రాష్ట్రీయం

ప్రతి అడుగులోనూ బాబు మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 16: రిజర్వేషన్ పేరుతో కాపులకు చంద్రబాబు తీరని దగా చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాపులు బీసీ రిజర్వేషన్ అడుగుతుంటే కేంద్రం అగ్రకులాల్లో పేదలకు చట్టపరంగా అమలు చేస్తామని ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌లో 5 శాతం కేటాయిస్తున్నట్లుగా ప్రకటించి మరోసారి వంచనకు గురిచేశారని ఆరోపించారు. సభలో లేని వారి గురించి మాట్లాడవద్దంటూ 2004లో వైఎస్సార్ హయాంలో అలా జరిగింది.. అంతకుముందు ఇలా జరిగిందనే వాదనలు అప్రస్తుతమన్నారు.. మీరేం చేశారో.. మేమేం చేశామో తేల్చుకుందామని సవాల్ విసిరారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ల అమలుపై మంగళవారం శాసనసభలో చర్చ సందర్భంగా టీడీపీ లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం జగన్ వివరణ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటంతోపాటు ఐదేళ్లలో ఐదువేల కోట్లు కేటాయిస్తామని నమ్మబలికిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్‌కు 2014లో రూ. 50 కోట్లు, 2015-16లో 100 కోట్లు, 2016-17లో వెయ్యికోట్లు కేటాయించి 490 కోట్లు ఖర్చు చేశారని, 2017-18లో వెయ్యి కోట్లకు 891 కోట్లు, గత ఏడాది వెయ్యి కోట్లకు గాను 508 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చివరి రెండేళ్లు కేటాయింపులు జరిపారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 10 శాతం అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తే అందులో 5 శాతం కాపులకు అమలు చేస్తున్నట్లు చంద్రబాబు నటించటం దుర్మార్గమన్నారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రం నిర్దేశించిన రిజర్వేషన్‌ను ఆయా వర్గాలకే అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలుసని అయితే కాపులను ఓటు బ్యాంక్‌గా వాడుకునేందుకు 5 శాతం ప్రకటించారని ఆరోపించారు. ఆయన నిర్వాకం వల్లే ప్రస్తుతానికి కోర్టులో కేసులు నడుస్తున్నాయని, మెడికల్ కౌనె్సలింగ్‌లో సీట్లకు సైతం నోచుకోలేదని దుస్థితి నెలకొందన్నారు. మోసాలు చేయటం చంద్రబాబుకు కొత్తకాదని చెప్తూ ఎస్సీ వర్గీకరణను కూడా గతంలో ఇదే రకంగా ప్రేరేపించి రాజకీయ లబ్ధి పొందారన్నారు. వర్గీకరణ కేసును కోర్టు కొట్టేస్తుందని తెలిసి కూడా వంచించి ఆ వర్గాల వారి జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ఆయన ప్రతి అడుగులో మోసం..దగా దాగి ఉన్నాయన్నారు. మనసాక్షిని చంపుకుని రాజకీయాలు చేయాల్సిన అగత్యం తమకు లేదన్నారు. తాము ఎవర్నీ మోసం చేసి ఓట్లేయించుకోలేదన్నారు. కాపు సంక్షేమం అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నిజాయితీగా నిబద్ధతతో అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. వివిధ రాష్ట్రాల్లో గుజ్జర్లు, జాట్లు, పటేళ్లు రిజర్వేషన్ ఉద్యమాలు కొనసాగాయని ఏపీలో కాపు రిజర్వేషన్ ఉద్యమం కూడా ఈ నాటిది కాదన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయటానికి వీలు లేని పరిస్థితుల్లో తాము ప్రయత్నిస్తామని మాత్రమే హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. అమలు కాని హామీలతో వారిని వంచించ లేదన్నారు. బీసీ హక్కులకు భంగం కలుగకుండా ఇచ్చే రిజర్వేషన్లకు తమ పార్టీ మద్దతిస్తుందని స్పష్టత ఇచ్చామన్నారు. అప్పటి వరకు కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ. 2వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 10వేల కోట్లు కేటాయిస్తామని, ఇచ్చిన హామీని తొలి ఏడాది బడ్జెట్‌లోనే పెట్టి విశ్వసనీయత చాటుకున్నామని వివరించారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్‌గా ఆయన సంతకం లేకుండానే సభ్యుల సంతకాలతో కూడిన నివేదికను తమకు అనుకూలంగా రూపొందించుకుని సిఫార్సులివిగో అని చేతులు దులుపుకుందని ఆరోపించారు. ఈ నివేదికకు చట్టబద్ధత లేదన్నారు. ‘కుక్కతోక వంకర’ సామెత చందంగా చంద్రబాబు తాజాగా కేంద్రం మంజూరుచేసిన 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్‌ను ఆయనే శాసనసకర్తలా అమలు చేస్తున్నట్లు తప్పుడు జీవోలు జారీ చేశారని మండిపడ్డారు. కాపులు బీసీ రిజర్వేషన్లు అడుగుతుంటే అగ్రకుల పేదలుగా గుర్తిస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ స్థాయిలో కాపులను మోసం చేసి తప్పుచేశామనే భావన కూడా లేకపోవటం దౌర్భాగ్యమన్నారు. కాపుల్లో విశ్వసనీయత కోల్పోయినందునే ప్రతిపక్షంలో చేరారన్నారు. ఇప్పటికైనా మారాలని, వయసుతో పాటు గౌరవాన్ని పెంచుకోవాలని హితవు పలికారు.

చిత్రం...శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి