రాష్ట్రీయం

సుపరిపాలనకు నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 14: విభజనానంతర సమస్యలు.. ఖాళీ ఖజానా.. సవాళ్లను అధిగమించి సుపరిపాలనకు తమ ప్రభు త్వం నాంది పలకనుందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉద్ఘాటించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం గవర్నర్ ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించారు. నూతన ప్రభుత్వం తక్షణ సమస్యలపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైందని వాటిలో కొన్ని విభజన పర్యవసానంగా ఏర్పడినవి కాగా మిగిలినవి విభజనానంతరం తలెత్తిన సవాళ్లన్నారు. మానవ, భౌతిక వనరులు దుర్వినియోగం కావడం వల్ల అది మరింత జఠిలంగా మారిందని, ఈ ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించిందన్నారు. దీంతో ప్రజాధనాన్ని, సహాయక వనరులను పూర్తి జవాబుదారీతో సమర్థవంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ప్రజానీకానికి సంతృప్తికదరమైన సేవలు అందించే అన్ని చర్యలు తీసుకుంటామనే విశ్వాసం ఉందన్నారు. సుపరిపాలన అందించేందుకు యాత్ర మొదలైందన్నారు. ప్రభుత్వం ఆశించిన మార్పు ఐదుకోట్ల మంది ప్రజానీకం సంపూర్ణ సహకారంతోనే వీలుపడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాల సహకారంతో దృఢ నిశ్చయంతో ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. సుస్పష్టమైన ప్రజా తీర్పును దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా వారి కలల సాకారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఉపనిషత్తుల్లోని శాంతిమంత్రంతో గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
నవరత్నాలే ఏకీకృత అజెండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భావజాలానికి అనుగుణంగా పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడేలా నవరత్నాలు అమలు చేయనున్నట్లు గవర్నర్ వెల్లడించారు. వైఎస్సార్ రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, పింఛన్, పేదలందరికీ పక్కా గృహాలు, యువతకు ఉపాధికల్పన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, దశల వారీ మద్యనిషేధం, జలయజ్ఞం సమర్ధవంతంగా ప్రారంభించినట్లు చెప్పారు.
గత పదిరోజుల్లో తీసుకున్న విధాన నిర్ణయాలు తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్తూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఇచ్చిన హామీలు కేంద్రం పూర్తిగా నెరవేర్చాలనే డిమాండ్ ప్రభుత్వ అజెండాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమన్నారు. వాటిని సాధించే దిశగా ప్రయత్నాలు జరుపుతామని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ద్విముఖ వ్యూహం అవలంబిస్తుందని ప్రకటించారు. అవినీతి నిర్మూలన, సేవల బట్వాడా యంత్రాంగాన్ని ప్రజల ముంగిటకు తెచ్చేందుకు ప్రభావవంతమైన, సమర్థవంతమైన చర్యలు చేపడతామన్నారు. గత పాలనా విధానానికి పూర్తి భిన్నంగా పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో దర్యాప్తులను నిర్వహించేందుకు వీలుగా సీబీఐకి గత ప్రభుత్వం ఉపసంహరించిన సాధారణ సమ్మతిని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఎవరూ వినని మరో పెద్ద నిర్ణయం తీసుకున్నామని, వివిధ పనులకు టెండర్లు ఇవ్వటానికి ముందే వాటిని పరిశీలించేందుకు జ్యుడీషియల్ కమిషన్ సహాయాన్ని ప్రభుత్వం కోరిందని గవర్నర్ తెలిపారు. పారదర్శకతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ తమ పాలనలో సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు. అవినీతికి ఆస్కారం ఉన్న విచక్షణాధికారాలు అన్నింటినీ తొలగించేందుకు తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అధిక ధర టెండర్ల ద్వారా ప్రభుత్వ ధనం వృథా కాకుండా టెండర్లు, కాంట్రాక్టులను కేటాయించడంలో ద్రవ్యోల్బణ ధోరణులను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని, అవసరమైన చోట్ల దిద్దుబాట్లు చేస్తామని వివరించారు. ఈ ప్రయత్నం దేశంలోనే ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

72 గంటల్లో ఫిర్యాదులు పరిష్కారం
వివిధ సమస్యలపై ప్రజలు చేసే ప్రతి ఫిర్యాదుకి 72 గంటల్లో పరిష్కారం చూపే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పూర్తి పారదర్శకత, ప్రజల్లో నూరు శాతం సంతృప్తి ఉండేలా ముఖ్యమంత్రి కార్యాలయమే నేరుగా ప్రజా సమస్యలను పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఒక్కో గ్రామ సచివాలయం పరిధిలో పదిమంది యువతకు వాలంటీర్లుగా నెలకు రూ 5వేల గౌరవ వేతనంతో నియమిస్తుందని వెల్లడించారు.

రైతు సంక్షేమమే లక్ష్యం
ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని గవర్నర్ ప్రకటించారు. రాష్టవ్య్రాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంతో పాటు రైతుకు సంబంధించిన కొన్ని అంశాలను సమీక్షించేందుకు రైతు కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సాగు వ్యయం తగ్గించటంతో పాటు వ్యవసాయ కార్మికులకు తగిన పని కల్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఈ ఏడాది రబీలో అంటే అక్టోబర్ 15 నుండి ప్రతి రైతు కుటుంబానికి రూ 12,500 చెల్లిస్తామన్నారు. హామీ ఇచ్చిన దానికంటే ఏడాది ముందుగానే ఈ పథకాన్ని అమలులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా రూ 10వేల కోట్లు రైతులకు చేరుతుందని ఇందులో ఐదోవంతు నిధులు కౌలు రైతులకు కూడా అందుతాయన్నారు. వ్యవసాయ భూముల యజమానులు ప్రయోజనాలకు, హక్కులకు భంగం కలుగకుండా కౌలు రైతుల హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు.
బలహీనవర్గాలకు ప్రాధాన్యత
ఇంతకు ముందెన్నడూలేని విధంగా తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. వచ్చే ఐదేళ్లలో కాపుల సంక్షేమానికి రూ. 10వేల కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. గ్రామ సచివాలయంలో పోస్టుల భర్తీ ద్వారా లక్షా 60వేల మందికి ఉపాధి కలుగుతుందని, మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ పింఛన్ రూ. 2250కు పెంపుతో పాటు ఆశావర్కర్లకు రూ. 10వేల వేతనం, ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దుకు కమిటీ ఏర్పాటు, 27 శాతం మధ్యంతర భృతి, పురపాలక పారిశుద్ధ్య కార్మికులకు రూ. 18వేల నెలసరి వేతనం, సామాజిక ఆరోగ్య కార్యకర్తల జీతాలు రూ. 4వేలకు పెంపు, అంగన్‌వాడీ, హోంగార్డులకు వేతనాల్లో పెంపుదలతో సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేతమైన విధానాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట
నూతన ఇసుక విధానంతో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేస్తామన్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తామన్నారు.
దశలవారీ మద్య నిషేధం
మద్యపానం దురవస్థకు దారితీసి కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నందున ఈ ప్రతికూల ప్రభావాన్ని గుర్తిస్తూ దశలవారీ మద్యనిషేధాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇందులో భాగంగా గొలుసు దుకాణాలను అరికట్టే చర్యలు ప్రారంభించామని తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి
పాఠశాలలకు వెళ్లే పిల్లలందరికీ విద్యను అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నట్లు గవర్నర్ స్పష్టం చేశారు. ఈ పథకం కింద పిల్లల్ని బడికి పంపే తల్లుల ఖాతాలో ఏటా రూ. 15 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాంకేతిక విద్యనభ్యసించే వారికి పూర్తిస్థాయి ఫీజు రీ యింబర్స్‌మెంట్‌తో పాటు రూ 20వేలు బోర్డింగ్, వసతి సదుపాయాల కోసం అదనంగా అందజేస్తామని ప్రకటించారు.

వైఎస్సార్ చేయూత
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా సమ్మిళిత సమాజాన్ని స్థాపించటం తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా గవర్నర్ తెలిపారు. ఈ పథఖం కింద అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు నిలదొక్కుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ఈ పథకం కింద 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసు గల ప్రతి మహిళకు సంవత్సరానికి రూ 18వేల 750 చొప్పున నాలుగేళ్లలో రూ 75వేలు అందజేస్తామన్నారు. అంతేకాదు ఆయా వర్గాల్లో వధువులకు వివాహ సమయాన ప్రోత్సాహకంగా రూ లక్ష అందిస్తామని తెలిపారు. చట్టబద్ధమైన అధికారాలతో ఒక శాశ్వత వెనుకబడిన తరగతుల కమిషన్ నెలకొల్పాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.

సకాలంలో ప్రాజెక్ట్‌లు పూర్తి
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంతో పాటు ప్రాధాన్యత కలిగిన వెలుగొండ, ఇతర ముఖ్యమైన ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుందని గవర్నర్ తెలిపారు. ఎలాంటి లోపాలు, అవకతవకలు, అవినీతికి ఆస్కారం లేకుండా టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు.
వార్షికాదాయం రూ 5 లక్షలలోపు ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. చికిత్స కోసం ప్రస్తుతం ఉన్న 1095 ప్రొసీజర్లకు అదనంగా మరో 936 ప్రొసీజర్లను వర్తింప చేస్తుందని దీర్ఘకాలిక మూత్ర పిండాల సమస్యలు, తలసేమియాతో బాధపడే రోగులకు ప్రత్యేక సాయంగా నెలకు రూ. 10వేలు పింఛన్ సమకూరుస్తుందని వెల్లడించారు.
ఉభయ సభల నుద్దేశించి సుమారు అరగంట సేపు గవర్నర్ ప్రభుత్వ ప్రాధాన్యాలు, నిర్ణయాలను విశదీకరించారు. తొలుత సభా ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్‌కు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి అధ్యక్షుడు ఎంఏ షరీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు.