తెలంగాణ

క్రమశిక్షణా సంఘానికి రాజాసింగ్ వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు తెలిపారు. రాజా సింగ్ వ్యాఖ్యలను పరిశీలించేందుకు పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ భూపతి రెడ్డికి పంపించినట్లు ఆయన చెప్పారు. పార్టీ ‘కోర్’ కమిటీ సమావేశమై రాజా సింగ్ వ్యాఖ్యలు, స్థానిక సంస్ధల ఎన్నికల వ్యవహారంపై చర్చించింది. సమావేశానంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ‘బీఫ్’ ఫెస్టివల్‌కు తాము అనుకూలం అన్నట్లు రాజాసింగ్ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. బీఫ్ ఫెస్టివల్ విషయంలో కిషన్‌రెడ్డి మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ బహిరంగంగా చేయడం సరైంది కాదని అన్నారని ఆయన చెప్పారు. గోవధకు తాము వ్యతిరేకమని ఆయన తెలిపారు. స్థానిక సంస్ధల కోటా నుంచి 12 ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో తాము టిడిపితో కలిసి పోటీ చేస్తామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

చెన్నైకి విమానాలు రద్దు
హైదరాబాద్, డిసెంబర్ 2: తమిళనాడులో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్-చెన్నై మధ్య రాకపోకలు సాగించే విమానాలు బుధవారం రద్దయ్యాయి. ఉదయం 5-55 గంటలకు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానాలు, మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి బయదేరాల్సిన ఎల్‌జి-671 విమానాన్ని కూడా రద్దుచేశారు. మధ్యాహ్నం 2-50 గంటలకు వెళ్లాల్సిన చెన్నై విమానం, సాయంత్రం చెన్నైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 546 విమానంతోపాటు 5-10 గంటలకు బయలుదేరాల్సిన 6ఈ-381, రాత్రి 8-25 వెళ్లాల్సిన 9డబ్ల్యు-392 విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. అలాగే చెన్నైనుంచి రావాల్సి అన్ని విమానాలూ రద్దయ్యాయి. ఇవేకాక కోయంబత్తూరు విమానాశ్రయం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఉదయం 11 గంటలకు చేరుకోవాల్సిన ఎల్‌బి671 విమానాన్ని కూడా రద్దుచేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారవర్గాలు తెలిపాయి.

ఎంటెక్, ఎంఫార్మసీ రెండో
సెమిస్టర్ ఫలితాలు వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 2: కుకట్‌పల్లి జెఎన్‌టియు ఎంటెక్, ఎంఫార్మసీ రెండో సెమిస్టర్ ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి వివరాలను వెల్లడించింది. ఎంటెక్ 2వ సెమిస్టర్‌లో 18663 మంది నమోదు కాగా, 14,961 మంది హాజరయ్యారని వారిలో 7,252 మంది ఉత్తీర్థులై 48.47 శాతం ఉత్తీర్ణత సాధించారని జెఎన్‌టియు తెలిపింది. ఎంఫార్మసీ రెండవ సెమిస్టర్‌లో 3681 మంది నమోదు చేసుకుంటే 2,830 మంది హాజరవగా, 1278 మంది ఉత్తీర్ణులై 45.16 శాతం ఉత్తీర్ణత సాధించారని జెఎన్‌టియు ఇవాల్యూయేషన్ డైరక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్, రీవాల్యూయేషన్ చేయించుకునే అభ్యర్థులకు డిసెంబర్ 10 చివరి తేదీగా తెలిపింది.
ఐఎంటిలో రెండు రోజుల ఉత్సవం
హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్కాలజీ (ఐఎంటి) ఈ నెల 5, 6 తేదీల్లో వార్షిక మేనేజ్‌మెంట్ ఫెస్టివల్ ‘ఇంఫెల్జ్’ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రముఖ బిజినెస్ స్కూల్స్ అహ్మదాబాద్ ఐఐఎం, రాయపూర్ ఐఐఎం, ఐఐఎం కోజికోడ్, ఐఎస్‌బి, ఎస్‌ఐబిఎం పుణె, మరికొన్ని బిజినెస్ స్కూళ్ల నుంచి విద్యార్థులు హాజరవుతున్నారని ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఫెస్టివల్‌ను శ్రీనివాస హేచరీస్ గ్రూప్ వైస్ చైర్మన్, డైరక్టర్ సురేష్ రాయుడు చిట్టూరి ప్రారంభించనున్నట్లు తెలిపారు. దాదాపు వివిధ విభాగాలకు చెందిన 11 క్లబ్బులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నాయని ఐఎంటి వెల్లడించింది.
టి.హబ్‌ను సందర్శించనున్న
మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన టి హబ్‌ను మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల సందర్శించనున్నారు. ఈ నెల 28న టి హబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఉద్ధేశించి ఆయన ప్రసంగించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. మూడు రోజుల పాటు సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో ఉండనున్నారు.
26న సాధారణ సెలవు దినం
హైదరాబాద్: ఈ నెల 26వ తేదీని సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు బాక్సింగ్ డేను పురస్కరించుకుని ప్రస్తుతం ఇస్తున్న ఐచ్ఛిక సెలవు దినాన్ని సాధారణ సెలవు దినంగా మారుస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.