రాష్ట్రీయం

కరకట్టపై కట్టడాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: చట్టాలను రూపొందించిన వారే వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రశ్నించారు. శాసనసభలో గురువారం అక్రమ కట్టడాలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అధికారులను బెదిరించి చట్టాలకు అతీతంగా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించినందుకే ప్రజావేదికను కూల్చివేశామని, ప్రతిపక్షనేత చంద్రబాబు ఉంటున్న భవనంతోపాటు ఆ ప్రాంతంలో 30 కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేయించామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆ ప్రాంత అక్రమ కట్టడాలను సభలో వీడియో ద్వారా ప్రదర్శింపచేస్తూనే ప్రజావేదిక నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రివర్ కన్జర్వేటర్, సెంట్రల్ డెల్టా ఈఈ 2017లో రాసిన లేఖను కూడా చూపించారు. నదీ ప్రవాహాలకు అక్రమ కట్టడాలతో అవరోధాలు సృష్టిస్తే ప్రవాహ దిశ మారి అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతాయన్నది తెలియదా అని ప్రశ్నించారు. ముంబాయి, చెన్నై నగరాల్లో ఇటీవల సంభవించిన వరద బీభత్సాన్ని చూడలేదా అన్నారు. లింగమనేని రమేష్ అడ్డగోలుగా నిర్మించిన భవనం దొరికింది కదా అని అందులో ప్రవేశించి, 1200 చదరపు గజాలలో ప్రజావేదిక నిర్మాణం కోసం ఫైళ్లను కదిలించగా నాడు కన్జర్వేటర్, ఈఈ ఇచ్చిన సమాధానాన్ని బుట్టదాఖలా చేశాడన్నారు. నిబంధనల ప్రకారం నదీ ప్రవాహానికి 22.60 మీటర్ల లోపు ఏ కట్టడం ఉండరాదని, అందుకే ప్రజావేదిక నిర్మాణం తగదని ఈఈ స్పష్టం చేశారన్నారు. అయితే బాబు నివాస గృహం చాలా లోతట్టులో 19.50 మీటర్ల లోపే ఉందన్నారు. బాబు నివసించే ఇంటితోపాటు ఆ ప్రాంతంలోని ఇతర కట్టడాలను ఆరు నెలల్లో కూల్చివేయాలంటూ లోకాయుక్త ఆదేశించిన విషయాన్ని పేర్కొన్నప్పటికీ పట్టించుకోలేదంటే ఈ వ్యక్తికి జ్ఞానం ఉందా అనిపిస్తోందని ఆవేశంతో అన్నారు. బాబు చేసిన పనికి ఆ తర్వాత అదే వరుసలో అనేక నిర్మాణాలు వెలిశాయని, పైగా తనకు అనుకూలంగా జీవోలు సృష్టించుకుని వాటిని నేడు చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. చట్టాలను రూపొందించి అమలు చేసే సీఎం, మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ముఖ్య కార్యదర్శులతో కూడిన సమావేశాన్ని కావాలనే ప్రజావేదికలోనే నిర్వహించి వారందరికీ తెలిసేలా, అలాగే వారందరూ చట్టాలను పక్కాగా అమలు చేయించేందుకే కూల్చి వేయాలంటూ ఆదేశించానన్నారు. అయితే అదేదో జాతీయ సమస్యలా అర్ధరాత్రి వేళ హైకోర్టు తలుపులు కొట్టారన్నారు. ప్రధాన న్యాయమూర్తి అన్నీ విచారించి కూల్చివేయమంటూ ఆదేశాలిచ్చారని చెబుతూ నాడు బాబు చూపే కాపీలు చెల్లుబాటు కాలేదన్నది అర్థమవుతోంది కదా అన్నారు. 2006లో స్విమ్మింగ్ పూల్ పేరిట ఏదో అనుమతి తెచ్చుకుని రెండంతస్తుల భవనాన్ని నిర్మిస్తే అందులో నివసిస్తూ తాము చెప్పేవన్నీ వక్రీకరిస్తూ రాజకీయం చేస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ తనపై ఏదో విధంగా బురదజల్లే ప్రయత్నం చేస్తూ అవమానిస్తున్నారు.. తిడుతున్నారు... ప్రజల కోసం తాను అన్ని పడతాను, బెదిరింపులకు లొంగబోను, రోడ్డుపై పడుకోటానికైనా సిద్ధమేనన్నారు. తాను నివసించే భవనం అద్దె భవనం మాత్రమేన్నారు. ప్రతిపక్ష నేతగా తనకు ప్రజావేదిక కేటాయించాలని లేఖ రాసినందుకే కక్షగట్టి దానిని కూల్చేశారన్నారు. తనపై కడుపుమంటతో కాలువలు, నదులు పక్కనే ఉన్నాయనే కారణంతో లక్షలాది పేదల గృహాలను కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలుంటే ప్రజాపయోగ పనుల కోసం క్రమబద్ధీకరించవచ్చునన్న తీర్పులున్నాయన్నారు. తాను నివసించేది నదీ పరివాహకం కాదన్నారు. సమీపంలో బ్యారేజీ ఉందన్నారు. 30 మీటర్ల పైన ప్రైవేట్ స్థలాల్లో కట్టడాలకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అలాగైతే జగన్ ఎంపీగా, ప్రతిపక్షనేతగా ఊరూవాడా వైఎస్ విగ్రహాలను పెట్టించారు.. ప్రమాదాలు జరుగుతున్నందున రోడ్లపై విగ్రహాలకు అనుమతినివ్వరాదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఉంది.. దీనికేమంటారని ప్రశ్నించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు మూకుమ్మడిగా లేచి నిరసన తెలుపగా దివంగత వైఎస్‌తో తనకు రాజకీయ విరోధమే తప్పించి, వ్యక్తిగత వైరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులుగా ఐదేళ్ల పాటు కల్సి ఉన్నాం. ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం. ఎవరు ఎవరికి సీటు ఇప్పించారో చనిపోయిన వైఎస్‌కే తెలుసునన్నారు. దీనిపై అంబటి రాంబాబు మాట్లాడుతూ రూపాయి రూపాయి చందా వేసుకుని ప్రజలు విగ్రహాలు పెట్టారు.. నీకెందుకంత కడుపుమంట.. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై అంబేద్కర్, జగ్జీవన్‌రామ్, ఎన్టీఆర్ విగ్రహాలనేకం ఉన్నాయన్నారు. చట్టంపై గౌరవం ఉంటే తక్షణం ఆ ఇంటిని ఖాళీ చేయాలన్నారు. ప్రతి దానికీ ఘీంకరిస్తుంటే ఇక్కడ బెదిరేవారు లేరన్నారు. మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలకు హైకోర్టు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చిందన్నారు. టీడీపీ ఉప నేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ ప్రజాధనంతో నిర్మితమైన కట్టడాలు కూల్చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమం... ఇప్పుడు సక్రమమని భావించి ప్రారంభోత్సవానికి వెళ్లలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నది, కాలువగట్లపై 74,070 నిర్మాణాలు గుర్తించి ఇప్పటికే 15,309 నిర్మాణాలు కూల్చివేశామన్నారు. చట్ట ప్రకారం మిగిలిన నిర్మాణాలపై కూడా చర్య తీసుకుంటామన్నారు. తాజ్‌మహల్ కట్టడం సక్రమమా? అక్రమమా అని ప్రశ్నిస్తే ఎలా అంటూ ఎద్దేవా చేశారు.