ఆంధ్రప్రదేశ్‌

ఐదున్నర దశాబ్దాల కల సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 19: వశిష్ట వారధి.... ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన బ్రిడ్జి. దీని నిర్మాణ ప్రతిపాదనలు మొదలై ఇప్పటికి 56 ఏళ్లు గడిచాయి. 1960లో దామోదర సంజీవయ్య మంత్రివర్గంలో గోదావరి జిల్లాలకు చెందిన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అల్లూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో వంతెన నిర్మాణ ప్రతిపాదనలు మొదలయ్యాయి. తదనంతరం ఎన్టీఆర్, వైఎస్సార్ ముఖ్యమంత్రుల హోదాలో శంకుస్థాపనలు చేసినా ఇప్పటివరకు ఒక్క అడుగుకూడా ముందుకు కదల్లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హర్బర్‌కి, కాకినాడ - పుదిచ్చేరి జల రవాణాపై ముంబైలో జరిగిన మారిటైమ్ సదస్సులో అవగాహన ఒప్పందాలు (ఎంఒయు) కుదరడంతో వారధి నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మధ్య గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి 1960లోనే అంకురార్పణ జరిగింది. ఇక్కడ రాకపోకలకు గోదావరిలో ఫంటుపై ప్రయాణమే ఆధారం. తదనంతరం ఈ ప్రతిపాదనలు మూలనపడ్డాయి. అయితే 1985లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్వర్ణతాపీతో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కూడా ముందుకు కదలలేదు. తిరిగి 2008 ఏప్రిల్ 15వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి మరోమారు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అయినా పరిస్థితి ఎక్కడవేసిన గొంగళే. అంతకుముందు 2003లో కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హోదాలో యువి. కృష్ణంరాజు, రాష్టమ్రంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురంలోని రేవువద్ద ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మూడు శిలాఫలకాలు ఆవిష్కృతమైనా ఈ బ్రిడ్జి నిర్మాణం మాత్రం ముందుకు సాగలేదు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హర్బర్‌కి, కాకినాడ - పుదుచ్చేరి జల రవాణాపై ముంబైలో జరిగిన మారిటైమ్ సదస్సులో అవగాహన ఒప్పందాలు (ఎంఒయు) కుదిరిన సంగతి విదితమే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగరమాల పథకంలో భాగంగా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హర్బర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో వసిష్ఠ వారథికి కదలిక వచ్చింది. ఈ హర్బర్‌కు అనుసంధానంగా జాతీయ రహదారులను కలుపుతూ నాలుగులేన్ల రహదారుల ఏర్పాటుకు సంబంధించి జరిగిన సర్వేలో అనేక రహదారులను పరిశీలించారు. ఈతకోట - అంతర్వేది - గన్నవరం, పెరవలి - అంతర్వేది వయా చించినాడ, పెరవలి - అంతర్వేది వయా నరసాపురం మీదుగా రహదారులను పరిశీలించారు. ఇందులో నరసాపురం మీదుగా వంతెన, రహదారుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నరసాపురం - సఖినేటిపల్లి వంతెన నిర్మాణం కల సాకారం కానుంది. సాగరమాల ప్రాజెక్టు కింద తొలిదశలో కేటాయించిన రూ.1800 కోట్లలో నరసాపురం - సఖినేటిపల్లి వసిష్ఠ వంతెన ఉండటంతో గోదావరి జిల్లాల చిరకాల కలకు కదలిక వచ్చింది.
కోనసీమ నుంచి ఒంగోలుకు దగ్గర దారి...
నరసాపురం-సఖినేటిపల్లి మధ్య వశిష్ట వారథి నిర్మాణం పూర్తయితే 214ఎ జాతీయ రహదారికి మహర్దశ పట్టనుంది. తూర్పుగోదావరి జిల్లాలోని మల్కిపురం - రాజోలు, సఖినేటిపల్లి, నరసాపురం, పెనుమర్రు మీదుగా మచిలీపట్నం అక్కడ నుంచి నేరుగా ఒంగోలు చేరుకోవచ్చు. అమలాపురం నుంచి సఖినేటిపల్లి వరకు కోనసీమ ప్రాంతం నరసాపురం మీదుగా అతితక్కువ దూరంతో మచిలీపట్నం చేరుకోవచ్చు. ఇక నరసాపురం ప్రాంతంలో నీరు, విద్యుత్‌తో పాటు కీలక రవాణా సంస్థ కూడా ఏర్పడితే పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశముంది. తీరం పొడవునా ఆక్వా రవాణాకు సౌకర్యం ఏర్పడి పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయి.
రూ.200 కోట్లకు చేరిన అంచనా వ్యయం
1985లో ఎన్‌టిఆర్ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శిలాఫలకాన్ని ఆవిష్కరించినపుడు ఈ వంతెన నిర్మాణ అంచనా వ్యయం రూ.6 కోట్లు. ఇక 2008 ఏప్రిల్ 15వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.67.50 కోట్ల అంచనా వ్యయంతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం 391.50 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ వసిష్ఠ వారధి నిర్మాణ వ్యయం సుమారు రూ.200 కోట్లకు చేరుకుంటుందని అంచనా.