రాష్ట్రీయం

ప్రాంతీయ కూర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలన్ని ఒక జట్టుగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పావులు కదుపుతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడినంత మెజారిటీ రానిపక్షంలో ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు మద్దతుగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పాటు ఎన్డీయే, యూపీఏలకు సమదూరం పాటిస్తోన్న పార్టీలను ఏకత్రాటిపైకి తీసుకరావడానికి కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎగ్జిట్ పోల్స్‌లో తిరిగి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందని వెల్లడైనప్పటికీ, దానికి పూర్తి మెజారిటీ రాకపోవచ్చని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌పై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కానీ, ఆ పార్టీ ముఖ్య నేతలెఎవరూ ఇంతవరకు స్పందించలేదు. తాము మొదటి నుంచి అంచనా వేసినట్టుగా ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదన్న అభిప్రాయంతోనే టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఇదే అంచనాతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించే విధంగా ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. కొందరు నాయకులతో ఫోన్లో చర్చించడం, సన్నిహితంగా ఉండే నాయకులతో ఇతర పార్టీలను దారికి తెచ్చుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ బీజీగా ఉన్నారు. ఎగ్జిట్ ఫలితాల్లో తమిళనాడులోని డిఎంకే మెజారిటీ స్థానాలను సాధించనున్నట్టు వెల్లడైంది. డిఎంకే యూపీఏకు మద్దతుగా ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్‌లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు యూపీఏ కూటమి దరిదాపుల్లో కూడా లేదని తేలడంతో తాజాగా అనుసరించాల్సిన వ్యూహంపై స్టాలిన్‌తో కేసీఆర్ ఫోన్లో చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్టాలిన్‌తో కేసీఆర్ చర్చించిన తర్వాతనే ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్టు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఫలితాలకు ముందు యూపీఏ కూటమి పక్షాల సమావేశం అవసరం లేదని స్టాలిన్ స్పష్టం చేసి ఉంటారని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది, బహుజన సమాజ్‌వాదీ పార్టీల కంటే బీజేపీకే మెజారిటీ స్థానాలు దక్కనున్నట్టు ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. మరోవైపు యూపీఏకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లేదని తేలింది. ఈ నేపథ్యంలో యూపీఏ, ఎన్డీయేతర కూటమిలకు అతీతంగా ఎస్‌పి, బిఎస్‌పీలను ప్రాంతీయ పార్టీల కూటమిలోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఎస్‌పి అధినేత అఖిలేశ్ యాదవ్‌తో ఫోన్‌లో కేసీఆర్ చర్చించినట్టు తెలిసింది. ఈ చర్చల తర్వాతనే అఖిలేశ్ యాదవ్ సోమవారం బిఎస్‌పి అధినేత్రి మయావతితో సమావేశమైనట్టు తెలిసింది. ఫెడరల్ ఫ్రంట్‌పై ఇదివరకే ఒడిశా ముఖ్యమంత్రి, నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్‌లో ఒడిశాలో జేడీయూ కంటే బీజేపీనే మేజారిటీ స్థానాలను సాధించనుందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషించే లక్ష్యంగా నవీన్ పట్నాయక్ తమతో కలిసి వస్తారని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు మెజారిటీ పార్లమెంట్ స్థానాలను గెలుచుకోబోతుందని ఎగ్జిట్ పోల్స్‌ల్లో మెజారిటీ సంస్థలు వెల్లడించాయి. వైసీపీని కూడా రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీల కూటమిలోకి తీసుకవచ్చే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇలా ఉండగా కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్‌లో చేరడం వల్ల కలిగే లాభ నష్టాలపై వైసీపీ నేతలు చర్చించినట్టు తెలిసింది. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసులు వేసిన టీఆర్‌ఎస్ నేతృత్వంలోని ఫ్రంట్‌లో చేరడం వల్ల రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, పైగా తమకు రాజకీయంగా నష్టం కలిగించే పరిణామంగా మారుతుందని వైసీపీ భావిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నేతృత్వంలోని ఫ్రంట్‌లోకి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా చేరే పక్షంలో పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించే పార్టీలతో జత కట్టారన్న అభియోగాన్ని మోయాల్సి వస్తుందని మరో కోణంలో జంకుతున్నట్టు వైసీపీ నేత మరొకరు వ్యాఖ్యానించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్‌తో ప్రత్యక్షంగా జతకట్టకపోయినా ప్రాంతీయ పార్టీలన్ని ఏకత్రాటిపైకి వచ్చే అంశంలో వైసీపీ కలిసి వస్తుందని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది.