రాష్ట్రీయం

ఎవరి పంచాంగం వారిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: రాష్ట్రంలో రాజకీయ పక్షాల పంచాంగాల తీరు తీరులో ఎలాంటి మార్పు లేదు. ఈసారి కూడా అధికార పక్షం పంచాగంలో అంతా భేష్ అన్నట్లు చెబితే విపక్షాల పంచాంగాలు కష్టాలను ఏకరవుపెట్టాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీల పంచాంగాల్లో తమకు సానుకూల పరిస్థితులున్నట్లు వేటికవి చెప్పుకొచ్చాయి. గతంలో ఉగాది రోజున రవీంద్ర భారతిలో మాత్రమే ప్రభుత్వ పరంగా పంచాగ పఠనం ఉండేది. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి ఓడిపోయిన తరువాత తొలిసారిగా అధికారపక్ష పంచాగం పఠనంతోపాటు ప్రతిపక్ష పంచాగ పఠనం కూడా మొదలైంది. ప్రభుత్వం రవీంద్ర భారతిలో నిర్వహిస్తే, చంద్రబాబు ఎన్టీఆర్ భవన్‌లో శ్రీనివాస గార్గేయ ఆధ్వర్యంలో పంచాగ పఠనం చేయించారు. ఆయా పార్టీల సిద్ధాంతాలకు అనుగుణంగా పంచాగ పఠనాలు అప్పటి నుంచే ప్రారంభం అయ్యాయి. టిడిపి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నంతకాలం శ్రీనివాస గార్గేయ తెలంగాణ ఏర్పాటు కల అంటూ ఉగాది పంచాగ పఠనంలో చెప్పేవారు. తెలంగాణపై టిడిపి వైఖరి మారిన తరువాత పంచాగ పఠనంలో ఈ అంశాన్ని వదిలిపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ఆచారం విభజన తరువాత కూడా కొనసాగుతోంది.
అంతా బాగుంటుందట!
ఎప్పటి మాదిరిగానే ఈసారి ఉగాదికి అన్ని రాజకీయ పక్షాలు పంచాగ పఠనం చేయించాయి. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో ఈ ఏడాది అంతా బాగుటుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయిని పండితులు చెప్పారు.
కష్టాలేనన్న కాంగ్రెస్
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పంచాంగం మాత్రం దీనికి విరుద్ధ ఫలితాలుంటాయని పేర్కొంది. ఉగాది సందర్భంగా శుక్రవారం గాంధీభవన్‌లో చిల్కూరి శ్రీనివాస మూర్తి ప్రత్యేక పూజలు చేసి పంచాంగంలోని విశేషాలను వివరించారు. టిపిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, ఎంపీలు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్యేలు టి. జీవన్ రెడ్డి, భాస్కర్ రావు, సంపత్‌కుమార్, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డి, సేవాదళ్ చైర్మన్ కె. జనార్దన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సరైన వర్షాలు లేక వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని, దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో దొంగల బెడద పెరిగిపోతుందని, మహిళలకు భద్రత కరువవుతుందని తెలిపారు.
బిజెపి పంచాంగం
బిజెపి కార్యాలయంలో పంచాంగ పఠనాన్ని వేద పండితుడు సంతోష్‌కుమార్ శాస్ర్తీ చేశారు. పార్టీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సంతోష్‌కుమార్ శాస్ర్తీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది వ్యాధులు విజృంభిస్తాయని, రాజకీయ రంగంలో మహిళల అధిపత్యం పెరుగుతుందని ఆయన తెలిపారు. కొన్ని రాష్ట్రాల మధ్య అంతరం పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. వ్యవసాయం బాగానే ఉంటుందని పెట్రోలు ఇతరత్రా ధరలు పెరుగుతాయని ఆయన చెప్పారు.
స్వార్థం వీడాలన్న వైకాపా
ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు స్వార్థాన్ని వీడితేనే అభివృద్ధి జరుగుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పంచాగ పఠనం చేసిన మారెపల్లి రామచంద్ర శాస్ర్తీ తెలిపారు. పాలకులకు గ్రహాలు అనుకూలించడం లేదని, అకాల వర్షాల వల్ల నష్టాలు, పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపికి ఈ ఏడాది బ్రహ్మాండంగా కలిసి వస్తుందని పార్టీ ఫిరాయించిన రాజకీయంగా భవిష్యత్తు లేదని తెలిపారు. అక్రమ కేసులు, కుట్రలు, కుతంత్రాల నుంచి వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా బయటపడతారని, వైఎస్‌ఆర్ సిపి పార్టీ మరింతగా ప్రజల మన్నన చూరగొంటుందని తెలిపారు. దుర్ముఖి నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.