తెలంగాణ

మిషన్ కాకతీయ స్ఫూర్తితో దేశంలో 5లక్షల నీటి కుంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: మిషన్ కాకతీయను స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఐదు లక్షల చిన్న తరహా నీటి కుంటలు( వాటర్ పాండ్) ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని కేంద్ర జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడు, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.
మిషన్ కాకతీయ మొదటి దశ పనులు చురుగ్గా జరిగాయని, రెండవ దశ పనులు మందకొడిగా సాగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. ప్రజాప్రతినిధులు మొదటి దశలో చూపిన చొరవ రెండవ దశలో చూపడం లేదని అన్నారు. పలు నియోజక వర్గాల్లో ఇంకా రెండవ దశ పనులే ప్రారంభం కాలేదని చెప్పారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలు బాగా వెనకబడ్డాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో 742 పనులకు టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తి చేసుకొని 589 పనులు ప్రారంభించారని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో 50 శాతం పనులు కూడా ప్రారంభం కాలేదని, మహబూబ్‌నగర్ జిల్లాలో 414 పనులకు టెండర్లు పూర్తి కాగా, 206 పనులు ప్రారంభం అయినట్టు చెప్పారు. చెరువుల పునరుద్ధరణ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పనిగా భావించాలని అన్నారు. శాసన సభ్యులు ఉత్సాహం చూపని కారణంగా చెరువుల పనులు ప్రారంభం కాలేదంటూ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. రెండవ దశ కింద 3000 కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయించినట్టు హరీశ్‌రావు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చెరువుల పునరుద్ధరణ ఒక ఆయుధంగా మారిందని మంత్రి తెలిపారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో తెలంగాణకు కేటాయించిన 265 టిఎంసిల నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి వీలుగా రాష్ట్రంలో 46వేల 500 చెరువులను పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన ఆరుకోట్ల 40లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని రైతులు స్వచ్ఛందంగా తరలించారని అన్నారు. మిషన్ కాకతీయ రెండవ దశను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పూడిక మట్టిని పొలంలో చల్లడం వల్ల పంట దిగుబడి పెరుగుతుందని, రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందని, పెట్టుబడి కూడా తగ్గుతుందని ఇక్రిశాట్ పరిశోధనలు స్పష్టం చేసినట్టు తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయ తొలి దశలో 8217 చెరువుల పనులు చేపట్టగా 6500 పూర్తయ్యాయని, 2609 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు హరీశ్‌రావు తెలిపారు.