రాష్ట్రీయం

రాజకీయ పార్టీగా టి-జాక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణ రాజకీయ జెఎసి రాజకీయ పార్టీ రూపు దాలుస్తుందా? రాజకీయ పక్షాలన్నింటిలో ఇదే చర్చ సాగుతోంది. కోదండరామ్ వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ నేతలు అనూహ్యంగా పెద్దయెత్తున దాడి ప్రారంభించడానికి కారణం కూడా ఇదేనని విశే్లషకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో టిజెఎసి అంటే తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నింటి రూపం. టిఆర్‌ఎస్, బిజెపి, టిడిపి, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ పక్షాలన్నీ కలిపితేనే అప్పటి టిజెఎసి. కానీ ఇప్పుడు టిజెఎసిలో ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు. తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున కోదండరామ్ జెఎసికి నాయకత్వం వహించారు. ఇప్పుడు టిజెఎసిలో మిగిలింది కూడా తెలంగాణ విద్యా వంతుల వేదిక ఒక్కటే. ఈ నేపథ్యంలో టిజెఎసిని క్రమంగా రాజకీయ పక్షంగా మార్చడానికి కోదండరామ్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం బలంగా ఉంది. రెండేళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన విమర్శలపై మంత్రులు, ఎంపిలు తీవ్ర స్థాయిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. కోదండరామ్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటి వరకు ఎలాంటి విమర్శ చేయకపోయినా మంత్రులందరూ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రిని టిడిపి నేతలు వ్యక్తిగతంగా దూషించినా కెసిఆర్ సహా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా రేవంత్‌రెడ్డి పోలీసులకు చిక్కినప్పుడు కెసిఆర్‌ను అభ్యంతరకరమైన భాషలో తిట్టినా స్పందించలేదు. అలాంటిది కోదండరామ్ విమర్శలను పార్టీ సీరియస్‌గా తీసుకోవడం వెనుక కారణం ఏమిటా? అనే చర్చ టిఆర్‌ఎస్‌లో సాగుతోంది. తక్షణం కాకపోయినా భవిష్యత్తులో టిజెఎసిని రాజకీయ పార్టీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానిని దృష్టిలో పెట్టుకునే టిఆర్‌ఎస్‌కు టిజెఎసికి ఇకపై ఎలాంటి సంబంధం లేదనే స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికే కోదండరామ్ విమర్శలపై తీవ్రంగా స్పందించినట్టు మంత్రులు తెలిపారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకే మంత్రులు, పార్టీ ఎంపిలు తీవ్రంగా స్పందించారన్నది నిర్వివాదాంశం. పూర్వాశ్రమంలో నక్సల్స్ ఉద్యమంతో అనుబంధం ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్‌కు మొదటి నుంచి రాజకీయాలతో అనుబంధం ఉంది. టిఆర్‌ఎస్ ఆవిర్భావంకన్నా ముందు నుంచే తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా కార్యకలాపాలు నిర్వహించారు.
తెలంగాణ సంక్షేమమే టిజెఎసి లక్ష్యం అని కోదండరామ్ చెబుతున్నా అంతిమంగా రాజకీయ పార్టీగా మారుస్తారని టిఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ రెండవ ఆవిర్భావ దినోత్సవానికి మూడు నాలుగు రోజుల ముందు ప్రభుత్వం పట్ల సానుకూలంగా స్పందించిన కోదండరామ్ అమెరికాలో తెలంగాణ సంఘాల సమావేశానికి వెళ్లి వచ్చిన తరువాత వెంటనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ‘చేతకాకపోతే ప్రభుత్వం దిగిపోవాలి’ అని హెచ్చరించడం వెనుక రాజకీయం ఉందనేది టిఆర్‌ఎస్ అనుమానం.
టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, టిడిపి, న్యూ డెమోక్రసీ వంటి పార్టీలు ఉన్నప్పుడు టిజెఎసి బలంగా ఉండేది. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్లారు. లక్షలాది సభ్యులు ఉన్న తెలంగాణ ఎన్‌జివోల సంఘం సైతం టిజెఎసిలో ఉండేది. ఇప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా టిజెఎసిలో లేదు. ఉద్యోగ సంఘాలు కూడా లేవు. కోదండరామ్ శనివారం నిర్వహించిన టిజెఎసి సమావేశానికి గతంలో కీలక పాత్ర వహించిన ఏ ఒక్క సంస్థ కూడా హాజరు కాకపోవడం గమనార్హం. కాగా గ్రామస్థాయిలో టిజెఎసిని పటిష్ఠపరుస్తామని కోదండరామ్ ప్రకటించారు.
గతంలో టిఆర్‌ఎస్, టిజెఎసి ఒకటే అనే భావన ఉండేది. ఇప్పుడు ఒకదానితో మరో దానికి సంబంధం లేదని తేలిపోయిన తరువాత టిఆర్‌ఎస్ వ్యతిరేకశక్తులే టిజెఎసి వైపువెళతాయి. ఇప్పటికే టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వివిధ పార్టీలు ఉన్నాయి. మరో వర్గం అందులో చేరితే టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తుల్లో మరో చీలిక ఏర్పడటం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే అన్ని రాజకీయ పక్షాలు ఏకమై ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం సూచించారు. టిజెఎసితో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదం వినిపించిన సిపిఎం ఇప్పుడు టిజెఎసి పట్ల సానుకూల వైఖరి వ్యక్తం చేస్తోంది. దీనిలో కీలకపాత్ర వహించేందుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రయత్నం ప్రారంభించి, ప్రజా సంఘాలు, 12 కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి అభ్యర్థిని రంగంలో నిలిపితే కనీసం డిపాజిట్ దక్కలేదు. కోదండరామ్ విమర్శలతో కమ్యూనిస్టు పార్టీలకు మరోసారి ఆశలు చిగురించాయి.