రాష్ట్రీయం

ప్రాజెక్టులపై సభలో వాగ్వాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్‌ల పురోగతిపై చర్చ శాసనసభలో ప్రకంపనలు సృష్టించింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రాజెక్ట్‌ల ప్రస్తావన వచ్చింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో భారీ దోపిడీ జరిగిందని అందువల్లే తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని ముందుకు తెచ్చిందని వైకాపా సభ్యులు వాదించారు. జలయజ్ఞం పేరుతో వైఎస్ హయాంలో కమీషన్లు కాజేశారని పోలవరం ప్రాజెక్ట్‌లో జాప్యం వల్లే అంచనాలు అంతకంత పెరిగాయని టీడీపీ సభ్యులు స్పందించారు. తెలంగాణతో చేతులు కలిపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని టీడీఎల్పీ
ఉపనేత అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వైకాపా అధికారంలోకి వచ్చి 40 రోజులైందని ఇంత వరకు ఒక్క ప్రాజెక్ట్‌లో కూడా రివర్స్ టెండరింగ్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేస్తే ప్రతి ఎకరానికి నీరందుతుందని సూచించారు. తెలంగాణ వల్ల రాష్ట్రానికి పైసా లాభం చేకూరకపోగా నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. అన్నీ తెలంగాణకే రాసిస్తున్నారని ఆరోపించారు. నీటి పారుదలకు సంబంధించి అనుకూల, ప్రతికూల అంశాలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నామని అవసరమైతే తమ సలహాలు, సూచనలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. నీటిపారుదలశాఖ మంత్రి ప్రతి విషయాన్ని విమర్శనాత్మకంగా తీసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశాలు జరిపారు.. అయితే ఏపీకి భవిష్యత్‌లో తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశాలు లేకపోలేదన్నారు. ప్రజాస్వామ్యంలో సూచనలు, సలహాలు తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు.
మీ నీతులు మేం వినాలా: మంత్రి అనిల్‌కుమార్
ప్రాజెక్ట్‌లను దోచేసిన మీరు నీతి వాక్యాలు వల్లిస్తుంటే మేం వినాలా అని అచ్చెన్నాయుడిపై జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. ప్రాజెక్ట్ పనుల్లో అవినీతిపై విచారణ కోసం 45 రోజుల పాటు నిలిపేయాలని తమ ప్రభుత్వం గడువు విధించిందని ఇప్పటికి 33 రోజులు మాత్రమే గడిచిందన్నారు. ఇంకా 12 రోజుల్లో లెక్కలన్నీ తీసిన తరువాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో టీడీపీ ప్రభుత్వం వేలకోట్లు కాజేసిందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. గ్రావిటీ ద్వారా నీటిని విడుదలచేసి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినట్లుగా చేతులుదులుపుకునే ప్రయత్నాలు చేశారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని చురకలంటించారు. తమ ప్రభుత్వం నిపుణులు, అధికారులతో చర్చించి వారిచ్చిన నివేదిక ఆధారంగానే 2021 నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉందన్నారు. టీడీపీ నిర్వాకం వల్లే ప్రాజెక్ట్ నిర్మాణం లోపభూయిష్టంగా జరిగిందని ఆరోపించారు.
పొరుగు రాష్ట్రాలతో సన్నిహితంగా ఉంటే తప్పేంటి: మంత్రి బుగ్గన
ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు టీడీపీ నిర్వాకం వల్లే రాష్ట్రం నష్టపోయిందని, పొరుగు రాష్ట్రాలతో సన్నిహితంగా ఉంటే తప్పేంటని నిలదీశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి చంద్రబాబు పరారై వచ్చారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలు ఉపయోగించు కోలేని స్థితిలో ఉన్నాయని చెప్తూ వాటికి గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు కూడా చెల్లించ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వమైనా ఉపయోగించుకుంటుందనే ఉద్దేశంతోనే వాటిని అప్పగించామని వివరణ ఇచ్చారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను గత ప్రభుత్వమే వదిలేసి ఇక్కడకు వచ్చిందని గుర్తుచేశారు. తుంగభద్ర ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందని అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. గోదావరి జలాలను సునాయసంగా అక్కడి నుంచి తీసుకు రావచ్చనే నిపుణుల సలహా మేరకు తెలంగాణతో సంప్రతింపులు జరుపుతున్నట్లు తెలిపారు. కేసీఆర్‌తో జతకలిస్తే టీడీపీకి అక్కసు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు.
వైఎస్ హయాంలోనే ప్రాజెక్ట్‌లు
చింతలపూడి ఎమ్మెల్యే ఆర్ ఎలీజా మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసమే నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జలయజ్ఞం ప్రారంభించారని గుర్తుచేశారు. రైతుల పక్షపాతిగా జగన్ రివర్స్ టెండరింగ్‌తో పారదర్శకంగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని ప్రకటించారని దీన్ని స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు.
అంతా అవినీతి మయం: ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి
వైకాపా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నీరు- చెట్టు పథకంలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. అనుమతులు లేకుండా చెరువుల నుంచి ఇసుకను తరలించారని ఆరోపించారు. ఇప్పుడు చెరువుల్లో కంపచెట్లు పెరిగాయని ఇందుకు టీడీపీ బాధ్యత వహించాలన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు బాలరాజు, చిన్నప్పలనాయుడు, శ్రీ్ధర్‌రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మధ్య ప్రాజెక్ట్‌లపై వాగ్వాదం చోటు చేసుకుంది.