రాష్ట్రీయం

కాంగ్రెస్‌ జాతీయ పార్టీనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: కాంగ్రెస్‌ను జాతీయ పార్టీగా పరిగణించడానికి వీల్లేదని, గత ఎన్నికల్లో కేవలం 40 సీట్లు మాత్రమే వచ్చిన ఆ పార్టీని ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా అభివర్ణించవచ్చని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గెలుపుప్రాంతీయ పార్టీల అధినేతల దయపైనే ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు. ఒకవేళ మాయావతి, అఖిలేశ్ యాదవ్ తమతమ అభ్యర్థులను బరిలోకి దింపితే వీరు గెలువగలరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 40 మంది ఎంపీలను మాత్రమే గెల్చుకుందని గుర్తుచేస్తూ, అలాంటప్పుడు అది జాతీయ పార్టీ ఎలా అవుతుందని కేటీఆర్ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు వస్తాయని, ప్రధాని అభ్యర్థి కూడా ప్రాంతీయ పార్టీల నుంచి అవుతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్‌లో శనివారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పరిగి, వికారాబాద్, తాండూరుకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కూడా ఓ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగానే మారిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. ఈ రెండు పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలైన టీఆర్‌ఎస్, వైసీపీ, మాయావతి, నవీన్ పట్నాయక్, మమతా బెనర్టీల పార్టీలకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపేతర ప్రాంతీయ పార్టీలు 150 నుంచి 170 సీట్లు గెల్చుకోవడం ఖాయమన్నారు. ఎర్రకోటపై జెండా ఎవరు ఎగరేసి నిర్ణయించబోయేది తమ పార్టీ అధినేత కేసీఆరేనని అన్నారు. ప్రధాన మంత్రి పదవిలో కూర్చునేది కూడా ప్రాంతీయ పార్టీలకు చెందిన వ్యక్తేనని కేటీఆర్ జోస్యం చెప్పారు. అభివృద్ధి జరగాలంటే జాతీయ పార్టీలతోనే సాధ్యమని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశే్వశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా విరుచుకపడ్డారు. దేశాన్ని 70 ఏళ్ల పాటు పాలించిన జాతీయ పార్టీలు సాధించిన అభివృద్థి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇంతకాలానికైనా కనీసం మంచినీటిని, వౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదని ధ్వజమెత్తారు. మరి ఇంతకాలంగా జాతీయ పార్టీలు ఏమి చేశాయి? గడ్డీ పీకాయా? అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌కు, బీజేపీకేస్తే మోదీకి లాభమని, వీరికేస్తే తెలంగాణ గడ్డకేమైనా ఒరిగుతుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంకానీ పాలమూరు-రంగారెడ్డికికానీ జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు ఇవ్వాలని కోరినా ప్రధాని మోదీ స్పందించలేదన్నారు. మరి అలాంటి పార్టీలకు ఓటు వేస్తే తెలంగాణకు వచ్చేది ఏముంటుందని అడిగారు. అదే టీఆర్‌ఎస్ నుంచి 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీని శాసించి ఏదైనా సాధించుకురాగలమన్నారు. దేశంలోనే నంబర్ వన్ సీఎంగా కేసీఆర్‌ను దేశంలో 70 శాతం మంది ప్రజలు ఆమోదించారన్నారు. దేశ ప్రజల మన్ననలు పొందిన పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు మేలు జరుగుతుందనే గ్రహించి ప్రజలు ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
చిత్రం.. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్