ఆంధ్రప్రదేశ్‌

తెలుగుకు దక్కని గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 5: తెలుగు రాష్ట్రంలో తెలుగుభాష పూర్తి నిర్లక్ష్యానికి గురవుతోందని, తెలుగుభాషకు తగిన గౌరవం దక్కడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, కేంద్ర హిందీ విభాగం సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చైన్నై క్వీన్ మేరీస్ కాలేజ్‌లో తెలుగు విభాగాన్ని పునరుద్ధరించుకోగలిగామని, రాష్ట్రంలో మాత్రం తెలుగు భాషకు సముచిత స్థానాన్ని దక్కించుకోలేకపోతున్నామన్నారు. రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతి నిర్మాణ శిలాఫలకం ఆంగ్లంలో ఏర్పాటు చేయడం పాలకుల వైఖరిని తేటతెల్లం చేస్తోందన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను తెలుగులో ప్రవేశపెట్టాల్సి ఉండగా, ఆంగ్లమే రాజ్యమేలుతోందన్నారు. తెలుగు భాషాభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకున్న చట్టాలు ఎక్కడా అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని యార్లగడ్డ కోరారు.

సంక్షేమ పథకాలు అందడం లేదు
ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఏప్రిల్ 5: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోన ఎర్రిపల్లి గ్రామానికి వెళ్లి మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. పలువురు మహిళలు జగన్‌కు సమస్యలను విన్నవిస్తూ రుణాలుమాఫీ కాలేదని, ఉపాధిహామీ పనులు లేవని, సంక్షేమ పథకాలు అందడంలేదని అన్నారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ ప్రభుత్వం మెడలు వంచైనా ఉపాధిహామీ పనులు కల్పిస్తామని, పెన్షన్,గృహనిర్మాణాలకు అర్హులైన వారందరికీ జన్మభూమి కమిటీలు న్యాయం చేయకపోతే పోరాడతామని అన్నారు. గతనెల 16న పులివెందుల మండలం ఎర్రేపల్లెకు చెందిన అన్నారెడ్డి శివశంకర్‌రెడ్డి (37) అనే రైతు ఆత్మహత్య చేసుకోగా, ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని, ఏ ఒక్కరూ అధైర్యపడరాదని భరోసా ఇచ్చారు. ఆయన వెంట వైసిపి జిల్లా అధ్యక్షుడు ఏ.అమరనాధరెడ్డి, కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప, రాయచోటి, కోడూరు వైకాపా ఎమ్మెల్యేలు ఎస్‌బి అంజద్‌బాష, జి.శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో గవర్నర్
తిరుమల, ఏప్రిల్ 5: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 8న శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టిటిడి అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ తిరుమంజనం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందస్తుగా తెలిపారు. తెలుగు సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెంది ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని తాను ఆ దేవదేవుని ప్రార్థించినట్లు తెలిపారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. టిటిడి అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దుచేసింది. ఇతర ఆర్జిత సేవలు యథాతథంగా నిర్వహించారు. ఆలయంలోని అనందనిలయం మొదలుకొని బంగారువాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు,పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు.
సిబిఐకి చిక్కిన గుడివాడ ఐటిఓ
గుడివాడ, ఏప్రిల్ 5: కృష్ణాజిల్లా గుడివాడ ఆదాయపు పన్నుశాఖ అధికారిణి(వార్డు-1) సిహెచ్ రాజసిరి ఒక రియల్టర్ నుండి రూ.1.50లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. సీబీఐ డిఎస్పీ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం స్క్రూటినీకి రావాలంటూ రియల్టర్‌ను కార్యాలయానికి పిలిపించి రూ.5లక్షలు డిమాండ్ చేయగా రూ.2.50లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. మంగళవారం రాత్రి రూ.1.50లక్షలను రియల్టర్ నుండి ఐటివో రాజసిరి తీసుకుంటుండగా సీబీఐ బృందం వలపన్ని ఆమెను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని డిఎస్పీ గోపాలకృష్ణ చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
బళ్లారి, ఏప్రిల్ 5 : కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా మోళకాల్మూరు తాలూకా బిజి కెరె సమీపంలో హైవే 19లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి బళ్లారి వైపు వస్తున్న కారును చెళ్లకెరె వైపునకు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బళ్లారికి చెందిన కెకె మధ్వరాజ్(45), సతీష్‌రెడ్డి(38), శ్రీరాములు(40), కారు డ్రైవర్ కుమార్ (27), సండూరు గ్రామానికి చెందిన అనిల్ (18) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన లారీ డ్రైవర్ రాములయ్యను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కాశ్మీర్ సిఎంకు బాబు అభినందనలు
విజయవాడ, ఏప్రిల్ 5: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఫ్తీకి ముఖ్యమంత్రి అభినందనలు తెలియచేశారు. మంగళవారం ఆయన ముఫ్తీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జమ్మూకాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మెహబూబా ముఫ్తీ తండ్రి అడుగుజాడల్లో నడిచి జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆదరణ చూరగొలాని ఆయన కోరారు.
పిడుగుపడి బాలిక మృతి
గజపతినగరం, ఏప్రిల్ 5: విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పిడుగుపడి ఎ.్భరతి(13) మృతి చెందింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పొలంలోని ఉల్లిపంటపై కప్పేందుకు టార్పాలిన్ తీసుకువెళ్తున్న భారతిపై పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి
ఎస్.రాయవరం: విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామానికి చెందిన ఉపాధి మహిళాకూలీ అండిబోయిన అప్పలనర్స(57) వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది.