రాష్ట్రీయం

పునస్సమీక్ష తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై పునస్సమీక్ష తప్పదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షలు అప్రస్తుతమని కేంద్ర ఇంధన వనరులశాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాసిన సంగతి విదితమే. దీనిపై అజయ్‌కల్లం స్పందించారు. సోమవారం సచివాలయంలో ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధిక ధరలకు పవన, సౌర విద్యుత్ కొనుగోలుతో ప్రభుత్వానికి ఏటా రూ. 2500 కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం నిజాలను నిగ్గుతేలుస్తామన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించామని, వీటికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఆ ప్రభావం సాంప్రదాయక థర్మల్ విద్యుత్‌పై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోలు చేసినా చేయకపోయినా థర్మల్ విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 25 ఏళ్లకు రూ. 30వేల కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ భారం ప్రజలపై పడకుండా, తమ ప్రభుత్వం అధిక ధరలను నియంత్రించటంతో పాటు అందులో జరిగిన అవినితిపై విచారణ జరపాలని భావిస్తోందన్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు. బహిరంగ టెండర్లు పిలవకుండా లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోవటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఒప్పందాలు లేకుండానే యూనిట్‌కు రూ. 2.72కు అందిస్తామని అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజాధనం దుర్వినియోగం జరగటానికి వీల్లేదని తేల్చిచెప్పారు. పవన, సౌర విద్యుత్ కొనుగోలు ధరలు గణనీయంగా తగ్గాయని 2018-19 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించిందన్నారు. ఇక రాష్ట్రాలు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. విద్యుత్ రంగాన్ని గాటన పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే పీపీఏలపై పునఃస్సమీక్ష జరుపుతున్నట్లు చెప్పారు. 2010లో రూ. 18గా ఉన్న పవన విద్యుత్ ధర 2018 సంవత్సరానికి రూ. 2.44కు గణనీయంగా తగ్గిందని, అదేవిధంగా సౌర విద్యుత్ యూనిట్ ధర రూ. 4.20 నుంచి 2017 డిసెంబర్ నుంచి రూ. 2.23కు తగ్గిందని స్వయాన కేంద్ర సర్వేలే వెల్లడిస్తుంటే గత మూడేళ్లుగా పవన విద్యుత్‌కు రూ. 4.84, సౌర విద్యుత్‌కు రూ. 6 ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ధరల నిర్ణయంలో ఏపీఈఆర్‌సీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రావనేది తప్పుడు ప్రచారం మాత్రమేనని ఆక్షేపించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కర్నూలు జిల్లాలోని మెగా సోలార్ పార్క్‌లో కేంద్రం తిరస్కరించిన సాఫ్ట్ బ్యాంక్ ఎనర్జీ సంస్థ 350 మెగా వాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని, యూనిట్‌కు రూ. 2.71కు టెండర్ దాఖలు చేస్తే రింగ్ అయిందని అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ కేంద్రం తిరస్కరించిందని గుర్తుచేశారు. ఏపీలో ఆ సంస్థ యూనిట్‌కు రూ. 4.63 వసూలు చేస్తోందని తెలిపారు. అక్రమాలు లేకుండానే యూనిట్ ధర అంతగా ఎందుకు పెరిగిందో విచారణ జరిపితేనే కదా తెలిసేదన్నారు. అఖిల భారత పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ కూడా ఏపీలో అధిక ధరలు చెల్లిస్తున్నట్లు తేల్చిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 221 పీపీఏలు ఉన్నాయని ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుదుర్చుకున్నవి 88 కాగా గత ప్రభుత్వ హయాంలో 133 ఒప్పందాలు జరిగాయన్నారు. వీటివల్ల 70 శాతానికి పైగా విద్యుత్ సరఫరా జరుగుతోందని తెలిపారు. వీటిలో ఐదు ముఖ్యమైన సంస్థలకు అధిక ధరలు చెల్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ కూడా ఉందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం 5 నుంచి 22 శాతానికి పెరిగిందని, దీని ప్రభావం సాంప్రదాయక థర్మల్ విద్యుత్‌పై పడుతోందని వివరించారు. థర్మల్ విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల నేపథ్యంలో విద్యుత్ వినియోగించినా వాడుకోక పోయినా 25 సంవత్సరాల వరకు యూనిట్‌కు రూ. 3.10 చొప్పున రూ. 39వేల 200 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. థర్మల్ విద్యుత్‌ను సరఫరా చేస్తున్న డిస్కంలు ఈ ఏడాది మార్చి నాటికి రూ. 15 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని, విద్యుత్ కొనుగోలుకు రూ. 18,375 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంక్‌లు సైతం రుణాలివ్వటం లేదని, దీంతో వాటి మనుగడకే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఎన్టీపీసీకి రూ.5 కోట్లు చెల్లించకపోతే సెప్టెంబర్‌లో మరో రూ. 500 కోట్లు అదనపు భారం పడుతుందని తెలిపారు. రెవెన్యూ వ్యత్యాసం కింద మరో రూ. 250 కోట్లు అదనంగా ఖర్చవుతుందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులను కొనుగోలు చేసేటప్పుడు థర్మల్ విద్యుత్‌ను నిలిపివేయాల్సి ఉందన్నారు. సౌర విద్యుత్ వల్లే పరిశ్రమల ద్వారా వచ్చే రెవెన్యూ పెరుగుతుందని, ఖర్చు తగ్గితేనే పారిశ్రామిక ప్రగతి సాధ్యపడుతుందన్నారు. 1995లో 2.23, 2004లో రూ. 2.70 యూనిట్‌కు పునరుత్పాదక విద్యుత్‌కు చెల్లిస్తే గత ప్రభుత్వ హయాంలో ఎందుకు పెరుగుతుందని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో వెనక్కుతగ్గే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కేంద్రం లేఖలపై స్పందిస్తూ ఏపీలో అవకతవకలు జరిగాయనే అంశం కేంద్రం దృష్టికి రాకపోయి ఉండొచ్చన్నారు. కేంద్రం లేఖలకు త్వరలో ప్రత్యుత్తరాలు పంపుతామని తెలిపారు.

చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న అజయ్ కల్లం