రాష్ట్రీయం

భద్రాద్రి అభివృద్ధికి బృహత్ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: యాదాద్రి, వేములవాడ తరహాలోనే భద్రాద్రి అభివృద్ధికి బృహత్ ప్రణాళికను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించనున్నారు. భద్రాద్రిలో ఈనెల 15న శ్రీ సీతారామచంద్ర కల్యాణ మహోత్సవానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రణాళికను కేసిఆర్ ప్రకటిస్తారు. భద్రాద్రి సీతారామ కల్యాణానికి కేసిఆర్ కుటుంబ సమేతంగా హాజరై స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరై సీతారామ కల్యాణాన్ని తిలకిస్తారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. భద్రాద్రి అభివృద్ధికి ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అనే దానిపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, అధికారులు, ఆలయ పండితులు, స్తపతిలతో చర్చించారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలోని ఆలయాలను వాటి ప్రాశస్త్యాన్ని బట్టి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాల అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో భద్రాద్రిని కూడా అదే రీతిలో తీర్చిదిద్దాలని సంకల్పించారు. శాశ్వత ప్రాతిపదికన శ్రీరామచంద్ర స్వామి ఆలయం, పర్ణశాల అభివృద్ధి పనులు, భద్రాచల పట్టణాభివృద్ధి, భద్రాచల పట్టణానికి అనుసంధానంగా జాతీయ రహదారుల నిర్మాణంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్, భద్రాచలం ఇవో జ్యోతి, దేవాదాయ శాఖ అధికారులు, ఐటిసి, సింగరేణి కాలరీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భద్రాద్రిలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. గాలిగోపురం నిర్మాణం, మాడ వీధుల అభివృద్ధి, కల్యాణ మంటపం, రెండవ ప్రాకారం నిర్మాణం, పర్ణశాల అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికలను వారం రోజుల్లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలు అందిన వెంటనే ముఖ్యమంత్రికి అందజేస్తారు. తెలంగాణ ఆవిర్భవించాక భద్రాచలం ఆలయం మినహా మిగిలిన ప్రాంతాలు ఆంధ్ర ప్రాంతంలో కలిపి వేశారని, వాటిని తెలంగాణలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని మంత్రులు తెలిపారు. ఆంధ్ర ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వాలతో కెసిఆర్ చర్చలు జరుపుతున్నారని తెలిపారు.

చిత్రం సోమవారం సచివాలయంలో దేవాదాయశాఖ అధికారులతో సమీక్షిస్తున్న
తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు