రాష్ట్రీయం

అంతరిస్తున్న గ్రానైట్ నిక్షేపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 18: ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో గ్రానైట్ నిక్షేపాల దోపిడీ ఏళ్ల తరబడి యథేచ్ఛగా సాగుతోంది. అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం(శాటిలైట్) సహాయంతో గ్రానైట్ నిక్షేపాలను గుర్తించిన బడా కంపెనీలు, పలుకుబడి కలిగిన కాంట్రాక్టర్లు ఇక్కడి భూములపై కనే్నసి పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతూ ఎంతో విలువైన గ్రానైట్ నిల్వలను చైనా, జపాన్, మలేషియా వంటి దేశాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ తవ్వకాల ద్వారా సంబంధిత గ్రామ పంచాయతీలకు సీనరేజీ రూపంలో సమకూరాల్సిన ఆదాయాన్ని మాత్రం నయా పైసా జమ చేయడం లేదు. వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పటికీ, గ్రానైట్ తవ్వకాల పట్ల మండల స్థాయి మొదలుకుని జిల్లా స్థాయి వరకు కూడా అధికార యంత్రాంగం పర్యవేక్షణ జరుపుతున్న దాఖలాలు నామమాత్రంగానైనా కనిపించవు. లీజుల పేరుతో క్వారీలు దక్కించుకున్న బడాబాబులు సదరు స్థలాల్లో చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ వ్యక్తులను కాపలా నియమిస్తూ నిషేధిత ప్రాంతాలను తలపిస్తున్నారు. స్థానిక అధికారులు మొదలుకుని, ఎవరైనా ఈ క్వారీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అనుమతి లేదంటూ కాపలాదారులు అడ్డుకోవడం షరా మామూలుగా మారింది. దీంతో అసలు క్వారీల లోపల ఏం జరుగుతోందనే సమాచారం బయటి ప్రపంచానికి తెలియరాలేకపోతోంది. జిల్లాలోని కమ్మర్‌పల్లి, భీమ్‌గల్, సిరికొండ తదితర మండలాల్లో పెద్ద మొత్తంలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. కోనసముందర్ పరిసరాల్లో గుట్టలలో నాణ్యమైన ఇనుము, అబ్రకం ఖనిజాలు ఉన్నట్టు దాదాపు వందేళ్ల క్రితమే ఆంగ్లేయులు గుర్తించి ఇక్కడ అనేక రకాల పరిశోధనలు చేశారు. ఇప్పటికీ ఇంగ్లాండ్, అమెరికా తదితర దేశాల నుండి పరిశోధకులు కోనసముందర్‌కు వచ్చి అక్కడి ఖనిజ నిక్షేపాలపై పరిశోధనలు చేస్తుంటారు. దీంతో గత దశాబ్ద కాలం క్రితం బడా కంపెనీల కన్ను ఈ ప్రాంతాలపై పడింది. అప్పటి నుండి అసైన్‌మెంట్ భూములను తమ పలుకుబడితో రాష్ట్ర స్థాయిలోనే లీజు పద్ధతిపై తీసుకుని, ఒకవేళ ప్రైవేట్ భూములుంటే రైతులకు డబ్బుల ఆశ చూపెట్టి పట్టాలను కొనుగోలు చేసుకుని మరీ ఈ దందాలో పాతుకుపోయారు. ఇక్కడి గ్రానైట్ నిక్షేపాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉండడంతో పెద్దఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. ప్రస్తుతం కోనసముందర్ ప్రాంతంలో గల ఎతె్తైన కొండల నుండి గ్రానైట్ నిల్వల తరలింపు కార్యక్రమం యథేచ్ఛగా కొనసాగుతోంది. గుట్టలను తవ్వుతూ, రాళ్లను పెకిలిస్తూ వాటిని తమకు అనుకూలమైన సైజుల్లో మారుస్తూ నిరాటంకంగా భారీ ట్రక్కులలో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా, స్థానిక అధికారులకు కనీసం పర్యవేక్షించే అధికారం కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి ఒక ప్రాంతాన్ని లీజుకు తీసుకుంటే, దానిని తనిఖీ చేసే అధికారం స్థానిక సంస్థలు, ఆ ప్రాంత అధికారులకు ఉంటుంది. కానీ ఈ తవ్వకాల గురించి తమకెలాంటి సమాచారం లేదని స్థానిక అధికారులు పేర్కొనడం వారి నిస్సహాయతను చాటుతోంది. రాళ్లను పెకిలించడానికి డైనమెట్లు పేలుస్తుండడంతో ఉదయం వేళలో పరిసర ప్రాంతాలన్నీ పేలుడు శబ్దాలతో దద్దరిల్లుతున్నాయి. పేలుళ్ల వల్ల పంట భూముల్లో వేసిన బోర్లు కూడా వట్టిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అనునిత్యం భారీ వాహనాల్లో గ్రానైట్ రాళ్లకు లైసెన్సు నెంబర్లు వేసి తరలిస్తున్న వ్యాపారులు వేబిల్లులను ఎక్కడ తీసుకుంటున్నారన్నది కూడా తెలియరావడం లేదు. ఎప్పటికప్పుడు రాళ్ల తరలింపును పరిశీలించి నిబంధనలు అమలయ్యేలా చూడాల్సిన భూగర్భ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. గడిచిన దశాబ్ద కాలం నుండి ఒక్క కోనసముందర్ క్వారీ ద్వారానే సంబంధిత గ్రామ పంచాయతీకి రెండున్నర కోట్ల రూపాయల వరకు సీనరేజీ నిధులు జమ కావాల్సి ఉందని తెలుస్తోంది. కొండలు, గుట్టలు అంతరిస్తుండడంతో పర్యావరణ సమతుల్యానికి ముప్పు వాటిల్లుతుండడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది.