రాష్ట్రీయం

సర్జరీ చేయకుంటే తరువాత పోస్టుమార్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: రాష్ట్ర కాంగ్రెస్‌కు వెంటనే సర్జరీ చేయకపోతే, తరువాత పోస్టుమార్టం చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి శనివారం రాష్ట్ర మంత్రి టి. హరీశ్‌రావును కలిసి మంతనాలు జరిపిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే కలిసానన్నారు. అసమర్థుడైన ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పార్టీ రాష్ట్ర పగ్గాలు ఇవ్వడమే పార్టీ నాశనానికి కారణమని విమర్శించారు. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా చొరవ తీసుకుని చికిత్స చేయకపోతే తెలంగాణలో పార్టీ బతకడమే కష్టమవుతుందన్నారు. లోగడ పొన్నాల లక్ష్మయ్య హయాంలో పార్టీ సగం అధ్వాన్నమైతే, తర్వాత ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియమించడంతో పార్టీ పూర్తిగా అధ్వాన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నాల కంటే ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇంకా పనికిరాని నాయకుడన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని పొన్నాలను తొలుత టి.పిసిసి అధ్యక్షునిగా నియమించిన పార్టీ అధిష్టానం, తర్వాత ఉత్తమ్‌కు ఇచ్చి రెండో తప్పు చేసిందన్నారు. ఇటీవలి కాలంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు, జిహెచ్‌ఎంసి, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఉత్తమ్‌కుమార్ బాధ్యత వహించాలని ఆయన తెలిపారు. తన సోదరుడు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఓడించేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మూడు జిల్లాల్లో డబ్బుల పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు. సిఎల్‌పి నేత కె. జానారెడ్డి పని తీరు పట్ల కూడా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీటన్నింటిపై తాను త్వరలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తానని ఆయన చెప్పారు.
ఇస్తే నిర్వర్తిస్తా..
తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బ్రహ్మండంగా నిర్వర్తిస్తానని ఆయన తెలిపారు. తాను పార్టీ ఫిరాయించనున్నట్లు కొంత మంది నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆయన తెలిపారు.