రాష్ట్రీయం

దీక్ష భగ్నం.. ముద్రగడ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 9: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురువారం చేపట్టిన ఆమరణ దీక్షను తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య సిఐడి పోలీసులు భగ్నం చేసి, ఆయన్ని అరెస్టు చేశారు. ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని కాపు నేతలు పిలుపు నిచ్చారు. అత్యంత ఉద్విగ్న పరిస్థితుల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అరెస్టు సమయంలో ముద్రగడ నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించిన నేపథ్యంలో సిఐడి పోలీసులు అరెస్టు వారెంట్‌తో అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో దీక్షలో ఉన్న ముద్రగడ పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని ఉన్నారు. అరెస్టు వారెంట్‌తో వెళ్లిన సిఐడి పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో ముద్రగడ దీక్ష చేస్తున్న గది తలుపులను బద్దలుగొట్టే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో పురుగుల మందు సీసా తెరిచి ముద్రగడ, ఆయన పక్కనే ఉన్న మరికొందరు తాగడాన్ని గమనించిన పోలీసులు వెంటనే లోపలికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ముద్రగడ, నక్కా అప్పలరాజు, వివై దాసు తదితరులు కొంత వరకూ పురుగుల మందు తాగేశారు. వారిని వెంటనే అంబులెన్స్ ఎక్కించిన పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దీక్షలో ఉన్న ముద్రగడ భార్య పద్మావతి ఇతర కుటుంబ సభ్యులను మాత్రం పోలీసులు అరెస్టు చేయలేదు.
కిర్లంపూడిలో యుద్ధ వాతావరణం
అరెస్టు నేపథ్యంలో కిర్లంపూడిలో యుద్ధవాతావరణం కనిపించింది. పోలీసు వలయంలో ఉన్న ఈ గ్రామంలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు ముద్రగడ దంపతులు ముందుగా ప్రకటించినట్టే నిరాహార దీక్ష ప్రారంభించారు. వీరితో పాటు సన్నిహితులైన మరికొందరు కాపునేతలు దీక్షలో కూర్చున్నారు. 10 గంటల ప్రాంతంలో జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. ఇదే సమయంలో అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను ముద్రగడ తీవ్రంగా హెచ్చరించారు. తలుపులువేసుకుని హాలు గదిలో దీక్షలో ఉన్న ఆయన పురుగుల మందు డబ్బాను కిటికీలో నుండి పోలీసులకు చూపిస్తూ తనను బలవంతంగా అరెస్టు చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఇదే సమయంలో మీడియాపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ముద్రగడ పురుగుల మందు డబ్బా చూపిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. తనను అరెస్టు చేయాలని కోరేందుకు అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని, ఈ కారణంగా కేసులు నమోదు చేసి, అరెస్టు చేస్తామని చెప్పడం దారుణమని ముద్రగడ ఆగ్రహం చెందారు. తుని దుర్ఘటనకు సంబంధించి సిఐడి తనపై 69 కేసులు నమోదు చేసినట్టు తెలిసిందని, ఆయా కేసులకు సంబంధించి తగిన కారణాలు చూపిస్తూ సిఐడి పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తే తాను అరెస్టయ్యేందుకు సిద్ధమని ముద్రగడ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిఐడి పోలీసులు ముద్రగడను అరెస్టు చేసేందుకు వారెంట్‌తో సహా ఆగమేఘాలపై కిర్లంపూడి గ్రామానికి చేరుకున్నారు. వెనువెంటనే స్థానిక పోలీసుల సహాయంతో తలుపులు బద్దలుకొట్టారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుచరులు ముద్రగడకు అనుకూలంగా, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తలుపులు తెరుస్తుండగా పురుగుల మందు సేవిస్తోన్న ముద్రగడ సహా అనుచరులను అదుపులోకి తీసుకుని అంబులెన్స్ ఎక్కించి, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ముద్రగడ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు.

చిత్రం ముద్రగడను రాజమండ్రి ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు