ఆంధ్రప్రదేశ్‌

కలకాలం ఇలా సాగనీ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో 40 ఏళ్లు అధికారంలో ఉండాలి ఓటమి మాట వినబడకూడదు పథకాలపై పార్టీ ముద్ర
బాబు దిశానిర్దేశం బిజెపిని తూర్పారబట్టిన నేతలు నోరు మెదపని పార్టీ అధినేత
ఓసీలనూ ఆకట్టుకునే ఎత్తుగడ తొలి రోజు మహానాడు సాగిందిలా...

తిరుపతి, మే 27:‘ఇప్పుడే కాదు, మరో నలభై ఏళ్ల వరకూ మనమే అధికారంలో ఉండాలి. ఇకపై జరిగే ఏ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోకూడదు. రాష్ట్రంలోని అగ్ర కులాల్లోని పేదలకూ రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా పార్టీ విస్తరించాలి. ప్రభుత్వ పథకాలపై పార్టీ ముద్ర ఉండితీరాలి. ప్రత్యేక హోదా రాకపోవడానికి పార్టీ బాధ్యత ఏమీ లేదు. పార్టీ, సీఎం కష్టపడిపోరాడుతున్నా కేంద్రం స్పందించడం లేదు. కాంగ్రెస్ అడ్డగోలు విభజన సిద్ధాంతం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడింది’ తిరుపతిలో జరిగిన తెలుగుదేశం మహానాడు తొలిరోజు కనిపించిన పార్టీ నాయకత్వ వైఖరి, వ్యూహమిది!
తిరుపతిలో శుక్రవారం నుంచి మొదలైన తెదేపా మహానాడులో ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహం, కీలక అంశాలపై అడుగులు ఏమిటన్నది స్పష్టమయింది. అధినేత బాబు ప్రసంగం, ప్రత్యేక హోదాపై నేతలు చేసిన ప్రసంగాలు పరిశీలిస్తే, ఇకపై తెదేపా తాను నిర్దోషినన్న నినాదంతో ప్రత్యేక వ్యూహంతో వెళుతున్నట్లు స్పష్టమవుతుంది. ప్రధానంగా.. ఇప్పటివరకూ ప్రభుత్వంపై దృష్టి సారించిన బాబు, ఇకపై పార్టీపైనా దృష్టి సారిస్తానని, అందులో భాగంగా పార్టీ శ్రేణులను కూడా భాగస్వాములు కావాలని చెప్పకనే చెప్పారు. అంటే ఒక గ్రామంలో వేసే సిమెంటు రోడ్డు పనులను కూడా, పార్టీనే చేయించిందని స్థానికులకు ప్రచారం చేయటం ద్వారా, ప్రజలకు పార్టీని చేరువ చేయనుంది. ఇక రాష్ట్రంలోని అగ్రకుల నిరుపేదలకు సైతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా, వారినీ పార్టీ వైపు మళ్లించుకునే ఎత్తుగడకు మహానాడు శ్రీకారం చుట్టింది. కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటుచేసినట్లే పేద ఓసీలకూ రిజర్వేషన్లు ఇచ్చేందుకు యోచిస్తున్నామన్న బాబు ప్రకటన, నిరుపేద అగ్రకులాలకు భరోసా కలిగించింది. నిజానికి ఇది బాబు ధైర్యంతో చేసిన ప్రకటనగానే భావిస్తున్నారు. ఇప్పటివరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దృష్టి సారించిన బాబు, కొత్తగా ఓసీలోని నిరుపేదల గురించి తొలిసారిగా ప్రస్తావించడంతోపాటు, వారికి రిజర్వేషన్లు కూడాకల్పిస్తామనడం సాహసోపేత ప్రకటనగానే చెప్పవచ్చు. దీనివల్ల టిడిపికి ఇప్పటివరకూ దూరంగా, తటస్థంగా ఉన్న ఓసీ వర్గాలన్నీ పార్టీకి చేరవవుతారన్న అంచనా కనిపిస్తోంది. ఇది మహానాడులో తీసుకున్న సంచలన నిర్ణయం.
ఇక ప్రధానంగా తెలుగుదేశం పార్టీనే మరో 40 ఏళ్ల వరకూ అధికారంలో ఉండాలన్న లక్ష్యం, ఆరాటం మహానాడులో కనిపించింది. బాబు ప్రసంగ ధోరణి దానినే స్పష్టం చేసింది. మరో 40 ఏళ్లు మన పార్టీయే అధికారంలో ఉండాలని, ఇకపై జరిగే ఏ ఎన్నికలయినా సరే విజేతలుగా మనమే ఉండాలని, ఎక్కడా ఓడిపోకూడదని బాబు బలంగా చెప్పారు. కష్టపడితే మీరే 40 ఏళ్లు పదవుల్లో ఉంటారని తాయిలం చూపించారు. ‘మనం అధికారంలో ఉండాల్సిన అవసరం మనకోసం కాదు. ప్రజలు, రాష్ట్రం కోసమని’ బాబు వ్యాఖ్యానించారు.
హోదాపై హోరు
ప్రత్యేక హోదాపై చేసిన తీర్మానంలో, మిత్రపక్షమైన బిజెపిపై విసిరిన విమర్శలన్నీ వ్యూహాత్మకంగానే కనిపించాయి. ఈవిషయంలో బాబు తటస్థంగా మాట్లాడగా బుచ్చయ్యచౌదరి, అరికెల నర్సారెడ్డి, ఎంపి అవంతి శ్రీనివాస్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వంటి నేతల ప్రసంగాలు ఘాటుగా కనిపించాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి చేసిన వ్యాఖ్యలు బిజెపిపై తెదేపా మనసులోఉన్న భావనను బయటపెట్టాయి. ‘బిజెపి మన పార్టీతో పొత్తుపెట్టుకుంటే ఆ పార్టీకి 10 సీట్లు వస్తాయి. కానీ మనకు లాభం ఉండదు. టిడిపిని దూరం చేసుకుంటే బిజెపికే నష్టం. బాబు యాంటీకాంగ్రెస్ విధానం వల్లే ఇన్ని సీట్లు వచ్చాయని గ్రహించాల’ని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎంపి అవంతి శ్రీనివాస్ కూడా మామూలుగా ఇవ్వాల్సింది కాకుండా ఏపికి ప్రత్యేకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై తీర్మానం ప్రవేశపెట్టిన కాలువ శ్రీనివాసులు సైతం హోదా విషయంలో కేంద్రం చేస్తున్న తాత్సారాన్ని ఎండగట్టారు. ఈ విషయంలో సిఎం, పార్టీల ప్రయత్న లోపమేమీలేదని చెప్పేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. హోదా అంశంపై మహానాడులో తెదేపా అనుసరించిన వ్యూహం పరిశీలిస్తే.. హోదాపై తెదేపా అన్ని మార్గాల్లో పోరాడుతున్నా, బాబు 18 సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సహకరించడం లేదన్న సంకేతాలు పంపడంలో సఫలమయింది. చంద్రబాబు సమక్షంలోనే పార్టీ నేతలు బిజెపిపై విరుచుకుపడటం, చివరలో ఆయన మాత్రం కేంద్రం ఆదుకోవాలని సానుకూలంగానే మాట్లాడటాన్ని బట్టి, హోదాపై తెదేపా వ్యూహమేమిటో స్పష్టమయింది.
జగన్‌పైనా దాడి
పనిలోపనిగా వైసీపీ నేత జగన్ మీద కూడా మహానాడు ఆరోపణల వర్షం కురిపించింది. జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, బాబు నుంచి ఎమ్మెల్యేల వరకూ విమర్శలు కొనసాగించారు. ప్రతిసారీ ఢిల్లీకి వెళుతున్న జగన్.. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, అమరావతికి నిధుల విషయం గురించి ఎందుకు అడగడం లేదని ప్రశ్నించడం ద్వారా, జగన్‌కు రాష్ట్భ్రావృద్ధిపై ఆసక్తి లేకపోగా, అభివృద్ధి నిరోధకుడిగా మారారన్న సంకేతాలు పంపించారు.
సాదాసీదాగా బాబు ప్రసంగం
కాగా, చంద్రబాబు ప్రసంగంలో పెద్దగా కొత్తదనం కనిపించలేదు. ఆ మేరకు బాబు ప్రసంగ పాఠం తయారుచేసే వారు బాబును కొత్త కోణంలో ఆవిష్కరించలేకపోయారు. హోదా, జగన్‌పై విమర్శలు, రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు, గత కొద్దికాలం నుంచి మాట్లాడుతున్న అంశాలతోపాటు, తాజా కలెక్టర్ల భేటీలో మాట్లాడిన అంశాలే పునరావృతం చేశారు. ఓసీలకు రిజర్వేషన్లు, సర్కారు పథకాలకు పార్టీ ముద్ర రెండు అంశాలే కొత్తగా చోటుచేసుకున్నాయి. అయితే, గతంలో కంటే ఈసారి బాబు ప్రసంగానికి హర్షధ్వానాలు ఎక్కువగా వినిపించాయి. పంచ్ డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి.
పార్టీలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు చేరుతున్న నేపథ్యంలో పాత కొత్త నేతల అధికారాలు-బాధ్యతలపై స్పష్టత ఇవ్వలేకపోయారు. వైసీపీ నుంచి చేరుతున్న ఎమ్మెల్యేలకు- పాత నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో మహానాడు వేదిక ద్వారా వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని భావించినా అది కనిపించలేదు. అదే సమయంలో పదవుల పంపిణీపై ప్రకటన చేస్తారేమోనని ఆశగా ఎదురుచూసిన కార్యకర్తలకు తొలిరోజు నిరాశే మిగిలింది.
కార్యకర్తలు నా కుటుంబ సభ్యులకంటే ఎక్కువ, వారికి పాదాభివందనం వంటి రొటీన్ డైలాగునే తప్ప, రెండేళ్ల తర్వాత వారి భవిష్యత్తేమిటన్నది స్పష్టం చేయలేకపోయారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపించాయి. ఇచ్చిన పదవుల గురించి మాత్రమే ప్రస్తావించిన బాబు, భర్తీకావలసిన వేలాది పోస్టుల గురించి మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం నిరాశపరిచింది.
వెనుక సీటులో లోకేష్
తొలిరోజు మహానాడులో పార్టీ యువనేత లోకేష్ చివరి వరసలో కూర్చోగా, ఆయన మామయిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముందు వరసలో కూర్చుకున్నారు. లోకేష్ ఈసారి ఉత్సాహంగా కనిపించారు. నేతల వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. లోకేష్ వేదిక మీదకు వచ్చిన వెంటనే సీనియర్లు బాబుకు ఇచ్చే గౌరవానే్న యువనేతకూ ఇవ్వటం కనిపించింది. రామకృష్ణుడు, కెఇ కృష్ణమూర్తి, కళావెంకట్రావు వంటి సీనియర్లు కూడా లేచి అభినందించడం బట్టి, లోకేష్ నాయకత్వానికి పార్టీలో ఆమోదముద్ర పెరుగుతున్నట్లు స్పష్టమయింది. ఉదయం అధ్యక్ష బాధ్యతను ఆంధ్రకు చెందిన పయ్యావుల కేశవ్‌కు ఇచ్చి, సాయంత్రం సభకు తెలంగాణకు చెందిన సీతక్కకు అప్పగించి ప్రాంతాల సమతుల్యం పాటించారు.