రాష్ట్రీయం

దగ్గరపడిన ముసాయిదా గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పంపిన ముసాయిదా నోటిఫికేషన్ వివాదస్పదంగా మారింది. ముసాయిదాలోని మార్గదర్శకాలను అంగీకరించే ప్రసక్తిలేదని ముందుగా కేంద్రానికి ఫిర్యాదుచేసి, అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్ర ప్రభుత్వం మాత్రం ముసాయిదా నోటిఫికేషన్‌ను అంగీకరిస్తున్నట్టు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులను, సాగునీటి నిపుణులను ఢిల్లీకి పిలిపించి చర్చించనుంది. ఈమేరకు ఆంధ్ర ప్రభుత్వ సాగునీటి అధికారులకు కేంద్రం నుంచి సూత్రప్రాయంగా సమాచారం అందినట్టు తెలిసింది. కానీ తేదీలు ఖరారు కావాల్సి ఉంది. గతనెల 27న కృష్ణా బోర్డు హైదరాబాద్‌లో సమావేశమై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రకాశం బ్యారేజీ, పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులను ఉమ్మడి పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో తుంగభద్ర నదిపైవున్న రాజోళిబండ మళ్లింపు పథకం స్కీం, సుంకేశుల ప్రాజెక్టులను కూడా చేర్చింది. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పర్యవేక్షణను ఇకపై కృష్ణా బోర్డు పర్యవేక్షిస్తుందని సూత్రప్రాయంగా ప్రతిపాదించింది. ఆంధ్రలో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, తెలంగాణలో నెట్టెంపాడు, కోయల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బిసి, బీమా, ఎలిమినేటిమాధవరెడ్డి ప్రాజెక్టు వద్ద నీటి విడుదల విధులను కూడా బోర్డు నిర్వహిస్తుంది.
ఈనెల 10లోగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను ముసాయిదాపై తెలియచేయాలని సూచించిన విషయం విదితమే. 10వ తేదీ తర్వాత ఉభయ రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన మార్పులు చేర్పులు చేసి ముసాయిదా తుది నోటిఫికేషన్‌ను కేంద్రానికి బోర్డు సమర్పిస్తుంది. కేంద్రం నోటిఫికేషన్ చేసిన వెంటనే కృష్ణా బోర్డు పరిధిలోకి ఉభయ రాష్ట్రాల్లో పూరె్తైన ప్రాజెక్టులు వెళ్తాయి. బచావత్ ట్రిబ్యునల్‌ను పరిగణనలోకి తీసుకుని జల కేటాయింపులు ఉన్నాయని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తికాకుండా తమ ప్రభుత్వం బోర్డు మార్గదర్శకాలను అంగీకరించేది లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. సుప్రీం కోర్టులోనూ కృష్ణా జలాల కేటాయింపును పునఃసమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇది సుప్రీంకోర్టు విచారణలో ఉంది. నీటి వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చకుండా ఏకపక్షంగా కృష్ణా బోర్డు వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కృష్ణా బోర్డు పరిధిలోకి వీలైనంత త్వరగా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ వస్తే తమకు జలాల కేటాయింపులో అన్యాయం ఉండదని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం, డిండి ఎత్తిపోతల స్కీం వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా 135 టిఎంసి వరకు గరిష్టంగా నీటిని వినియోగించుకోవాలనే తలంపుతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని తెలంగాణ వేగవంతం చేసింది. ఈ రెండు ప్రాజెక్టులపై గుంటూరు జిల్లా రైతాంగం సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆంధ్రలో ప్రతిపక్ష పార్టీ వైకాపా ఇప్పటికే ఈ రెండు ఎత్తిపోతల స్కీంవల్ల ఆంధ్ర, రాయలసీమ ఆయకట్టు ఎడారి అవుతోందని ఆందోళన చేసిన విషయం విదితమే. గత ఏడాది కృష్ణా బోర్డు సమావేశమై నదీ జలాల పంపకంపై 15 అంశాలతో మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఏపీకి 522 టిఎంసి, తెలంగాణకు 299 టిఎంసి కేటాయించి, మిగులు జలాలను ఇదే నిష్పత్తిలో వాడుకోవాలని విధానాలను ఖరారు చేసింది. వివాదాలు తలెత్తకుండా బోర్డు ప్రతినిధి, రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లతో వర్కింగ్ గ్రూపును కూడా ఏర్పాటు చేసింది. కానీ ఈ కమిటీ వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదనే విమర్శలు ఉన్నాయి.