రాష్ట్రీయం

టీటీడీ వెబ్‌సైట్‌లో ‘యేసయ్య’ ఎప్పుడూ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: హిందువుల మనోభావాలను దెబ్బతీసి మత కలహాలను సృష్టించడానికి కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని, వారి ఆటలు సాగనివ్వబోమని, టీటీడీ వెబ్‌సైట్లో యేసయ్య అనే పదం ఎప్పుడూ లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక పద్మావతి అతిధిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ వెబ్‌సైట్లో యేసయ్య అని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై చైర్మన్ తీవ్రంగా స్పందించారు. ఇది ఒక కుట్రన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఒక ప్రయత్నమన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒక పత్రికా యజమాని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు కథనాలను రాసేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు అపకీర్తిని అంటగట్టడానికి కుట్ర జరిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈక్రమంలోనే గత
ప్రభుత్వంలో ఆర్టీసీ టికెట్లపై ముద్రించబడ్డ అన్యమత ప్రస్తావనను ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేశారన్నారు. వాటి వెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలుసన్నారు. తాజాగా వివాదాస్పదమైన ఈ అంశం కూడా గత ఎన్నికలకు ముందు గూగుల్ సెర్చ్‌లో ఏర్పాటు చేసిందేనన్నారు. దానికి, టీటీడీ వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. వెంకన్నపై కుట్రలు పన్నితే ఎవరైనా, ఎంతటివారైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పత్రికలు కూడా ఆధారాలు లేకుండా ఇలాంటి సున్నితమైన అంశాలపై ప్రజలను తప్పుదారి పట్టించే కథనాలు రాయడం సరికాదన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి గూగుల్‌కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీని వెనుక ఉన్న వాస్తవాలను నిగ్గు తేలుస్తామన్నారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన వారిని వదలమని, క్రిమినల్ కేసులు బనాయిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఆయన్ను ఏమీచేయలేని స్థితిలో ఇలాంటి బురదజల్లే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు తెగబడుతున్నారని, ఇది మంచిది కాదని హితవు పలికారు. టీటీడీ ఐటీ విభాగం అధికారులు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు రావు కదా అని విలేఖరులు ప్రశ్నించారు. అందుకు ఈఓ ఏకే సింఘాల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తించే తక్షణం స్పందించామన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో భక్తుల సౌకర్యార్ధం పంచాంగాన్ని అందుబాటులో ఉంచామన్నారు. ఈ వివాదంతో టీటీడీ వెబ్‌సైట్ నుంచి పంచాంగాన్ని కూడా తొలగించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతమంది ఇలా దుర్వినియోగం చేస్తున్నారని, ఇది బాధాకరమన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ అన్యమత ప్రచారం జరుగుతోందని ఒక దినపత్రిక దురుద్దేశంతో ఇలాంటి కథనాలను ప్రచురిచందన్నారు. ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని దుష్ట శక్తులు అన్యమత ప్రచారం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రతో, ప్రతిష్టతో చెలగాటం అడితే ఎవరైనా తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎవరైనా ఇలాంటి కుట్రలు పన్నితే వారి ఆటలు కట్టించేందుకు టీటీడీలో సైబర్ క్రైమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని టీటీడీ అధికారులతో సమాచాలోచన చేశామన్నారు. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో చర్చిస్తామన్నారు. తద్వారా ఆన్‌లైన్ వేదికగా టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి మార్గం మరింత సులభతరం అవుతుందన్నారు. ఇక గూగుల్ సెర్చ్‌లో టీటీడీ వికారనామ సంవత్సర పంచాంగం 2019-20 అని టైప్ చేస్తే అందులో శ్రీ యేసయ్య అనే పదం శనివారం డిస్‌ప్లే అయ్యిందన్నారు. టీటీడీ పంచాంగం మొదటి పేజీలో తెలుగులో శ్రీ యేసయ్య అనే పదం కనిపిస్తుందని, దీన్ని గూగుల్ ఇంటర్‌ప్రిటర్‌లో తీసుకున్నప్పుడు హెచ్‌టిఎంఎల్ క్యాషెలో శ్రీ యేసయ్యగా మార్పు చెంది ఉండవచ్చన్నారు. గూగుల్ ఇంటర్‌ప్రిటర్‌లో తర్జుమా అయ్యే పదాలు పిడిఎఫ్ ఇమేజ్ బార్డర్ పరిమాణం, ఫాంట్ సైజ్, ఫాంట్ టైప్, అక్షరాల మధ్య స్పేస్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఇది గూగుల్ ఇంటర్‌ప్రిటర్ సమస్యేనని, టీటీడీ పంచాంగంలో దొర్లిన తప్పు కాదని అన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఈ విషయంపై శనివారం గూగుల్‌కు రిపోర్టు చేసి వివరణ కోరామన్నారు. ఆ తరువాత గూగుల్ క్యాషెలో అప్‌డేట్ అవడానికి 12 గంటలు పట్టిందన్నారు. ఆ తరువాత ఆ పదం కనిపించలేదని చైర్మన్ చెప్పారు. టీటీడీ వెబ్‌సైట్‌ను బయట నుంచి ఎవరూ హ్యాక్ చేయడం గానీ, టీటీడీ ఇన్‌హౌస్‌లో ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం అయినట్లు గానీ ఐటీ టెక్నికల్ టీమ్ విచారణలో తెలియలేదన్నారు. ఇది కేవలం గూగుల్ ఇంటర్‌ప్రిటర్ సమస్యగానే గుర్తించామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో టీటీడీ తిరుపతి జేఈఓ బసంత్‌కుమార్, సీవీఎస్వో గోపీనాథజెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి పాల్గొన్నారు.

*చిత్రం...విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి