రాష్ట్రీయం

వికాస పర్వంపై కమలం కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ మే 23: కాంగ్రెస్ రహిత భారతదేశ కలను సాకారం చేసుకునే లక్ష్యంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రారంభించింది. రెండేళ్ల మోదీ పాలనలో వివిధ రాష్ట్రాలకు చేసిన సాయంతోపాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు ఏర్పాటుచేసిన ‘వికాస్ పర్వ్’ కార్యక్రమం విజయవంతం కోసం కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో బహిరంగసభల నిర్వహణ కోసం, రెండు రాష్ట్రాల నాయకత్వాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కోవా లక్ష్మణ్ నాయకత్వంలో మంగళవారం వర్క్‌షాప్ జరుగుతుండగా, ఏపిలో ఈనెల 25న జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో రూట్‌మ్యాప్ ఖరారు చేయనున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈనెల 26 నుంచి జూన్ 15 వరకూ దేశవ్యాప్తంగా వికాస్‌పర్వ్‌ను నిర్వహించాలని బిజెపి జాతీయ నాయకత్వం నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే సభలకు 14 మంది కేంద్రమంత్రులు హాజరవనున్నారు. తెలంగాణలో జరిగే సభలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఏపిలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. హైదరాబాద్‌లో జరిగే సభలను అమిత్‌షా ప్రారంభిస్తారని కేంద్రమంత్రి దత్తాత్రేయ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఏపిలో స్మతి ఇరానీ ఈ కార్యక్రమాన్ని 27న ప్రారంభిస్తారని అనుకున్నప్పటికీ, వచ్చేనెల 4న వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. ఆమెతోపాటు, కేంద్రమంత్రుల పర్యటనలను 25న జరిగే భేటీలో ఖరారు చేస్తామని ఏపి పార్టీ నేతలు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 26న ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించనున్నారు.
కాగా, వికాస్‌పర్వ్ కార్యక్రమానికి 7 బృందాల చొప్పున నాయకులు విడిపోయి, సభల్లో పాల్గొననున్నారు. బిజెపి ప్రభుత్వం ఆంధ్ర-తెలంగాణ ప్రభుత్వాలకు ఇప్పటివరకూ అందించిన సహాయంతోపాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, వాటివల్ల లబ్ధి పొందుతున్న వారి వివరాలను ప్రతి సభలోనూ వెల్లడించనున్నారు. ఆ మేరకు రాష్ట్రాల వారీగా కరపత్రాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
ప్రతి జిల్లాలోనూ బహిరంగసభలు నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ, స్థానికంగా పార్టీకి ఉన్న బలాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని పెద్ద హాళ్లలో కూడా ఏర్పాటుచేసే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఈ విధంగా ఒక్కో రాష్ట్రంలో 14 మంది కేంద్రమంత్రులు 20 రోజుల పాటు విస్తృతంగా పర్యటిస్తే..అది కార్యకర్తలకు నైతిక స్థైర్యం ఇవ్వడంతోపాటు, ప్రజల్లోనూ సానుకూల సంకేతాలు వెళతాయన్న భావన బిజెపి నాయకత్వంలో కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో విస్తరణ కోసం సన్నాహాలు చేస్తున్న బిజెపి నాయకత్వం వికాస్‌పర్వ్‌ను వేదికగా చేసుకునే పనిలో ఉంది. మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, పురంధ్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సురేష్‌రెడ్డి వంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తోన్న జిల్లాల్లో భారీ స్థాయిలో బహిరంగసభలకు ఏర్పాట్లు చేస్తోంది. దాని ద్వారా ఆయా జిల్లాల్లో పార్టీ బలంగా ఉందన్న సంకేతాలివ్వనుంది. ఇదే విధానాన్ని ఇటు తెలంగాణలోనూ అనుసరించనుంది. పార్టీ నేతలు ఎక్కడైతే బలంగా ఉంటారో అక్కడ భారీ స్థాయిలో సభలు నిర్వహించడం ద్వారా పార్టీ బలం చాటాలన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో అక్కడ పార్టీ బలానికి తగిన స్థాయిలో సభలు నిర్వహించాలని నిర్ణయించింది.