ఆంధ్రప్రదేశ్‌

మూగ జీవాలకు శాపంగా మారిన ఇంకుడు గుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజెండ్ల, మే 13: ఇంకుడు గుంతలు మూగజీవాలకు శాపంగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంకుడు గుంతలు మూగ జీవాల ప్రాణాలు తీస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో నూజెండ్ల మండలం ములకలూరు, పాత ఉప్పలపాడు, నూజెండ్ల, ముప్పరాజువారిపాలెం తదితర గ్రామాల్లో నాలుగు గేదెలు, ఒక ఆవు మృత్యువాత పడ్డాయి. వెనకటికి కొండనాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుగు ఊడిందన్న చందంగా ఇంకుడు గుంతల పుణ్యమా అంటూ పశువులు మృత్యవాత పడటంతో వాటి యజమానులు గగ్గోలు పెడుతున్నారు. శుక్రవారం మండలంలోని పాత నాగిరెడ్డిపల్లికి చెందిన గోగు చెంచయ్య గేదె ఆదే గ్రామానికి చెందిన పున్నటి అప్పయ్య తీసిన ఇంకుడు గుంతలో పడి మృతి చెందింది. సుమారు 70వేల రూపాయలు గేదె మృతి చెందటంతో చెంచయ్య తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అసలే కరవుతో అల్లాడుతున్నాము? పశువుల మీద ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాము? ఇంకుడు గుంత రూపంలో గేదె మృతిచెంది జీవనోపాది పోయిందని బాధితుడు వాపోయాడు.

అగ్రిగోల్డ్ చైర్మన్‌కు బెయిల్
ఏలూరు, మే 13 : డిపాజిటర్లను మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటూ జ్యుడీషియల్ రిమాండ్‌లోవున్న అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకటరామారావు, సిఎండి అవ్వా వెంకట శేషు నారాయణరావుకు షరతులతో కూడిన బెయిల్ శుక్రవారం మంజూరైంది. ఈ కేసులో సంస్థ ఛైర్మన్ రామారావు, సి ఎండి నారాయణరావులను గత ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్‌లో అరెస్టుచేసి 12వ తేదీన ఏలూరు జిల్లా కోర్టులో సిఐడి అధికార్లు హాజరుపర్చారు. అప్పట్లో వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అప్పటి నుంచి వారు స్థానిక జిల్లా జైలులో ఉన్నారు. ఈ లోగా వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులకు సంబంధించి ఆ ప్రాంత పోలీసులు వీరిద్దరినీ అక్కడి కోర్టులకు హాజరుపర్చారు. పెదపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసునకు సంబంధించి వీరిద్దరినీ ఏలూరు కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు కేసునకు సంబంధించి ఛార్జిషీట్‌ను కాలపరిమితి ముగిసినా ఇంత వరకు దాఖలు చేయనందున తాజాగా వీరు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా దీన్ని పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి ఎం తుకారాంజీ శుక్రవారం వారిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. వీరిద్దరూ అయిదు లక్షల రూపాయల మేరకు పూచీకత్తును సమర్పించాల్సి వుంటుంది. అలాగే ఇద్దరు చొప్పున జామీనుదారులను చూపాల్సి వుంటుంది. అదే విధంగా ప్రతీ గురు, ఆదివారాల్లో వీరు రాజమండ్రి సిఐడి కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది.
చిత్తూరు సబ్‌జైలులో ఖైదీ మృతి
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, మే 13 : అనారోగ్యంతో ఒక ఖైదీ మృతి చెందగా, మరో ఖైదీ సబ్ జైలులోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన శుక్రవారం చిత్తూరు నగరంలో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన పార్థిబన్ (47) తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లో పలు హత్య కేసుల్లో నిందితుడు. చిత్తూరు జిల్లా గుడిపాల మండల కేంద్రంలో జరిగిన ఓ హత్య కేసులో పార్థిబన్ పోలీసులు ఈ ఏడాది మార్చి ఒకటవ తేదిన అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. తరచూ మూర్చవ్యాధితో బాధపడే పార్థిబన్ శుక్రవారం ఉదయం సబ్ జైలులోని తన గదిలో టీ సేవిస్తూ స్పృహతప్పి పడిపోయాడు. అప్రమత్తమైన జైలు సిబ్బంది హుటాహుటిన పార్థిబన్‌ను చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యమంలో మృతి చెందాడు. ఇదిలావుండగా చిత్తూరు జిల్లా కార్వేటినగరానికి చెందిన కుట్టు అలియాస్ మునస్వామి (46) పలు దొంగతనాల కేసులో గంగాధరనెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసి ఈ ఏడాది జనవరి 30న రిమాండ్ నిమిత్తం చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు. అప్పటి నుంచి సబ్‌జైలులోనే ఉన్న కుట్టు శుక్రవారం ఉదయం గోడ ద్వారబంధానికిఉన్న కర్రతో చేతిని కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే జైలు సిబ్బంది ఆయనను వైద్యశాలకు తరలించి చికిత్సలు అందించారు. ప్రస్తుతం కుట్టు ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్స పొందుతున్నాడు. అయితే కుట్టు తనను పోలీసులు బాగా కొట్టడంతో ఆరోగ్యం బాగా దెబ్బతిందని, దీన్ని భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. అయితే జైలు అసిస్టెంట్ రాహుల్ ఈ సంఘటనపై వివరణ ఇస్తూ పలు మార్లు కుట్టు బెయిల్ కోసం ప్రయత్నించాడని, బెయిల్ రాని కారణంగా మానసికంగా వేదనకు గురై ఆత్మహత్యాయత్నంకు ఒడిగట్టినట్లు తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగికి తొలి బీమా లబ్ధి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 13: ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారిగా ఉద్యోగ, కార్మికుల కోసం ఎపిఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు కృషితో గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రమాద బీమా సౌకర్యం అమల్లోకి వచ్చింది. ఈ మేర నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం జరిగింది. అన్ని రకాల ప్రమాదాలకు ఈ బీమా వర్తిస్తుంది . ఈ ఒప్పందం ఖరారైన రోజే కడప జిల్లా రాజంపేట డిపో కండక్టర్ కె.ప్రభాకర్ ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. ఈ మేర బీమా పరిహారాన్ని సంబంధించిన రూ.10 లక్షల చెక్కును ప్రభాకర్ సతీమణి కె.సలోమికి స్థానిక ఆర్టీసీ భవన్‌లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు అందజేశారు. ఈ సందర్భంగా సలోమి కుటుంబ సభ్యులు ఎండి నండూరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయంతో తన కుటుంబం నిలదొక్కుకోగలదన్నారు.
రూ. 30కే సన్నబియ్యం పంపిణీ
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, మే 13 : రాష్ట్రంలో నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. జిల్లా కేంద్రమైన అనంతపురంలోని తన నివాసంలో శుక్రవారం మంత్రి సునీత విలేఖరులతో మాట్లాడారు. కంది పప్పు, సన్నబియ్యం పేదలకు అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశామన్నారు. అయితే బహిరంగ మార్కెట్లో కంది పప్పు ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పేదలకు రూ. 120కే అందజేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. మిల్లర్లతో మాట్లాడామని, సరఫరా చేసేందుకు వారు సుముఖంగా ఉన్నారని, ఇప్పటికే 3 వేల మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉంచామన్నారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి కందిపప్పు సేకరించామన్నారు. అలాగే రేషన్‌కార్డుదారులకు రూ. 30కే సన్నబియ్యం అందించనున్నామన్నారు. టమోటా ధర పెరిగిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మినపపప్పు ధరపైనా కేంద్రానికి లేఖ రాశామని, ఇప్పటికే ఒక మెట్రిక్ టన్ను సరఫరాకు ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 27,28,29 తేదీల్లో తిరుపతిలో నిర్వహించనున్న మినీ మహానాడు నేపథ్యంలో నియోజక వర్గాల వారీగా మినీ మహానాడులు ఏర్పాటు చేస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులను జులై నాటికి పూర్తి చేసి ఆగస్టులో నీటిని సరఫరా చేసి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.