రాష్ట్రీయం

భూ వివాదాలకు ఇకపై తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 18: భూ వివాదాలకు ఇకపై తెరదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక సమగ్ర చట్టాన్ని అమలులోకి తీసుకురానుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్-2019 చట్టం ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మేనిఫెస్టోలో హామీలు, పాలనలో కీలక మార్పులకు సంబంధించిన పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొన్ని ముసాయిదా బిల్లులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పించటంతో పాటు ప్రస్తుతం నెలకొన్న వివాదాల పరిష్కారం, భవిష్యత్‌లో రికార్డుల ట్యాంపరింగ్‌ను నిరోధించేందుకు కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కౌలు రైతులకు ఊరటనిచ్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశానికి ఆమోదముద్ర వేసింది. భూ యజమానుల హక్కులకు భంగం కలుగకుండా 11 నెలల పాటు సాగు ఒప్పందం చేసుకునేందుకు వీలుకల్పించేలా నిర్దేశించిన ముసాయిదా బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదించింది. రైతు భరోసా కింద ఈ ఏడాది అక్టోబర్ నుంచి అందించనున్న ఆర్థిక సహాయం రూ. 12,500 కౌలు రైతులకు వర్తింప చేయాలని నిర్ణయించింది. రాష్టవ్య్రాప్తంగా పాలకవర్గాల గడువు తీరిన స్థానిక సంస్థలకు పాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను ఈ సమావేశంలో ఆమోదించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా తొలిదశలో బెల్ట్‌షాపుల నియంత్రణపై దృష్టి సారించారు. రెండో విడతగా ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నిర్వహించే అంశంపై మంత్రివర్గం చర్చించింది. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీలను పరిశీలించిన తరువాత ప్రభుత్వ నిర్వహణలోనే మద్యం దుకాణాలను చేపట్టాలని, ఇందుకోసం 1993 ఎక్సైజ్ చట్టాన్ని సవరించేందుకు వీలుగా రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం లభించింది. దీంతో త్వరలో మద్యం అమ్మకాలన్నీ ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తారు.
అంగన్‌వాడీ వర్కర్ల జీతాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది. అంగన్‌వాడీలకు ప్రతి నెలా రూ.11,500 వేతనాలు
చెల్లించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. మినీ అంగన్ వాడీ వర్కర్లకు రూ. 7వేలు, హెల్పర్‌కు రూ. 7వేల వరకు జీతాలు పెరగనున్నాయి. పెంచిన వేతనాలను జూలై నుంచే అమల్లోకి తీసుకువచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. తాజా నిర్ణయం వల్ల రాష్టవ్య్రాప్తంగా 1,04,377 మంది అంగన్‌వాడీ వర్కర్లు ప్రయోజనం పొందనున్నారు. వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం ప్రతి నెలా రూ. 125.25 కోట్లు చెల్లిస్తుంది. ఇప్పటి వరకు అంగన్‌వాడీ వర్కర్ జీతం రూ.7వేలుగా, హెల్పర్లకు రూ. 4,500 గా వేతనాలు అమల్లో ఉన్నాయి.
చేనేత, ఆక్వా రంగాలకు రూ.1.50కే యూనిట్ విద్యుత్
చేనేత, ఆక్వా రైతులు, నారుూ బ్రాహ్మణులకు విద్యుత్ యూనిట్ ధర రూ. 1.50కు అందిస్తామని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన మేరకు ఇప్పటికే జీవో జారీ అయింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇందు కోసం రూ. 475 కోట్లను కూడా ప్రభుత్వం కేటాయించింది. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్టీ కాలనీలు, తండాల్లో నివసిస్తున్న వారికి ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రతి ఏటా రూ. 81.11 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది.
హిందూ ధార్మిక సంస్థలు, ఆలయ కమిటీల్లో మార్పులు, చేర్పులు జరపటంతో పాటు అవసరమైతే రద్దు చేసేందుకు వీలుగా 1987 చట్టానికి సవరణతో ప్రతిపాదించిన ముసాయిదా బిల్లుపై మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ఆలయాల నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీఐఐసీకి భూ కేటాయింపు
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పార్క్ కోసం ఏపీఐఐసీకి 149 ఎకరాల భూములు కేటాయించేందుకు జారీ చేసిన జీవోను మంత్రివర్గం ఆమోదించింది.
పాలనలో విప్లవాత్మక మార్పులు
పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా త్వరలో గ్రామ వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుకు మంత్రివర్గం సుముఖత తెలిపింది. దీనివల్ల ప్రభుత్వ పాలన గ్రామం ముంగిటకే తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ పథకాలు, సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు సచివాలయాల వ్యవస్థ దోహదపడగలదనే ఆశాభావాన్ని కేబినెట్ వ్యక్తపరచింది. ప్రభుత్వం ప్రధానంగా అమలు చేయాలని నిర్ణయించిన నవరత్నాలు అర్హులకు అందించేందుకు వీలుగా 2వేల మంది జనాభాకు గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. గ్రామ స్థాయిలో అభివృద్ధి, ప్రణాళికలను పటిష్టంగా నిర్వహించాలనేది ఈ వ్యవస్థ లక్ష్యాలుగా మంత్రివర్గం నిర్దేశించింది. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఓ వలంటీర్‌ను నియమించి నెలకు రూ. 5వేల వేతనం అందించటం, ప్రతి సచివాలయంలో కనీసం 10 నుంచి 12 మంది ఉద్యోగులు ఉండేలా ఈ వ్యవస్థకు రూపకల్పన జరుగుతోంది. గ్రామాల్లో వాలంటీర్ల నియామక ప్రక్రియకు మండలానికి రూ. 20వేల చొప్పున సుమారు రూ.1.5 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం లభించింది. వలంటీర్లకు రెండురోజుల శిక్షణలో భాగంగా రోజుకు రూ.250, మెటీరియల్‌కు రూ.100 చొప్పున మొత్తం 12 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. వచ్చేనెల 15వ తేదీ నుంచి గ్రామాల్లో వలంటీర్లు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
చిత్రం...క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి