రాష్ట్రీయం

ఒడిశా వరద రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 9: అంతర్రాష్ట్ర జలవివాదంలో చిక్కుకున్న వంశధార నీటి వాటాలను ముకుందశర్మ కమిటీ ఓ కొలిక్కి తెస్తున్న సమయంలో ఒడిశా ఇంజనీరింగ్ అధికారులు కుయుక్తులు పన్నుతున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం ఎక్కువైతే ఒడిశాలో గ్రామాలు ముంపునకు గురవుతాయన్న తమ వాదనకు బలం చేకూర్చుకునేందుకు ఆదివారం రాత్రి ఒడిశా అధిరులు వేసిన ఎత్తుగడ ఆంధ్రా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో చిత్తయ్యింది. ఆంధ్రా ఇంజనీర్లకు వరదనీటి సమాచారం ఇవ్వకుండా గంటల వ్యవధిలో 72 వేల క్యూసెక్కుల వరదనీరు వంశదారలో ప్రవహించేలా ఒడిశా రిజర్వాయర్ల గేట్లు ఎత్తేసిన సంఘటన ఇది. అప్పటివరకూ వంశధారలో వరద వచ్చేముందు శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టాబ్యారేజీ అధికారులకు ముందస్తు సమాచారం ఒడిశా అధికారుల నుంచి వచ్చేది. ఒడిశాలో కురిసిన వర్షాల వివరాలు కూడా అందేవి. అలాంటిది వంశధారలో భారీగా వరద నీరు వచ్చి చేరినా ఆంధ్రాలోని గొట్టాబ్యారేజీ అధికారులకు ముందస్తు సమాచారం ఏ మాత్రం లేకపోవడం ఇక్కడి అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు లేనప్పటికీ ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో వర్షాలు కురిస్తే వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదులు పొంగిపొర్లుతాయి. ప్రధానంగా వంశధార నదికి వచ్చేసరికి ఎగువన ఒడిశాలో కెందుగుడ, అడబంగి ప్రాంతాల్లో రిజర్వాయర్లు ఉన్నాయి. వాస్తవంగా అయితే గిరి కొండల్లో వర్షాలు కురిస్తేనే వంశధార ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. అందులోనూ రిజర్వాయర్ల నుంచి నీరు విడిచిపెట్టేటప్పుడు దిగువ ఉన్న ప్రాంతాలకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, కొన్నాళ్ళుగా ఒడిశా ఎగువప్రాంతం రిజర్వాయర్ల గేట్లు ఎత్తేసిన సమచారం ఆంధ్రా ఇంజనీర్లకు ఇవ్వడం లేదు. దీనివల్ల ఆదివారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరిక దాటేలా 78 వేల క్యూసెక్కుల నీరు గొట్టాబ్యారేజీ నుంచి విడిచి పెట్టేంతవరకూ అక్కడి అధికారులకు పూర్తి సమాచారం లేదు. ఆదివారం సాయంత్రం ఆరుగంటల సమయానికి 20 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించగా, అర్ధరాత్రి సమయానికి 50 వేల క్యూసెక్కులు, సోమవారం ఉదయానికి 78 వేల క్యూసెక్కులు వరద ఒడిశా నుంచి వచ్చేసింది. వరద ప్రవాహం ఏ మాత్రం ఉంటుందనే సమాచారం అప్పటికీ సంబంధిత అధికారుల వద్ద లేదు. ఇది రానురాను రెండవప్రమాద హెచ్చరికకు చేరడంతో గొట్టాబ్యారేజీ ఇంజనీర్లకు ముచ్చెమటలు పట్టేసాయి. దీంతో వెంటనే కలెక్టర్ నివాస్ దృష్టికి తీసుకెళ్లి ఆయనతో చర్చించి వెంటవెంటనే గొట్టా గేట్లు ఎత్తేసారు. అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా 41 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని, శ్రీకాకుళం జిల్లాలో భామిని మండలం నుంచి గార వరకూ సుమారు 12 మండలాలు వరద ప్రమాదం ఎదుక్కోవాల్సి వచ్చేది. గతంలో ఇంతకు మూడింతలు ప్రవాహం వచ్చినా ఎప్పటికప్పుడు ఒడిశా నుంచి సమాచారం ఉండేది. ఈసారి అలాంటి సమాచారం లేకపోవడంతో ఇది ఒడిశా పన్నిన కుయుక్తిగా ఆంధ్రా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా వంశధార జలవివాదం కోసం ఏర్పాటైన ట్రిబ్యునల్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆంధ్రా ప్రాంతానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి ఒడిశా ప్రభుత్వం గుర్రుగా ఉంది. వాస్తవానికి నేరడి బ్యారేజీ కోసం ఆంధ్రా ప్రభుత్వం పోరాడుతున్నప్పటికీ, ట్రిబ్యునల్ మాత్రం స్టేజ్-2లో భాగంగా వంశధారకు చేరిన వరద కాట్రగడ నుంచి వరద కాలువ (సైడ్‌వీర్)ద్వారా కేవలం 8 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతులు ఇచ్చింది. నదికి ఇరువైపులా ఆంధ్రా - ఒడిశా ప్రాంతాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఆంధ్రాకు కూడా ముప్పు ఉంటుంది కదా అని ముకుందశర్మ కమిటీ ఇటీవల పర్యవేక్షణకు వచ్చినప్పుడు ప్రశ్నించిన సంఘటనలే ఒడిశా ఇంజనీర్లలో ప్రతీకారం పెరగడానికి కారణంగా కన్పిస్తోందని ఆంధ్రా ఇంజనీర్లు పేర్కొనడం గమనార్హం.
కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు
ఒడిశా ఎగువ ప్రాంతంలో కుండపోత వర్షాలు లేకపోయినప్పటికీ, అత్యవసరంగా వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేసే అవసరం లేనప్పటికీ ఒడిశా ఇంజనీర్లు రెండు రిజర్వాయర్ల వద్ద నిల్వలు ఉంచకుండా గొట్టా బ్యారేజీలోకి వరదనీటిని వదిలేస్తున్నారంటూ సోమవారం ఇక్కడ ఇరిగేషన్ అధికారులు కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గత రెండురోజులుగా గజపతి జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఒడిశా ప్రభుత్వం ఇరిగేషన్ ఎస్‌ఈ మహంతి, డీఈ రథో, ఏఈ పాడి రెండు రోజులుగా గొట్టాబ్యారేజీ వద్ద ఎగువప్రాంతం నుంచి వచ్చే వరదనీటిని గమనిస్తూ ఆ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. సమాచారం లేకుండా వరదనీటిని ఎందుకు కిందకు పంపుతున్నారంటూ గొట్టా బ్యారేజీ అధికారులు ప్రశ్నించగా, గజపతి జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మా విధులు నిర్వహిస్తున్నామంటూ వారు చెప్పడం గమనార్హం. ఈ వివరాలన్నీ కలెక్టర్ నివాస్ దృష్టికి తీసుకువెళ్ళిన వంశధార ఇంజనీర్లు ఆయన సూచనల మేరకు కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసారు.
చిత్రం... గొట్టా బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న ఒడిశా ఇంజనీర్లు