రాష్ట్రీయం

కాలేజీల కోల్డ్‌వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: కార్పొరేట్ కాలేజీల మధ్య మళ్లీ వార్ మొదలైంది. సినిమా సన్నివేశాలను తలపించేలా ఎక్కువ రేటు చెల్లించి లెక్చరర్లను ఎత్తుకువెళ్లే సంస్కృతికి కొద్ది కాలం విరామం చిక్కినా, మళ్లీ అది జడలు విప్పింది. నారాయణ కాలేజీలో పనిచేస్తున్న కొంత మందిని వెలాసిటీ కార్పొరేట్ జూనియర్ కాలేజీలు రిక్రూట్ చేసుకుని వేతనాలను ఖరారు చేయగా, అందుకు రెట్టింపు చెల్లిస్తామని పేర్కొంటూ నారాయణ విద్యాసంస్థలు మళ్లీ వారిని తమ కాలేజీలకు తీసుకువెళ్లాయి. దీంతో వెలాసిటీ విద్యాసంస్థ తమ లెక్చరర్లు కనిపించడం లేదంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు పీటముడి ఇక్కడే పడింది. నారాయణ విద్యాసంస్థల వెనుక ఆంధ్రాకు చెందిన మంత్రి నారాయణ ఉండగా, తెలంగాణలోని వెలాసిటీ విద్యాసంస్థల వెనుక అంతకంటే బలమైన మరో మంత్రి ఉండటంతో ఇది ఇద్దరు మంత్రుల మధ్య పోరుగా భావించిన పోలీసులు ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. లెక్చరర్ల అదృశ్యంపై సమాచారం కోరగా అలాంటిది ఏమీ లేదని ఏదో చిన్న విషయం అన్నట్టు కొట్టిపారేశారు.
విద్యార్ధుల ఆత్మహత్యలకు కేంద్రంగా మారి ఎపుడూ వివాదాల్లో ఉండే కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల మధ్య సైతం సిబ్బందికి సంబంధించి తీవ్రమైన ఘర్షణలే జరుగుతున్నాయి. గతంలో నారాయణ సంస్థలకు, చైతన్య సంస్థలకు మధ్య ఘర్షణలు ఒక దశలో పతాక స్థాయికి చేరగా, అపుడు కూడా హైదరాబాద్‌కు చెందిన ఒక మంత్రి మధ్యవర్తిత్వంతో పరిష్కారం అయ్యాయి. తర్వాత ఆ రెండు సంస్థల యాజమాన్యాల మధ్య అవగాహన కుదరడంతో ఇరు సంస్థల యాజమాన్యాలు సంయుక్తంగా ‘చైనా’ (చైతన్య ప్లస్ నారాయణ) సంస్థలను ప్రారంభించడంతో అవి కాస్తా సద్దుమణిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని గ్రామాల్లో నారాయణ విద్యాసంస్థలు, శ్రీ చైతన్య విద్యాసంస్థలే రాజ్యమేలడంతో పాటు జాతీయ స్థాయిలో విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ‘వెలాసిటీ’ పేరుతో కార్పొరేట్ జూనియర్ కాలేజీల సంస్థ ఆవిర్భవించింది. ఈ సంస్థను నెలకోల్పిన ముగ్గురూ ఎం రాధాకృష్ణ (గణితం), ఎస్ వంశీ కృష్ణ (్ఫజిక్స్) , వై లారెన్స్ (కెమిస్ట్రీ) మూడు సబ్జెక్టుల్లో నిష్ణాతులు. వీరు చైనా (శ్రీచైతన్య-నారాయణ) సంస్థలో దశాబ్దాల తరబడి పనిచేసిన వారే, అయితే ఈ సంస్థ ఏర్పాటు వెనుక ఒక ప్రముఖ మంత్రి సహకారం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
వెలాసిటీలో ప్రతి ఏటా సిబ్బందిని రిక్రూట్‌చేసుకున్నట్టే ఈ ఏడాది కూడా సిబ్బంది రిక్రూట్‌మెంట్‌లో భాగంగా నారాయణలో పనిచేస్తున్న అచ్యుత్‌రావును రెట్టింపు వేతనాలకు రిక్రూట్‌చేసినట్టు సమాచారం. అయితే వెలాసిటీకి వెళ్లిన అచ్యుత్‌రావును మరింత వేతనం అదనంగా ఇస్తామని చెప్పి నారాయణ విద్యాసంస్థలు మళ్లీ ఆయనను వెనక్కి తీసుకువెళ్లాయి. దాంతో ఏడాది పాటు పనిచేస్తానని అంగీకరించిన అచ్యుత్‌రావు కనిపించడం లేదంటూ మాదాపూర్ పోలీసులకు వెలాసిటీ విద్యాసంస్థ ఫిర్యాదు చేసిందని తెలిసింది. అలాగే బెంగలూరులో నారాయణ సంస్థల్లో పనిచేస్తున్న నాగేశ్వరరావును సైతం హైస్కూళ్ల విభాగానికి ఒక కార్పొరేట్ సంస్థ రిక్రూట్‌చేసుకోగా, ఆయనను సైతం తిరిగి నారాయణ విద్యాసంస్థ వెనక్కి తీసుకువెళ్లింది. దానిపై కూడా పెద్ద ఎత్తున రగడ నడుస్తోందని తెలిసింది. రెండు మూడేళ్లపాటు శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల మధ్య నిశ్శబ్దం రాజ్యమేలగా, మళ్లీ అదే తరహా వివాదాలు తెలంగాణలో రాజుకోవడంపై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కొంత మంది అధ్యాపకులను ఒక కార్పొరేట్ సంస్థ తీసుకవెళ్లి బందీ చేసిన సందర్భాలు, ప్రిన్సిపాల్స్‌ను జోనల్ మేనేజర్లను సైతం గూండాలతో బెదిరించిన సందర్భాలున్నాయని కార్పొరేట్ సంస్థల్లో పనిచేసిన సిబ్బంది చెబుతున్నారు.