ఆంధ్రప్రదేశ్‌

నన్ను అరెస్టు చేయండి! అమలాపురంలో ముద్రగడ హైడ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ/రాజమహేంద్రవరం, జూన్ 7: తుని విధ్వసం ఘటన నేపథ్యంలో జరుగుతున్న అరెస్టులు మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ముందుగా తనను అరెస్టుచేయాలంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరికొందరు నేతలతో కలిసి ఉదయం అమలాపురం పోలీసు స్టేషన్‌లో బైఠాయించడంతో మొదలైన హైడ్రామా ఆయనను పోలీసు వ్యాన్‌లో స్వగ్రామం కిర్లంపూడి తరలించడంతో ఊహించని మలుపుతిరిగింది. తుని ఘటనలో ఇప్పటివరకు అరెస్టుచేసిన వారందరినీ బేషరతుగా విడిచిపెట్టాలనే డిమాండుతో పోలీసు వ్యాను నుండి దిగడానికి ముద్రగడ నిరాకరించడంతో వ్యవహారం పతాకస్థాయికి చేరుకుంది. రాత్రి వరకు ఆయనను ఒప్పించడానికి పోలీసులు ప్రయత్నాలు సాగించారు. వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది జనవరి 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్న సిఐడి అధికారులు తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన ఏడుగురిని అరెస్టుచేశారు. అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితునిగా ఉన్న తనను ముందుగా అరెస్టుచేయకుండా, అమాయకులను అరెస్టుచేయడం ఏమిటంటూ ముద్రగడ పద్మనాభం తన అనుయాయులు నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, నల్లా పవన్, వాసిరెడ్డి ఏసుదాసు, మిండగుదిటి మోహన్, సూదా గణపతి, నల్లా అజయ్, రంకిరెడ్డి రామలింగేశ్వరరావుతో కలిసి ఉదయం 8.30 గంటల సమయంలో అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. తమను అరెస్టుచేయాలని డిమాండుచేస్తూ స్టేషన్‌లో బైఠాయించారు. అయితే ఈ కేసును సిఐడి దర్యాప్తు చేస్తున్నందున అరెస్టు తమ పరిధిలో లేదని పోలీసులు స్పష్టంచేశారు. అయినా ముద్రగడ పట్టు వీడకపోవడం, ఈలోగా భారీ సంఖ్యలో ముద్రగడ అభిమానులు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 10.30 గంటల సమయంలో అడిషనల్ ఎస్పీ దామోదర్, డిఎస్పీ ఎల్ అంకయ్య స్టేషన్‌కు చేరుకుని ముద్రగడతో చర్చలు జరిపారు. ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయినందున ముందుగా తనను అరెస్టుచేయాలని, అమాయకులను వేధించడం తగదన్నారు. చివరకు కేసు దర్యాప్తుచేస్తున్న సిఐడి విభాగం రాజమహేంద్రవరంలో ఉన్నందున ముద్రగడను అక్కడకు తరలించాలని నిర్ణయించారు. అయితే తమను సాధారణ నిందితుల మాదిరిగా పోలీసు వ్యానులో తరలించాలని షరతు విధించడంతో ఒక మినీ బస్సులో వారందరినీ తరలించే ప్రయత్నం చేశారు. ఈసందర్భంగా స్టేషన్ ముందు ఆందోళన జరుపుతున్న కొందరు వాహనంపై రాళ్లు రువ్వారు. దీనితో పోలీసులు వారిని చెదరగొట్టి వాహనాన్ని ముందుకు నడిపించారు.

కిర్లంపూడికి వాహనం
ముద్రగడ తరితరులను రాజమహేంద్రవరం సిఐడి కార్యాలయానికి తరలిస్తారని అంతా భావించగా, పోలీసులు మాత్రం రాజమహేంద్రవరం మీదుగా ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడి తరలించారు. ముద్రగడ ఇంటిముందు వాహనం నిలిపిన తర్వాత సరికొత్త సమస్య మొదలయ్యింది. అరెస్టుచేసిన వారిని విడిచిపెట్టేవరకు తాను వాహనం దిగేదిలేదని ముద్రగడ భీష్మించడంతో పోలీసులు తెల్లబోయారు. తనను బలవంతంగా దించాలని చూస్తే, తన సతీమణితో కలిసి ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. విషయం తెలుసుకున్న ముద్రగడ అభిమానులు భారీసంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. స్థానిక మహిళలు రహదారిపై బైఠాయించారు. కాగా పెద్దాపురం డిఎస్పీ సుంకర మురళీమోహన్, అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య తదితరులు ముద్రగడతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. గతంలో ఐఎఎస్ అధికారులను కిడ్నాప్ చేసిన నిందితులను సైతం అరెస్టు చేయకుండా బేషరతుగా విడుదలచేసిన సందర్భాలున్నాయని, ఇంకా అనేక కేసుల్లో నిందితులను విడుదలచేసిన సందర్భాలున్నాయని ఈ సందర్భంగా ముద్రగడ గుర్తుచేశారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారడంతో గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి కిర్లంపూడి వైపు వాహనాలు రాకుండా నిలిపివేశారు. అటుగా వెళ్లాల్సిన వాహనాలను దారిమళ్లించారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కిర్లంపూడి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

చిత్రం... అమలాపురం పోలీసు స్టేషన్‌లో బైఠాయించిన ముద్రగడ, పోలీసుస్టేషన్ ఎదుట అభిమానుల ఆందోళన