రాష్ట్రీయం

వాతావరణంలో అనిశ్చిత పరిస్థితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 12: కొనే్నళ్ల క్రితం పగలు ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలు సాయంత్రం వేళల్లో వర్షపు జల్లులతో సేద దీరేవారు. వర్షం కురియకపోయినా ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడేది. అయితే నేడు ఆ పరిస్థితి లేదు. రోజుల తరబడి ఎండలు మండుతున్నా, వర్షం కురిసిన సందర్భాలు లేవనే చెప్పాలి. వాతావరణంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా వేసవిలో సాయంకాలం జల్లులు కురవడం లేదు. వాతావరణంలో కర్బనపు అణువులు, ధూళి ఎక్కువ కావడం వల్ల వర్షం కురిసేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. క్యుములోనింబస్ మేఘాలు పూర్తిస్థాయిలో ఏర్పడిన సందర్భాల్లో మాత్రమే వర్షం కురుస్తోందని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వాతావరణ శాస్త్ర విభాగం నిపుణుడు ఆచార్య భానుకుమార్ తెలిపారు. విశాఖ తదితర ప్రాంతాల్లో వివిధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి, కర్బనపు అణువులు గాలిలో ఉండిపోతున్నాయన్నారు. ఆకాశంలో మేఘాలుగా ఏర్పడి, సముద్రంపైనుంచి వచ్చే తేమ చేరుకునేందుకు వీలులేకుండా అడ్డుకుంటున్నాయని తెలిపారు. దీనివల్ల వాతావరణంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పటికీ అవి వర్షం కురిపించలేని స్థితిలో ఉంటున్నాయన్నారు. క్యుములోనింబస్ మేఘాలు నాలుగు స్థాయిలను దాటి పరిపక్వత పొందినప్పుడే వర్షిస్తాయన్నారు. అవి వర్షించడానికి వీలుగా మారనప్పుడు కేవలం నల్లని మేఘాలకే పరిమితం అవడం, ఈదురుగాలులు లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుందన్నారు. సగటు వార్షిక వర్షపాతంలో 8-10 శాతం వర్షపాతం ఈ వేసవి జల్లుల కారణంగా నమోదు అవుతుందని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా గతంలోలాగా వారంలో నాలుగైదు రోజులు జల్లులు పడే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు.
ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షం
వాతావరణంలో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల కారణంగా గురువారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది. విశాఖ, ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాలు, తుని, విజయనగరంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదే పరిస్థితి శుక్రవారం కూడా ఉంటుందని, ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. విధర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావం కోస్తాపై ఉండదని తెలిపారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా తెలంగాణ, రాయలసీమల్లో కూడా దీని ప్రభావం ఉండదని వివరించారు