రాష్ట్రీయం

ఎవరు ఎక్కడికో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 9:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ప్రతిష్ఠంభన నెలకొంది. జూన్ ఒకటి నుంచి 15వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకుని 10 రోజులవుతున్నా, బదిలీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయలేదు. ఆ ఫైల్‌ను తన వద్దనే ఉంచుకుని కాలం వెళ్లబుచ్చుతున్నారు. బదిలీలకు సంబంధించి గైడ్‌లైన్స్ రాకపోవడంతో రాష్ట్రంలో ఉద్యోగులు అయోమయంలో పడిపోయారు. ఏ క్షణాన ఎక్కడికి బదిలీ అవుతామో తెలియక ఉద్యోగులు గత కొద్ది రోజులుగా విధులపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను గత ఏడాది, అంతకు ముందు ఏడాది కూడా బదిలీ చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులను బదిలీ చేసినా, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు జరగలేదు. ఒకవేళ ఇప్పుడు బదిలీలు జరిగితే, ప్రభుత్వం ఉద్యోగుల పనికాలాన్ని ఏవిధంగా పరిగణలోకి తీసుకుంటుందో తెలియడం లేదు. రెండేళ్లకు పైబడి పనిచేసే వారిని బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇస్తే, కేవలం 10 నుంచి 20 శాతం మంది మాత్రమే బదిలీ అవుతారు. మూడు సంవత్సరాలకు మించి ఆయా ప్రదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలంటే కేవలం ఐదు నుంచి 10 శాతం మంది మాత్రమే బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈపాటిదానికి ఇప్పుడు బదిలీలు అవసరమా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
గెజిటెడ్ ఆఫీసర్ల మాటేంటి?
గత రెండేళ్లలో నాన్ గజిటెడ్ ఆఫీసర్లను మాత్రమే కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేశారు. ఈ సంవత్సరం గజిటెడ్ ఆఫీసర్లను కూడా కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేయాలని ఉద్యోగ సంఘాల్లో ఒక వర్గం డిమాండ్ చేస్తుంటే, ఫైనాన్స్, మెడికల్ అండ్ హెల్త్‌లో చాలా కాలంగా బదిలీలు జరగనందున, అందులోని గెజిటెడ్ ఆఫీసర్లను ఎవరు కోరుకున్న చోటికి వారిని పంపించాలని
ఉద్యోగ సంఘాల్లోని మరో వర్గం డిమాండ్ చేస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ..బదిలీ చేసేదెవరు?
రాష్ట్రంలోని వివిధశాఖల్లో ఉద్యోగులను బదిలీ చేయాల్సింది ఆయా శాఖల హెచ్‌ఓడిలు. హెచ్‌ఓడిలను హుటాహుటిన విజయవాడకు వెళ్లిపోవలసిందిగా సిఎం ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది హెచ్‌ఓడిలు ఈ నెల 15,16 తేదీల నాటికి విజయవాడ వచ్చేస్తున్నారు. బదిలీలకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేయకపోవడం, వాటికి సంబంధించిన గైడ్‌లైన్స్ రాకపోవడంతో ఆయా శాఖల్లో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. హెచ్‌ఓడిలు విజయవాడ వచ్చి, అక్కడి నుంచి బదిలీలు చేసే అవకాశం లేదు. ఆ ప్రక్రియ అంతా ప్రస్తుతం ఉన్న కార్యాలయా నుంచే చేపట్టాలి. ఒకవేళ హెచ్‌ఓడిలు విజయవాడ వచ్చేస్తే, ఆయా శాఖల్లోని ఉద్యోగుల బదిలీలు ఏవిధంగా జరుగుతాయో తెలియని దుస్థితి నెలకొంది.
బదిలీల ఫైల్ కదిలిందిలా!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఏప్రిల్‌లోనే బదిలీ చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీనిపై తర్జన భర్జన జరిగిన తరువాత మే ఎనిమిదవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫైల్‌పై సంతకం చేశారు. ఆ తరువాత ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. ఆయన తిరిగి వచ్చిన తరువాత బదిలీల అంశాన్ని క్యాబినెట్ ఆమోదిస్తుందనుకున్నారు. ప్రతి క్యాబినెట్‌లో కూడా ఈ అంశం చర్చకు వస్తుందని ఉద్యోగులు ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈనెల ఒకటిన జరిగిన క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. రెండో తేదీన తిరిగి ఈ ఫైల్ సిఎం కార్యాలయానికి చేరుకుంది. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయింది. బదిలీల ఫైల్‌ను గడప దాటించేందుకు సిఎం ఎందుకు జాప్యం చేస్తున్నారన్నది ఉద్యోగ సంఘాలకు అర్థం కావడం లేదు.
నేడే డెడ్‌లైన్
ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రంలోగా బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడకపోతే, 11వ తేదీ నుంచి ఉద్యోగులెవ్వరూ కౌన్సిలింగ్‌కు సహకరించబోరని ఉద్యోగ సంఘ నాయకులు హెచ్చరిస్తున్నారు.