రాష్ట్రీయం

దీక్షపై కలవని దారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: తుని ఘటనలో అమాయకులయిన వారిపై కేసులు ఎత్తివేయకపోతే గురువారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని కాపునాడు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన అల్టిమేటమ్‌పై కాపు సామాజికవర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో దీక్షకు మద్దతివ్వకపోతే స్థానికంగా తమ మనుగడ ఏమిటన్న దానిపై కాపు వర్గానికి చెందిన మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు సందిగ్ధంలో పడ్డారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో అటు పోలీసులు కాపులపై కనే్నసి, వారి కదలికలను గమనిస్తున్నారు.
ముద్రగడ ఆమరణ దీక్షకు మద్దతుపై కాపు సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తుని ఘటన తర్వాత పోలీసుల వేధింపులతో కాపులు భయాందోళనలో ఉన్నారని, మళ్లీ దీక్షకు మద్దతుగా రోడ్డెక్కితే కొత్త కేసులు నమోదు చేస్తే ఆదుకునేదెవరన్న అంశంలో వెనకంజ వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాపునేతలు చెబుతున్నారు. అటు కాపుసంఘాల నుంచి కూడా దీక్షపై ఇప్పటివరకూ పెద్దగా సానుకూలత కనిపించడం లేదు. ముద్రగడ తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారన్న విమర్శ వినిపిస్తోంది. పైగా ప్రతిసారీ ఘర్షణకు దిగడం వల్ల కాపులంటే మిగిలిన సామాజికవర్గాల్లో వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉందని వాదిస్తున్నారు. ఈ కారణం వల్లే గత మూడు నెలల్లో ముద్రగడకు ఏ ఒక్క కాపుసంఘం మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం. అయితే, ఈ తరహా వాదన చేసేవారు తెదేపాకు అనుకూలంగా ఉండేవారిలా కనిపిస్తోంది. ‘ముద్రగడ అన్నా, ఆయన నిబద్ధత అన్నా మాకు గౌరవం. కానీ, రైలు, పోలీసుస్టేషన్లను తగులబెట్టిన రౌడీషీటర్ల కోసం ఆయన దీక్ష చేయడం తగదు. ప్రతిసారి దీక్ష చేయడం వల్ల కాపులంటే గొడవ చేసేవాళ్లనే దురభిప్రాయం ఇతర కులాల్లో ఏర్పడుతుంది. పైగా తుని ఘటన తర్వాత కాపు యువకులపై కేసులు పెట్టడంతో అంతా భయపడుతున్నారు.అయినా ఆయన కాపు సంఘాలతో సంప్రదించకుండా సొంత నిర్ణయం తీసుకున్నారు. ముద్రగడ ఎప్పుడూ అంతే. ఆయనకు స్వార్థం లేకపోవచ్చు. కానీ కిందిస్థాయిలో కాపులు ఎదుర్కొనే కష్టాలు అర్థం చేసుకోవాలి కదా’ అని ఒక కాపునేత వ్యాఖ్యానించారు. కాపులకు బీసీ హోదా ఇవ్వాలని ముద్రగడ టిడిపిని కోరకపోయినా, బాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటుచేసిన వైనాన్ని టిడిపి కాపులు గుర్తు చేస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాకు చెందిన కాపు నేతలు మాత్రం ముద్రగడ దీక్షకు మద్దతునివ్వకపోతే, కాపు జాతిని అవమానించడమేనని వాదిస్తున్నారు. కేసులకు భయపడకుండా అంతా కిర్లంపూడికి చేరుకోవాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. అటు గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కాపు సంఘాల్లో కొన్ని ఇప్పటికే దీక్షకు మద్దతు ప్రకటించగా, పిళ్లా వెంకటేశ్వరావు వర్గం మాత్రం దానికి దూరంగా ఉంది.
కాగా దీక్షకు ముందురోజు పోలీసులు హడావిడి మొదలుపెట్టారు. కాపులపై కనే్నశారు. దానితో కాపుల్లో భయాందోళన మొదలయింది. గుంటూరులో కాపు సమావేశం పెట్టిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్లి వచ్చేవారి వివరాలు నమోదు చేసుకోవడంతో భయపడి వెనక్కి వెళ్లారు.
ఫలితంగా సమావేశం వాయిదా వేసుకోవలసి వచ్చింది. రాష్టమ్రంతా ఇదే పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, బిజెపికి చెందిన కాపు సంఘ నేతలు మాత్రం దీక్షకు సైతం సొంత వర్గాన్ని సమీకరించి, సంఘీభావం ప్రకటించే పనిలో ఉన్నారు.
అటు మంత్రుల పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిన చందంగా కనిపిస్తోంది. దీక్షకు మద్దతునివ్వకపోతే స్థానికంగా ఉన్న కాపులు, తమ నాయకత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. మద్దతిస్తే పార్టీ నాయకత్వంతో ఇబ్బంది. అందుకే తమ నియోజకవర్గాల్లోని కాపులకు వాహన, భోజన సౌకర్యాలు సమకూర్చి కిర్లంపూడికి పంపించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.