ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా ఇంకెప్పుడిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 6: పత్యేక హోదా దగ్గర నుంచి అనేక అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు. విభజన హామీలు అమలులో కేంద్రం చేస్తున్న తాత్సారంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం ముందుకు రావడం లేదు. వ్రిభజన తరువాత ఉద్యోగుల విభజన ప్రక్రియ, విభజన చట్టం అమలు తీరును పరిశీలించడానికి హైదరాబాద్ ఎపి సచివాలయానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కొఠారితో విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ సమన్యాయం చేయకుండా విచక్షణారహితంగా రాష్ట్రాన్ని విభజించింది. అందుకు ఆ పార్టీ భార మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చిందని చంద్రబాబు కొఠారికి వివరించారు. మనం మంచి చేస్తామనే ఉద్దేశంతో ప్రజలకు మనకు అధికారాన్ని అప్పగించారు. ఎన్నికల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది. రాజధాని లేదు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఆదాయం కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 16 వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్న సమయంలో తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని చంద్రబాబు కొఠారికి చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రత్యేక హోదా ఇప్పటికీ రాలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయి సహకారం లభించడం లేదని అన్నారు. పరిశ్రమలు రావడం లేదు. వౌలిక సదుపాయాలు కూడా లేవని ఆయన చెప్పారు. ఉన్న విద్యా వైజ్ఞానిక పరిశోధనా సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వాటన్నింటినీ కోల్పోవలసి వచ్చిందని అన్నారు. రాజధాని నిర్మాణంతోపాటు, ఆ సంస్థలన్నింటిని తిరిగి తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసకోవాలంటే కనీసం ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆయన చెప్పారు. ఇందుకు కేంద్రం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మనోగతాన్ని కేంద్రానికి తెలియచేయండని కొఠారిని సిఎం కోరారు. విభజనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోలేదు. తమకు అన్యాయం జరిగిందన్న భావన రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరిలోనూ ఉందని ఆయన అన్నారు. కనీసం ఉద్యోగుల విభజననైనా సక్రమంగా చేపట్టాలని ఆయన సూచించారు. లేకపోతే మరోసారి అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో జీవితాంతం ఉండిపోతుందని అన్నారు. అయినా, తాము అడిగితేనే చేద్దామనే ధోరణి ఎవ్వరికీ మంచిదికాదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ, ప్రజల మనోగతాన్ని కేంద్రానికి వివరించాలని చంద్రబాబు కొఠారికి సూచించారు.

చీరాలలో పరువు హత్య
చీరాల, ఏప్రిల్ 6: ప్రకాశం జిల్లా వేటపాలెంలో పరువు హత్య ఆలస్యంగా వెలుగు చూసింది. కన్న కూతురు ప్రేమలో పడిందన్న విషయాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. కుటుంబం పరువు పోయిందన్న బాధతో మానవత్వం మరిచి మృగంలా మారాడు. తన బంధువులతో కలిసి మైనరైన అమ్మాయిని దారుణంగా హత్యచేసి చివరకు పోలీసుల చేతికి చిక్కారు. కేసు వివరాలను రెండో పట్టణ సిఐ పరంధామయ్య బుధవారం విలేఖరులకు వెల్లడించారు. వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన కటకం వెంకటేశ్వర్లు కూతురు దుర్గ్భావాని (16) ఇంటర్ చదువుతోంది. ఆమె గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన పోలయ్యతో ప్రేమలో పడి అతనితో వెళ్లింది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసేందుకు కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి చీరాలకు తీసుకొచ్చారు. అయితే పరువు పోయిందన్న భావం, అమ్మాయి ఆస్తి కాజేయాలన్న తలంపుతో తండ్రి వెంకటేశ్వర్లు బంధువులతో కలిసి గత నెల 27వ తేది దుర్గ్భావానీని హత్య చేశారు. అమ్మాయిని ఇనుపరాడ్‌తో కొట్టి మెడకు చున్నీ బిగించి చంపినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతురాలి అన్న గోపి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుతో పాటు పగడాల రాంబాబు, హుస్సేనమ్మ, పగడాల వెంకటేశ్వర్లు, శ్రీనును బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.
సొంత గూటికే వెళుతున్నా: సునీల్
గూడూరు, ఏప్రిల్ 6: తాను పాతికేళ్లుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించానని, కొన్నాళ్లు వైకాపాలో ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్లీ సొంత పార్టీకే వెళ్తున్నానని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన గూడురులో విలేఖరులతో మాట్లాడారు. తాను తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్తున్నానో వివరించారు. దివంగత నేత ఎన్టీఆర్ ఆశీస్సులతో తాను గూడూరు మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైయ్యానన్నారు. అప్పటినుంచి పార్టీలో కీలక పదవులు నిర్వహించానన్నారు. అయితే స్థానికుడినైన తనకు రెండు పర్యాయాలూ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టిక్కెట్ లభించని కారణంగా తెలుగుదేశం పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. నాలుగేళ్ల క్రితం వైకాపాలో చేరి తొలిసారి ఆ పార్టీ టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. అయితే తాను గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో ఉండడం వల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానన్నారు. రాజకీయాల్లో తనకు అండగా ఉన్న పారిశ్రామిక వేత్త కె గంగాప్రసాద్ కోరిక మేరకు తాను టిడిపిలో చేరేందుకు నిర్ణయం తీసుకొన్నట్టు సునీల్ వెల్లడించారు. తాను అమ్ముడుపోయానని మీడియాలో వచ్చిన కథనాలు తనను కలచివేశాయన్నారు. తాను ఎవరికీ అమ్ముడుపోలేదని స్పష్టం చేశారు. ఉగాది రోజున విజయవాడలో సిఎం సమక్షంలో తెలుగుదేశంలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఎంవిఇ ఆస్తులు రూ.20 కోట్లు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 6: విజయనగరం జిల్లా రవాణాశాఖలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పి.చిన్నోడు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి సోదా చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఏకకాలంలో నిర్వహించిన తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. ఎంవి ఇన్‌స్పెక్టర్ చిన్నోడు శ్రీకాకుళం జిల్లాలో పనిచేసినప్పుడు వచ్చిన ఆరోపణలపై ఎసిబి అధికారులు దృష్టి సారించారు. విశాఖ నగరంలోని చిన్నోడు ఇంట్లో బుధవారం జరిపిన సోదాల్లో అధికారులు నివ్వెరపోయేలా ఆస్తులు బయటపడ్డాయి. విశాఖ జిల్లా రోలుగుంటలో 60 ఎకరాల వ్యవసాయ భూమి, విశాఖ నగరం, విజయనగరం జిల్లాల్లో నాలుగు భవంతులు, మూడు జిల్లాల్లో ఏడు ఇళ్ల స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిన్నోడు ఇంట్లో రూ.3 లక్షల నగదుతో పాటు అర కిలో బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంకు లాకర్లలో మరో రెండు కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారు. డాక్యుమెంట్ విలువ ప్రకారం వీటి విలువ రూ. 3 కోట్లుగా పేర్కొన్నప్పటికీ, మార్కెట్‌లో రూ.20 కోట్లకు పైగానే ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ఎసిబి డిఎస్పీ కె.రంగరాజు తెలిపారు. ఎంవి ఇన్‌స్పెక్టర్ చిన్నోడును అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తవ్వకాల్లో మృణ్మయ పాత్రలు
అమరావతి, ఏప్రిల్ 6: గుంటూరు జిల్లా అమరావతిలోని శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం గుంటలు తీస్తుండగా క్రీస్తుపూర్వం 400 నుండి 100 సంవత్సరాల మధ్య శాతవాహనుల కాలం నాటి ప్రజలు వాడిన మృణ్మయపాత్రలు, కుండపెంకులు కొన్ని బయటపడ్డాయి. ఈ పాత్రలను హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కొల్లి లక్ష్మీనారాయణ అమరావతి పురావస్తు సంగ్రహాలయ ఇన్‌ఛార్జ్ నైషదం వెంకటేశ్వరరావుకు అందజేశారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో లోతుగా తవ్విన తవ్వకాల్లో ఈ తరహా పాత్రలు, పాలరాతి శిల్పాలు బయల్పడటం ఆనవాయితీగా వస్తోందని వెంకటేశ్వరరావు తెలిపారు.

వడదెబ్బకు ఇంజినీర్ మృతి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఏప్రిల్ 6: శ్రీకాకుళం జిల్లాలో బుధవారం వడదెబ్బకు ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్ ఒకరు మృతి చెందారు. నరసన్నపేట మండలం మడపాంలో ఇసుకర్యాంప్‌ను పరిశీలించేందుకు వెళ్లిన ఆర్‌డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజినీర్ నాగభూషణం వడదెబ్బతో మృతి చెందారు. ర్యాంప్‌ను పరిశీలించేందుకు వెళ్లిన ఆయన ఎండవేడికి తట్టుకోలేక సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే ఆయనను సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.
విశాఖలో ఇద్దరి మృతి
జి.మాడుగుల,్భమునిపట్నం: విశాఖపట్నం జిల్లాలో వడదెబ్బకు బుధవారం ఇద్దరు మృతి చెందారు. జి.మాడుగుల మండలం భీరం పంచాయతీ అనర్భగ్రామానికి చెందిన ఉపాధి కూలీ కొటారి కొండబాబు(50) వడదెబ్బతో మృతి చెందాడు. భీమిలి జోన్ 24వ వార్డు పరిధి టెక్కలిపాలెంకు చెందిన టెక్కలి రాజమ్మ(67) వడదెబ్బతో మృతి చెందింది.
అనంతలో ఆగని మరణాలు
అనంతపురం: అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో బుధవారం వడదెబ్బకు నలుగురు మృతిచెందారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన చాకలి కుళ్లాయప్ప (50), నందికొట్కూరుకు చెందిన లక్ష్మీదేవి (40), అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన పెద్ద వేమన్న (60) వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా కడప జిల్లా చెన్నూరులో దాసరి నరసింహులు (78) ఎండ వేడి తట్టుకోలేక మృతిచెందాడు.

కైలాస వాహనంపై
ఆది దంపతులు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఏప్రిల్ 6: శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా మాతలకు బుధవారం కైలాస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారు మహా దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా స్వామి వారి ఆలయంలో మండపారాధన, జపానుష్టాలు, రుద్ర హోమం, నిత్య హవనాలు, అమ్మ వారి ఆలయంలో విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీ హోమం నిర్వహించగా సాయంత్రం ప్రదోషకాల పూజలు, హవనాలను శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించారు. తమ ఇంటి ఆడపడుచుగా భావించే శ్రీ భ్రమరాంబికామల్లికార్జున స్వామి వారి దర్శనార్థం కన్నడిగులు భారీ ఎత్తున శ్రీగిరికి చేరుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో దర్శన సమయం సుమారు ఆరు గంటలు పడుతోంది. భక్తుల కోసం ప్రత్యేకంగా చలువ పందిళ్లు వేసినా సరిపోలేదు. ఎండలో నిల్చొనే దర్శనం కోసం బారులు తీరారు.

యువకుఢిని కిడ్నాప్‌చేసిన మావోలు
చింతూరు, ఏప్రిల్ 6: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామానికి చెందిన శంకర్ (22) అనే యువకుడిని మావోయిస్టులు రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. ఈ విషయం బుధవారం వెలుగుచూసింది. ఏడుగుర్రాలపల్లి గ్రామంలో జిరాక్స్ షాపు నడుపుకొంటున్న శంకర్ ఇంటికి రెండు రోజుల క్రితం కొందరు మావోయిస్టులు వచ్చారు. శంకర్‌ను తమ వెంట ఆంధ్రా-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అరణ్యంలోకి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో మావోయిస్టు శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్ పోలీసులకు పట్టుబడడంలో శంకర్ హస్తం ఉందనే కారణంతో మావోయిస్టులు అతనిని కిడ్నాప్ చేశారు.

భక్తుల వద్దకే భగవంతుడు
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 6: ఉగాది పర్వదినం నుండి ‘్భక్తుల వద్దకే భగవంతుడు’ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. తాడేపల్లిగూడెంలో బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ బిడ్డ జన్మించినపుడు ఆ ప్రాంత ఆలయానికి సంబంధించిన అర్చకులు భక్తసమాజంతో కలిసి ఆ ఇంటికి వెళ్లి, ఆశీస్సులు అందిస్తారన్నారు. దేవుని ప్రసాదంతో ఆ బిడ్డకు అన్నప్రాశన చేస్తారన్నారు. బిడ్డకు నామకరణం చేసిన రోజున ఆశీస్సులు అందిస్తారన్నారు. వివాహం జరిగిన ఇంటికి వెళ్లి, ఆశీస్సులు అందించి ప్రసాదాన్ని ఇస్తారన్నారు. సీమంతం సందర్భంగా అమ్మవారి కుంకుమ, గాజులు ఆ మహిళకు ప్రసాదంగా అందించి ఆశీర్వచనాలు ఇస్తారన్నారు. ఎవరైనా మరణిస్తే 12వ రోజున అర్చకులు ఇంటికివెళ్లి, శివాభిషేక జలాలతో ఇంటిని శుద్ధిచేసి ఆశీస్సులందిస్తారన్నారు.

16న విజయవాడలో
నాటకరంగ పురస్కారాలు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 6: తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాటకరంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న కళాకారులకు కందుకూరి విశిష్ట పురస్కారాలు అందించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఐదుగురు చొప్పున 13 జిల్లాలకు చెందిన కళాకారులను ఎంపిక చేసింది. అలాగే రాష్ట్ర స్థాయిలో మరో ఐదుగురిని ఎంపిక చేసింది. వీరందరికి ఈ నెల 16న విజయవాడలో ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర చలనచిత్ర, టివి మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ఈ పురస్కారాలను అందజేస్తోంది. రాష్టస్థ్రాయి పురస్కార గ్రహీతలకు రూ.25 వేలు, జిల్లాస్థాయి గ్రహీతలకు రూ.10 వేలు నగదు పారితోషికాలతో పాటు శాలువాలతో సత్కరించడం జరుగుతుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.కృష్ణమోహన్ నేడిక్కడ తెలిపారు.
రాష్టస్థ్రాయి కందుకూరి విశిష్ఠ పురస్కార గ్రహీతలు
వై గోపాలరావు (శ్రీకాకుళం), జయనిర్మల (గుంటూరు), కొయ్యలగూడెం విజయ్‌కుమార్ (తూర్పుగోదావరి), మహ్మద్ మియ (కర్నూలు), బుచ్చయ్య చౌదరి (ప్రకాశం).
జిల్లాల వారీగా విశిష్ఠ పురస్కార గ్రహీతలు
శ్రీకాకుళం నుంచి ఆర్‌డివి ప్రసాద్, బిఎ మోహన్‌రావ్, పన్నాల నరసింహమూర్తి, వంజరపు సత్యం, పాడి సత్యవతి. విజయనగరం నుంచి జొన్నలగడ్డ సీతారామ శాస్ర్తీ, పిఎ సూర్యనారాయణ, అరిపాక బ్రహ్మానందం, నైదన సత్యనారాయణ, మానాపురం పార్వతి. విశాఖపట్నం నుంచి డేవిడ్ రాజు, ఎమ్.శివజ్యోతి, బి.మల్లెల రాజేంద్రప్రసాద్, జివిఆర్‌కె రామకృష్ణ శాస్ర్తీ, బి.హేమవెంకటేశ్వరి. పశ్చిమ గోదావరి నుంచి సిహెచ్ నరసింహరావు, ప్రసాదుల గురుమూర్తి, పంపన దయానందబాబు, పక్కి మణిబాల, ఎన్.సీతారామమ్,. తూర్పు గోదావరి నుంచి అల్లం చంద్రరావు, పెదపాటి అంజలి దేవి, జి.వెంకటేశ్వరరావు, వరద కోటేశ్వరరావు, తాలబత్తుల వెంకటేశ్వరరావు. కృష్ణా నుంచి ఎమ్ లక్ష్మి, హృదయరాజు, పివిఎన్ కృష్ణ, మల్లేశ్వర పట్నాయక్, సింహాచలం సీతారామయ్య. గుంటూరు నుంచి తుర్లపాటి రాథాకృష్ణమూర్తి, మల్లాది శివన్నారాయణ, సిహెచ్ అంజిబాబు, చిలక నాంచారయ్య, దేవిశెట్టి కృష్ణారావు. ప్రకాశం నుంచి ఎం రత్నకుమారి, జంపాల వెంకయ్య, పూర్ణ శివసత్యనారాయణ, చిట్ట శివప్రసాద్, తిరుమలాబీ ఎంపికయ్యారు. నెల్లూరు నుంచి సిద్ధిపురం పెంచలయ్య, మాధవరావు, కావలి సూరి, బురాన్, సురబి విమలాదేవి. చిత్తూరు నుంచి వెంకటగిరి వీరమల్లయ్య, బియన్ రెడ్డి, ఎస్‌వి రాయలు, జిఎల్ కుమార్, పి.యశోద. కర్నూలు నుంచి బుర్రా వెంకటేశ్వరరావు, కె బాల వెంకటేశ్వర్లు, టిజి వెంకటేశ్వర్లు, పి.హనుమంతరాయ చౌదరి, పి.రాజేశ్వరి. వైఎస్‌ఆర్ కడప నుంచి ఎ జయచంద్రరాజు, మచ్చా నరసింహాచార్యులు, వైజి ప్రకాష్, వై గంగాధర్, ఓబులేష్ యాదవ్. అనంతపూర్ నుంచి టి రామారావు, గాజుల కరి బసప్ప, కె సోమిరెడ్డి, ఎస్ మరిన్న, వనజాకుమారి ఎంపికయ్యారు.

మళ్లీ రాజకీయాల్లోకి వస్తా

చంద్రగిరి, ఏప్రిల్ 6: పేదల కష్టాలు పాలకులకు తెలియజేయడానికి మళ్లీ రాజకీయాల్లోకి వస్తా... అయితే అది ఏపార్టీలో చేరుతానన్నది ఇప్పుడు చెప్పను. అప్పుడే చెబుతా అని ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఎం మోహన్ బాబు అన్నారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారి కష్టాలు పాలకుల దృష్టికి తీసుకువెళ్ళడానికి తిరిగి తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అయితే ఎప్పుడు వస్తాను, ఏపార్టీలో చేరుతాననేది అప్పుడే మీడియాకు చెబుతానని ఆయన అన్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే ఐఏఎస్, ఐపిఎస్‌ల కళ్లు ఆకాశాన్ని చూస్తున్నాయని, దీంతో పేద ప్రజలు అన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ అధికారుల బండారం కూడా బయటపెడతానని హెచ్చరించారు. ఇటీవల ఒక పార్టీ నుంచి మరోపార్టీలోకి వెళ్లే జంప్‌జిలానీల సంఖ్య పెరుగుతూ ఉందని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పార్టీపై నమ్మకం లేనప్పుడు, ఆపార్టీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి వెడితే అది ప్రజాస్వామ్య బద్దంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రులను అక్కడి ప్రభుత్వం ఇబ్బంది పెడుతూ ఉన్నారని జరుగుతున్న ప్రచారం ఒక బూటకమన్నారు. కెసిఆర్ ఆంధ్రాకు చెందిన ఉద్యోగులను, వ్యాపారులను ఎంతోగానో ఆదరిస్తూ వారికి అవసరమైన చేయూతనిస్తున్నారని ఇది సత్యమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రస్తుత పాలకులు నీరు కార్చడంవల్ల విద్యార్థులు, విద్యాసంస్థలు భారీగా నష్టపోతున్నారన్నారు.