రాష్ట్రీయం

79 మంది స్మగ్లర్లపై పిడి యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 9: 79 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై పిడి యాక్టు నమోదుచేసినట్లు రాయలసీమ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివి.గోపాలకృష్ణ వెల్లడించారు. బుధవారం కడప జిల్లాలో పర్యటించిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్‌తో ఎవరికి సంబంధాలున్నా ఉపేక్షించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. స్మగ్లర్లు, కూలీలనూ వదిలే ప్రసక్తేలేదన్నారు. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కీలకమైన పలువురు స్మగ్లర్లను ఇప్పటికే అరెస్టు చేశామని ఆయన వివరించారు. మరికొందరిని అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ కె.గంగిరెడ్డి గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారన్నారు. గంగిరెడ్డిపై చట్టప్రకారమే చర్యలు ఉంటాయని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ఇప్పటికే బేస్‌క్యాంప్‌లు ఏర్పాటుచేశామన్నారు. ప్రతి బేస్‌క్యాంప్ వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల వద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని, అటవీశాఖలో కొంతమంది సిబ్బంది వద్ద సైతం ఆయుధాలు ఉన్నాయన్నారు. అటవీశాఖ అధికారులకు త్వరలో శక్తివంతమైన ఆయుధాలు అందజేస్తామన్నారు. శేషాచలం, నలమల అడవుల్లో నిఘా పెంచామని, కూంబింగ్ నిరంతరం కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. అందులో ఒక డిఐజి, ఇద్దరు ఎస్పీలు, ఓఎస్‌డి ఆపరేషన్, వందలాది మంది పోలీసులు ఉంటారన్నారు. వీరంతాకలిసి ప్రతినిత్యం గాలింపు చర్యలు చేపడుతున్నారన్నారు.
ఎయిమ్స్‌కు 19న శంకుస్థాపన
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, డిసెంబర్ 9: దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌స్ (ఎయిమ్స్) శంకుస్థాపనకు మంగళగిరి వేదిక కానుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో డిసెంబర్ 19వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు జెపి నడ్డా, ఎం వెంకయ్యనాయుడు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు. విభజన హమీల్లో భాగంగా కేంద్రప్రభుత్వం ఎయిమ్స్ ఏర్పాటుకు అంగీకరించమే కాకుండా రూ.600 కోట్లు మంజూరు చేసింది. వివిధ కారణాల వలన ఇప్పటికే నాలుగు సార్లు శంకుస్థాపన వాయిదా పడింది. దేశంలోని న్యూఢిల్లీ, పాట్నా, రాయపూర్, భువనేశ్వర్, రుషికేష్, భోపాల్, జోధ్‌పూర్ ప్రాంతాల్లో ఎయిమ్స్ వైద్య సేవలందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8వ కేంద్రంగా ఏర్పాటు కానుంది. మంగళగిరిలోని టిబి శానిటోరియానికి చెందిన 192 ఎకరాల్లో ఎయిమ్స్‌ను నిర్మించనున్నారు. ఆ స్థలంలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం నుంచి వచ్చిన కమిటీ సుముఖత వ్యక్తం చేసింది. సుమారు 1,618 కోట్ల రూపాయల అంచనాలతో ఎయిమ్స్ రూపుదిద్దుకోనుంది.
రైలుకిందపడి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
మార్కాపురం టౌన్, డిసెంబర్ 9: రైలుకిందపడి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం జరిగింది. రైల్వే సిబ్బంది అందించిన సమాచారం మేరకు నంద్యాల రోడ్డు రైల్వేట్రాక్‌పై రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందిందని, వెళ్ళి చూడగా 35సంవత్సరాల వయస్సుగల మహిళతోపాటు మూడేళ్ల వయస్సుకలిగిన చిన్నారి మృతదేహం కనిపించిందన్నారు. మృతులు ఎవరనేది తెలియాల్సి ఉందని తెలిపారు. మహిళ ముఖం నుజ్జునుజ్జైన కారణంగా గుర్తించలేకపోయామని, తెల్లవారుజామున ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.
కలెక్టరేట్ ఆస్తుల జప్తుకు యత్నం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 9: రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన యజమానులకు నష్టపరిహారం చెల్లించటంలో జిల్లాయంత్రాంగం విఫలమైన కారణంగా కోర్టు ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు ఆమీనా, బాధితులు, వారి తరపు న్యాయవాదులు రావటంతో బుధవారం కలెక్టరేట్‌లో కలకలం రేగింది. 2001లో పార్వతీపురం పట్టణంలో ప్రధాన రహదారిని విస్తరించారు. ఈ సందర్భంగా షాపులను కోల్పోయిన వ్యాపారులు పరిహారం చెల్లింపుపై అధికారులు పట్టించుకోలేదు. దాంతో రోడ్డు విస్తరణలో నష్టపోయిన వ్యాపారులు జిల్లా కోర్టును పరిహారం కోసం ఆశ్రయించారు. వాదోపవాదాలు పరిశీలించిన కోర్టు అవి ప్రైవేటు స్థలాలుగా నిర్ధారించిన కోర్టు బాధితులకు పరిహారం చెల్లించాలని 2006లో తీర్పు జారీ చేసింది. దీనిపై జిల్లా యంత్రాంగం హైకోర్టులో అప్పీలు చేయగా, జిల్లా కోర్టు నిర్ణయించిన పరిహారం చాలా తక్కువగా ఉందంటూ బాధితులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. దాంతో జిల్లా కోర్టు నిర్ణయించిన పరిహారంలో సగం కోర్టులో డిపాజిటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం దశల వారీగా కొంత మొత్తాన్ని బాధితులకు చెల్లించింది. కానీ రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన తమకు ఎటువంటి పరిహారం చెల్లించలేదంటూ ఐ.శ్రీనివాసరావు, సాయికిరణ్, కళావతి, మరో వ్యక్తి కోర్టును ఆశ్రయించటంతో కలెక్టరేట్‌లోని ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వచ్చి ఏడాదిన్నర అవుతున్నది. బుధవారం కలెక్టరేట్‌లోని ఆస్తులను జప్తు చేసేందుకు రావటంతో కలకలం ఏర్పడింది. రికార్డులు అందుబాటులో లేని కారణంగా పరిహారానికి ష్యూరిటీలు ఇచ్చేందుకు సంసిద్ధత తెలియచేయటంతో ఆస్తుల జప్తు తతంగాన్ని విరమించుకుని వెనుదిరిగారు.
ప్రెషర్ బాంబు పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు
భద్రాచలం, డిసెంబర్ 9: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా అరణ్‌పూర్-జేగురుగొండ గ్రామాల మధ్య నూతనంగా నిర్మిస్తున్న రహదారిలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ప్రెషర్ బాంబు పేలి బుధవారం ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. రహదారి నిర్మాణ పనులకు బందోబస్తుకు వెళ్లిన వీరు ప్రెషర్‌బాంబుపై కాలు వేయడంతో అది పేలింది. ఈ ఘటనలో ఏఎస్సై సంతోష్‌ఠాకూర్, కానిస్టేబుల్ లాల్‌సింగ్‌నేతమ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గాదిరాజ్ పోలీసుస్టేషన్‌కు 8కి.మీ దూరంలో కోర్రామ్ అనే గ్రామం వద్ద సీఆర్‌పీఎఫ్ 230 బెటాలియన్ బి కంపెనీకి చెందిన జవాన్లు 25 కిలోల మందుపాతర్లను రెండింటిని గుర్తించారు. వెంటనే బాంబు స్వ్కాడ్‌ను పిలిపించి ఆ రెండు మందుపాతర్లను నిర్వీర్యం చేశారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లా మాన్‌పూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సీతాగావ్- ఔంది రహదారి మార్గంలో హలాంజూర్ గ్రామంలో 5 కిలోల మందుపాతరను పోలీసు బలగాలు గుర్తించి నీర్వర్యం చేశాయి. కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు బ్యానర్లు, కరపత్రాలు వదిలారు.

కరవు బృందం పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 9: కరవుపై క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన కేంద్ర కరవు బృందం వద్ద కడప జిల్లా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమశాఖ జాయింట్ సెక్రటరీ పి.షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో అఖిలేష్ కమల్ నేతృత్వంలోని గణేష్‌రామ్, సోవరణ్‌సింగ్ సభ్యుల బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. ఈ బృందం చిత్తూరు జిల్లా నుంచి నేరుగా కడప జిల్లా సంబేపల్లె మండలంలో కరవు ఛాయాచిత్రాలను తిలకించారు. అనంతరం మోటకట్ల గ్రామం రైతులతో మాట్లాడారు. వరుస కరవులు వెంటాడుతున్నాయని, అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు తప్ప తమకు ఎలాంటి పరిహారం అందడంలేదని కేంద్ర బృందం వద్ద రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాయచోటి మండలం ఎండపల్లె గ్రామంలో మామిడితోటలను బృందం పరిశీలించింది. వర్షాభావ పరిస్థితుల వల్ల మామిడి మొక్కలు, చెట్లు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. రామాపురం మండలంలో ఉపాధి కూలీలతో మాట్లాడారు. బృందం వెంట కలెక్టర్ కెవి.రమణ తదితరులు ఉన్నారు.
ఎండిన పంట భూముల పరిశీలన
విజయవాడ: కృష్ణా జిల్లాలో కరవు నష్టాన్ని పరిశీలించడానికి వచ్చిన కేంద్ర బృందం బుధవారం నూజివీడు, గుడివాడ డివిజన్లలో విస్తృతంగా పర్యటించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ బిసి బెహ్రా, ఉప కార్యదర్శి ఎస్‌ఎల్ మీనా, ఎఫ్‌సిఐ డిజిఎం గోవర్థనరావులతోకూడిన బృందం బాపులపాడు మండలం సిరివాడ, గుడివాడ డివిజన్‌లో నందివాడ గ్రామాన్ని సందర్శించి సాగునీరు లేక, సాగుకు దూరమైన పంట భూములను, ఎండిన పంట భూములను పరిశీలించి రైతులతో మాట్లాడటం జరిగింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కృష్ణా జిల్లాలో 40 వేల హెక్టార్లలో రైతులు పంటలను వేయలేకపోయారని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు బాలు నాయక్ కేంద్ర బృందానికి వివరించారు. 14 కరవు మండలాల్లో పంటలు ఎండిపోయి రూ.5 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు. 30 వేల 898 ఆవు సంతతి పశువులు, 2,22,209 గేదెలు, 2,53,182 మేకలు, గొర్రెలు, 3లక్షల రెండు వేల లైవ్ స్టాక్ యూనిట్లు కరవు బారిన పడ్డాయని, పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు దామోదరం నాయుడు వివరించారు.

ఖమ్మం ఎమ్మెల్సీ
బరిలో ముగ్గురు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 9: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏ జిల్లాలో లేని విధంగా ఖమ్మం జిల్లాలో పోటీ తీవ్రంగా ఉండటం గమనార్హం. అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ, వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా సిపిఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, వైకాపా అభ్యర్థిగా లింగాల కమల్‌రాజ్ పోటీలో ఉన్నారు. పువ్వాడ నాగేశ్వరరావుకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతిస్తున్నాయి. జిల్లాలో 724మంది ఓటర్లు ఉండగా ఎవరికి వారు గెలుపు తమదే అన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిఆర్‌ఎస్ హైదరాబాద్‌లోని మేడ్చల్‌రోడ్డులో ఉన్న ఓ రిసార్ట్స్‌లో క్యాంప్ ఏర్పాటు చేయగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా నూజివీడు వద్ద క్యాంపు ఏర్పాటు చేసింది. ఇక వామపక్ష పార్టీలు కూడా క్యాంపులకు తమ ఓటర్లను తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. జిల్లాలో ప్రధాన పార్టీగా ఉండి సుమారు 40 ఓట్లు కలిగిన సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి ఎవరికి మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. ఎవరికి వారు మండల స్థాయిలోనే ఎంపిటిసి, జడ్పీటిసి, వార్డు మెంబర్లతో లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. కాగా ఓటర్లను మభ్యపెట్టేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శలు ఉన్నా వారు మాత్రం ప్రత్యర్థి పార్టీలే ప్రలోభాలకు గురి చేస్తున్నాయని ఎవరికి వారే ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పోటీ చేస్తుండటం, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మద్దతిస్తుండటం గమనార్హం. ఒకరి క్యాంపులో ఉన్న వారితో ప్రత్యర్థి పార్టీ నేతలు మాట్లాడుతూనే లోపాయికారిగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి పాలేటిపై అట్రాసిటీ కేసు
వేటపాలెం, డిసెంబర్ 9 : విధి నిర్వహణలో వున్న గ్రామకార్యదర్శిపై దాడి చేసిన కేసులో మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావు మరో 9మందిపై బుధవారం పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చీరాల రూరల్ సి ఐ తాతారావు తెలిపిన వివరాల మేరకు రామన్నపేట పంచాయతీ రావూరిపేటలో సామాజిక భవనంలో అనుమతి లేకుండా సిమెంటుబస్తాలు నిల్వ ఉంచారనే ఫిర్యాదు రావడంతో ఎంపిడివో ఆదేశాల మేరకు గ్రామకార్యదర్శి సురేంద్ర భవనం వద్దకు వెళ్లి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మాజీమంత్రి పాలేటి రామారావు, సర్పంచ్ బట్టా అనంతలక్ష్మి ఆమె భర్త లీలానంద ప్రసాద్ అక్కడకు వెళ్లి కార్యదర్శిని అడ్డుకున్నారు. పంచాయతీ సిబ్బంది, పాలేటి అనుచరుల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. ఆగ్రహంతో వున్న పాలేటి, ఆయన అనుచరులు గ్రామకార్యదర్శిపై దాడి చేసి గాయపరిచారు. ఈమేరకు గ్రామకార్యదర్శి చీరాల ఏరియా వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు.అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పాలేటి, సర్పంచ్ అనంతలక్ష్మి, లీలానంద ప్రసాద్, చీరాల ఎంపిపి గవిని శ్రీనివాసరావు, మరో ఆరుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సి ఐ వెల్లడించారు.
రాయలసీమ అభివృద్ధికి కృషి :లోకేష్
గంగాధరనెల్లూరు, డిసెంబర్ 9 : రాయలసీమ అభివృద్ధికి టిడిపి కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్ పురంలో జరిగిన జనచైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీరాంగరాజపురం, సికెఆర్ పురంలో పర్యటించి ప్రజలతో కలసి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి భారీఎత్తున వినతిపత్రాలు స్వీకరించి త్వరలో వీటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మరాజుల గుడి వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ రాయలసీమ అభివృద్ధికి పట్టిసీమ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టి కృష్ణ, గోదావరి నదులను అనుసంధానం చేస్తుంటే వైకాపా నేతలు విమర్శించడం తగదన్నారు. రానున్న రెండేళ్లలో తిరుపతిలో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసి 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

ఏసిబి వలలో
ఇరిగేషన్ ఉద్యోగి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, డిసెంబర్ 9: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై ఇరిగేషన్ శాఖ పే అండ్ అకౌంట్స్ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న యలమంచిలి భారతీలక్ష్మి ఇంటిపై ఎసిబి అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ కె.రంగరాజు తెలిపిన సమాచారం మేరకు గత కొన్నాళ్లుగా భారతీలక్ష్మి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులు అందడంతో పట్టణంలోని బాకర్ సాహెబ్ పేటలోని ఆమె ఇంటితో పాటు హైదరాబాద్, విశాఖపట్నంలోని ఆమె బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిపారు.