతపురం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోని వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ విస్మరించిందన్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు 600 హామీలను ఇవ్వగా, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసిలకు మాత్రమే 124 హామీలను ఇచ్చారన్నారు. ఇప్పటికీ ఆ హామీలను నెరవేర్చలేదంటూ, ప్రజల పట్ల, వారి సంక్షేమం పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు రెండూ దివాళా తీసిన పార్టీలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై రకరకాల ఛార్జీల వడ్డనతో భారం మోపాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిగలకు ఇచ్చిన హామీలను ఏ మాత్రం నిలబెట్టుకోలేదన్నారు.
రాష్ట్భ్రావృద్ధికి
కేంద్రం సానుకూలం
మంత్రి మాణిక్యాలరావు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, ఏప్రిల్ 3: రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం సానుకూలంగా ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరులో విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయలన్న దిశగా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర రాజధాని శంకుస్థాపన రోజునే ఐదు విశ్వవిద్యాలయాలను మంజూరు చేసి, పలు సంక్షేమ కార్యక్రమాల కోసం సుమారు 1300 కోట్ల రూపాయలు కేటాయించి ఏపి పట్ల తన విశ్వాసాన్ని కేంద్రం చాటుకుందన్నారు. ప్రశాంతంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో సైతం కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టడం కాంగ్రెస్, వామపక్షాలకే చెల్లిందన్నారు. వీటిని తిప్పికొట్టడానికి బిజెపి ఆధ్వర్యంలో మరో పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పదవుల విషయంలో అసంతృప్తి, గొడవలు పడవద్దని సూచించారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను విస్మరించే ప్రసక్తే లేదన్నారు. ఈనెల 6న బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వాడవాడలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

చల్లబడిన
ఉత్తర కోస్తా
నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 3: మధ్యాహ్నం వరకూ ఎండతీవ్రతతో ఇబ్బంది పడుతున్న ఉత్తర కోస్తా తీర ప్రాంతవాసులు సాయంత్రం పూట వీస్తున్న చల్లగాలులతో సేదదీరుతున్నారు. ఈ పరిస్థితి గత రెండు రోజులుగా ఉత్తర కోస్తాలోని చాలా ప్రాంతాల్లో నెలకొంది. పగటి ఉష్ణోగ్రత దాదాపు 39 డిగ్రీల సెల్సియస్ ఉంటోంది. దీనికి తోడు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత తప్పడం లేదు. అయితే గత రెండు రోజులుగా సముద్ర తీరప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై చల్లబడుతోంది. చల్లని గాలులు వీస్తున్నాయి. సముద్రం నుంచి వస్తున్న చల్లని గాలుల కారణంగా ఈ పరిస్థితి నెలకొంటోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు అయినప్పటికీ, రెండు రోజులకు ఒకసారైనా ఆకాశం మేఘావృతమై చల్లబడుతుంటుందని తెలిపారు. దీనికి తోడు ఎతె్తైన ప్రాంతాల్లో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొంటుందన్నారు. ఉత్తర కోస్తాలో నెలాఖారు వరకూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంటుందని, ఆ తరువాత ఇది దక్షిణ కోస్తాకు విస్తరిస్తుందని భావిస్తున్నామన్నారు. ఇదే సమయంలో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోల కాల్పులు
తీవ్రంగా గాయపడ్డ బిజెపి యువ నేత
చింతూరు, ఏప్రిల్ 3: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బిజెవైఎం జిల్లా యూత్ అధ్యక్షుడు మురళీకృష్ణనాయుడుపై మావోయిస్టులు శనివారం రాత్రి కాల్పులు జరిపి తీవ్రంగా గాయపర్చారు. బీజాపూర్ ఎస్పీ కెఎల్ ధ్రు తెలిపిన వివరాల ప్రకారం.. మురళీకృష్ణనాయుడు శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో బైరంగర్ పట్టణంలోని ఒక దేవాలయానికి వెళ్లగా ముందుగానే అక్కడకు చేరుకున్న నలుగురు మావోయిస్టులు ఒక్కసారిగా అతనిపై కాల్పులు జరిపి గాయపర్చారు. అనంతరం ఆయుధాలతో మావోయిస్టులు దాడిచేసేందుకు అతని వద్దకు వెళుతుండగా ప్రజలు ప్రతిఘటించడంతో మావోయిస్టులు వెళ్లిపోయినట్లు ఎస్పీ తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ మురళీకృష్ణనాయుడిని హెలికాఫ్టర్ ద్వారా జగదల్‌పూర్ తరలించి, మెరుగైన వైద్యం కోసం రాయపూర్ తరలించినట్టు ఎస్పీ కెఎల్ ధ్రు తెలిపారు. మురళీకృష్ణనాయుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి మహేష్ గడ్డాకు ఆప్తుడు. నా నియోజకవర్గమైన బీజాపూర్ వ్యవహారాలను మురళీకృష్ణనాయుడు చూసుకుంటున్నారని, అందుకే అతనిపై మావోయిస్టులు కాల్పులు జరిపి ఉంటారని మంత్రి మహేష్ గడ్డా అనుమానం వ్యక్తం చేశారు.

సాగర్ కుడికాలువకు

నిలిచిపోయిన
నీటి సరఫరా
విజయపురిసౌత్, ఏప్రిల్ 3: ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మంచినీటి అవసరాల నిమిత్తం నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడికాలువ ద్వారా విడుదలవుతున్న నీటిని ఆదివారం పూర్తిగా నిలిపివేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో కృష్ణా రివర్‌బోర్డు ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ జలాశయం నుండి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని అధికారులు కోరగా, గత పదిరోజులుగా సాగర్ జలాశయం నుండి కుడికాలువ ద్వారా నీటిని సరఫరా చేశారు. విడుదల చేసిన నీటితో సాగర్ ఆయకట్టు పరిధిలోని చెరువులను, కుంటలను నింపుకున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 507.20 అడుగులకు చేరుకుంది. ఇది 128.1323 టీఎంసీలకు సమానం. ఎడమకాలువ ద్వారా 5086 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లోగా 7786 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 800.30 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది 29.1314 టీఎంసీలకు సమానం. ఎగువ జలాశయాలైన రోజా, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.