రాష్ట్రీయం

జూరాలకు ఆగని వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 12: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం ఎగువ ప్రాంతం నుంచి జూరాలకు 8.34 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు 60 గేట్లను ఎత్తి దిగువకు 8,26,855 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గత రెండు రోజులుగా జూరాలకు రికార్డుస్థాయిలో వరదనీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు అధికారులు, జిల్లా అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకులేకుండా పోయింది. 2009 వరద బీభత్సానికి అతలాకుతలమైన జూరాల, కృష్ణానది పరీవాహక ప్రాంతాలన్నింటినీ అప్రమత్తం చేసి అధికారులు ఎలాంటి నష్టం జరుగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ వేలాది ఎకరాల్లో పంట నష్టంమాత్రం కాపాడలేక పోయారు. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలతో పాటు భీమా నది వరద ఉద్ధృతికి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. సోమవారం మధ్యాహ్నం నుంచి భీమానది వరద ఉద్ధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్టు అధికారులు తెలిపారు. జూరాల జలాశయంలో 316.42 మీటర్లు, 5.821 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకున్నారు. అదేవిధంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 1500, భీమా లిఫ్ట్-1కు 1300, లిఫ్ట్-2కు 750, కోయిల్‌సాగర్‌కు 315, సమాంతర కాలువకు 750, జూరాల కుడి, ఎడమ కాలువలకు 1419 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలో 489.41 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ ఉంచుకొని దిగువకు 5,99,920 క్యూసెక్కులను వదులుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి నారాయణపూర్‌కు 4.90 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. ఆల్మట్టి జలాశయంలో 105.27 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోగా దిగువకు 5,40,991 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఆల్మట్టికి 6,30,042 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్టు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. జూరాలకు వస్తున్న వరదనీటి ఉదృతితో విద్యుత్ ఉత్పత్తిని జెన్‌కో అధికారులు నిలిపివేశారు.
ప్రాజెక్టు వద్ద జనసంద్రం..
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలిరావడంతో జూరాల జనసంద్రంగా మారింది. సెలవురోజులు కావడంతో పాటు బక్రీద్ పండుగ ఉండడంతో ముస్లింలు, ఇతరులు పెద్దసంఖ్యలో ప్రాజెక్టుకు చేరుకొని సందడి చేశారు. సందర్శకుల తాకిడిని గమనించిన పోలీసులు గట్టిబందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక పార్కింగ్, నది, ప్రాజెక్టు పరిసరాల వద్దకు రాకుండా కంచెను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుపై ఎలాంటి వాహనాలు తిరుగకుండా పోలీసులు ముమ్మరగస్తీ నిర్వహించారు. దాదాపు సోమవారం 2లక్షల వరకు పర్యాటకులు సందర్శించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
చేపలకు భలే గిరాకీ...
జూరాలకు వస్తున్న వరదను తిలకించేందుకు వచ్చే సందర్శకుల తాకిడి జూరాల చేపల విక్రయదారులకు పంట పండించింది. సోమవారం చేపలు రికార్డుస్థాయిలో అమ్ముడుపోవడంతో పాటు ధరలు కూడ విపరీతంగా పెంచారు. మిగతా సమయంలో రూ.100కు లభించే చేపలు సోమవారం రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయించారు. అదేవిధంగా జూరాల చుట్టుపక్కల చేపల పులుసు, ఫ్రై దుకాణాలు కిక్కిరిసి పోవడంతో కొందరు వెనుదిరిగి పోయారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ధరలను లెక్కచేయకుండా ఆరగించి వెళ్లారు.
చిత్రం...జూరాల ప్రాజెక్టు 60 గేట్ల ద్వారా విడుదలవుతున్న వరద