రాష్ట్రీయం

విజయవాడకు మారిన కాలేజీల వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: హైదరాబాద్‌లో కార్పొరేట్ కాలేజీలు నారాయణ, వెలాసిటీల మధ్య కొట్లాట విజయవాడకు మారింది. వెలాసిటీలో పనిచేస్తూ అదృశ్యమయ్యారని చెబుతున్న అశ్వత్థరావు మంగళవారం విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. అశ్వత్థరావు కోసం అనే్వషించిన వెలాసిటీ బృందం తెలంగాణ ప్రాంత నారాయణ కాలేజీల జిఎం కాట్రగడ్డ శ్రీనివాస్, రాయలసీమ ఇన్‌చార్జి విజయభాస్కర రెడ్డిలపై మంగళవారం ఒత్తిడి తేవడంతో, కాట్రగడ్డ శ్రీనివాస్ ఇంటికి తాళాలు వేసుకుని అదృశ్యమయ్యారు. మరోపక్క వెలాసిటీ సంస్థ ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో వ్యవహారం రసవత్తరంగా మారింది. వెలాసిటీలో కీలకమైన ముగ్గురు ఫ్యాకల్టీ సభ్యులూ తొలుత నారాయణ, తర్వాత శ్రీచైతన్య అనంతరం చైనా బ్యాచ్‌కు పనిచేసిన వారే. అంతేకాదు, అక్కడ సిఇఓగా పనిచేస్తున్న సొహైల్ సైతం తొలుత శ్రీచైతన్య, తర్వాత నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసి వెలాసిటీలో చేరారు. అశ్వత్థరావును తాము ఎత్తుకురాలేదని, ఆయన స్వచ్ఛందగా వచ్చారని నారాయణ విద్యాసంస్థల ప్రతినిధి ఒకరు చెప్పారు. అశ్వత్థరావు వెలాసిటీ విద్యాసంస్థలో కోటి రూపాయిలకు పైగా వేతనానికి అగ్రిమెంట్ చేసుకున్నారని చెబుతున్నారు. అందులో అపుడే 50 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారని, అడ్వాన్స్ తీసుకున్నారు కనుక తమ సంస్థలో పనిచేయమని అంటున్నామని వెలాసిటీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వెలాసిటీలో మూడు పాఠశాలలకు చెందిన ముగ్గురు అధినేతలు భాగస్వామ్యులుగా ఉన్నారు. వారిలో ఒకరు తెరాస మంత్రికి అత్యంత సన్నిహితులు కావడంతో కేసును పోలీసులు సైతం తేలిగ్గా తీసుకోలేదు. అందరినీ పిలిపించి హైదరాబాద్‌లో కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించుకోవల్సిందిగా ఇప్పటికే సంకేతాలు పంపినట్టు సమాచారం. ప్రతి ఏటా అడ్మిషన్ల సమయంలో వేరే సంస్థ విద్యార్థులను రాయితీలు, బహుమతులిచ్చి తమ సంస్థల్లో చేరుకోవడం అలవాటుగా మారిన కార్పొరేట్ కాలేజీలు తాజాగా మంచి పేరు సంపాదించుకున్న టీచర్లను సైతం బలవంతంగా తీసుకెళ్లడం ఆనవాయితీగా మారుతోంది. గతంలోనూ నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసిన ఇద్దరు ప్రముఖులను చైతన్య విద్యాసంస్థ తీసుకెళ్లగా, చైతన్య విద్యాసంస్థ నుండి ఇద్దరిని నారాయణ విద్యాసంస్థ తీసుకుని వారికి ఉపాధ్యక్ష పదవి ఇచ్చి పూర్తి అధికారాలను కట్టబెట్టింది. ఎక్కువ వేతనానికి సంస్థలు మారడం అనేది అన్నిచోట్లా ఉన్నా, సహజ రీతికి భిన్నంగా రాత్రికి రాత్రి టీచర్లను ఎత్తుకెళ్లడం, అవసరమైతే తమ ఆధీనంలో బంధించడం, అనైతికంగా బేరాలు సాగించడమే కార్పొరేట్ కాలేజీల మధ్య వివాదానికి కారణమవుతోంది. ఐఐటి రామయ్య స్టడీసర్కిల్ కోసం నిర్వహించే పోటీ పరీక్షలో టాపర్లను ఒక కార్పొరేట్ కాలేజీ తీసుకెళ్లి వారికి పూర్తి ఫీజు రాయితీ కల్పించి తమ విద్యార్థులుగా ప్రకటించుకోగా, ఢిల్లీకి చెందిన విద్యార్ధిని ఒకరిని హైదరాబాద్ తీసుకొచ్చి ఐఐటి జెఇఇ టాపర్‌గా రాష్ట్రం నుండి ఎంపికైనట్టు మరో కార్పొరేట్ కాలేజీ ప్రకటించుకుంది. టాపర్ల జాబితాలో ఎస్సీ కేటగిరి టాపర్, ఎస్టీ కేటగిరి టాపర్, పిడబ్ల్యుడి, మహిళా కేటగిరిల్లో టాపర్లను సైతం జనరల్ కేటగిరి టాపర్లుగా ప్రకటనలు విడుదల చేసి కనిపించనిచోట ఎస్సీ, ఎస్టీ అని రాయడం ద్వారా మోసాలకు పాల్పడిన విద్యాసంస్థలు తాజాగా ఫ్యాకల్టీ విషయంలో రోడ్డెక్కడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది.