ఆంధ్రప్రదేశ్‌

అవినీతి నిజమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: ‘మనం ఎన్ని మంచి పనులు చేసినా, అవి పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రజల్లో రాజకీయ నాయకులపైన, అధికార యంత్రాంగంపైన నమ్మకం లేకపోవడమే ప్రధాన కారణం. కొన్ని శాఖలపై అవినీతి మచ్చ ఉంది. అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు స్వార్థంతో పనిచేస్తున్నారని, తమ గురించి ఆలోచించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సమాజాన్ని మనం చక్కదిద్దాలన్నా, అవినీతి ఆరోపణలు మనల్ని ఎక్కడికికక్కడ కుంగదీస్తున్నాయి. కొన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిన మాట వాస్తవం. దీనివలన ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉంది. రాజకీయ, అధికార యంత్రాంగంపై అవినీతి ఆరోపణలు వారసత్వంగా వస్తున్నాయి. కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అవినీతిని దూరం చేయచ్చు.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రెండు రోజులపాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు విజయవాడలో బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ‘నా సంతకం కోసం ఫైళ్లు పట్టుకుని కొంతమంది వెంటపడుతుంటారు. వారి ఫైళ్లు నా టేబుల్ మీద ఉంటాయి. సాధారణ వ్యక్తుల ఫైళ్ళు ఎక్కడో అట్టడుగున ఉంటున్నాయి. ఈ విధానానికి స్వస్తి పలకాలి’ అని చంద్రబాబు చెప్పారు.
ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి!
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే విషయంలో అధికారులు సరళంగా వ్యవహరించాలని సిఎం కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రేషన్, పించన్ వంటివి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. దేశంలో హ్యాపీ ఇండెక్స్ పెట్టుకున్న రాష్ట్రం మనదేనని చంద్రబాబు చెప్పారు. కలెక్టర్లు, ప్రజా ప్రతినిధుల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ రూపొందిస్తున్నామని ఆయన తెలియచేశారు.
2050 లక్ష్యంగా పనిచేస్తున్నాం
రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2050 లక్ష్యంగా పనిచేస్తోందని, 2029 నాటికి దేశంలోనే రాష్ట్రం నెంబర్‌వన్ స్థానంలో ఉంటుందని చంద్రబాబు చెప్పారు. 13 జిల్లాల్లో 13 టీంలుగా పనిచేయాలి. మనకన్నా బాగా పనిచేస్తున్న రాష్ట్రాల్లో పనితీరును కలెక్టర్లు ఎప్పటికప్పుడు గమనిస్తూ, నూతన విధానాలతో ముందుకు సాగాలని చంద్రబాబు హితవు చెప్పారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని పెర్ఫార్మేన్స్ ఇండికేటర్లను తయారు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మనదేనని చంద్రబాబు చెప్పారు.
కేంద్ర సహకారం అంతంతమాత్రమే!
కేంద్రం సహకారం కొంత మాత్రమే అందుతోందని, ఇంకా అందాల్సిన సహాయం చాలా ఉందని అన్నారు. మన రాష్ట్రంలో అర్బన్ పాపులేషన్ కేవలం 29 శాతం మాత్రమే ఉందని, మిగిలిన రాష్ట్రాల్లో ఇది సుమారు 48 శాతం వరకూ ఉందని ఆయన చెప్పారు. దీనివలన ఆదాయం తక్కువగా వస్తోందని ఆయన తెలియచేశారు. వ్యవసాయ రంగం ఆదాయం చాలా తక్కువగా ఉందని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్‌లో దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 10.99 శాతం గ్రోత్ రేట్ సాధించామని ఆయన తెలిపారు.
నిధుల కొరత లేదు!
ప్రభుత్వ ఖజానా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏ శాఖకు కేటాయించిన నిధులు ఆశాఖకు పూర్తిగా అందేట్టు చూస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ‘నరేగా’ పనులకు కేంద్రం నుంచి 1000 కోట్ల రూపాయలు రావల్సి ఉంది. ఆ నిధులు ఆలస్యంగా వస్తాయని తెలిసి, రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని భరించిందని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ పనులు ఈ ఏడాది పూర్తి కావాలని చంద్రబాబు ఆదేశించారు. పోలవరం, వంశధార, గాలేరు నగరి, తోటపల్లి, రామతీర్థం, హంద్రీనీవా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకూ 450 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల ఆధునీకరణ పనులు చేపట్టి, అందులో 350 పూర్తి చేశామని అన్నారు. దీనివలన 5, 6 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరు అందుతుందని అన్నారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నామని, పేదలందరికీ వైద్యం అందేలా చూస్తున్నామని అన్నారు. డాక్టర్లకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో ఎక్విప్‌మెంట్‌ను కూడా ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నామని అన్నారు. విద్య విషయంలో ప్రభుత్వం రాజీపడదని అన్నారు. అన్ని పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో కడప, శ్రీకాకుళం జిల్లాల్లో కరవు తాండవించడానికి, ఆ ప్రాంతాలు వెనుకబడిపోవడానికి నాయకులే కారణమని చంద్రబాబు అన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవన పంటలు పండించేందుకు పుష్కలంగా వనరులు ఉన్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని అన్నారు. కావాలని అక్కడ కొంతమంది నాయకులు చేస్తున్న దుష్ప్రచారాల వలన ప్రజలు తప్పుతోవపడుతున్నారని అన్నారు.

చిత్రం... జిల్లా కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు