రాష్ట్రీయం

సిబిఐ విచారణకు ముద్రగడ ‘నో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 11: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోంది. మూడురోజులుగా వైద్య సహాయాన్ని నిరాకరిస్తున్న ముద్రగడ శనివారం రాత్రి పొద్దుపోయాక వైద్య సేవలకు అంగీకరించారు. దీంతో వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించడం ప్రారంభించారు. శనివారం నాటికి ముద్రగడ దీక్ష మూడోరోజుకు చేరింది. ప్రభుత్వం తరపున జిల్లా ఎస్పీ రవిప్రకాష్ శనివారం ముద్రగడను కలిసి వైద్య సేవలకు అంగీకరించాలని కోరారు. తుని సంఘటనపై సిబిఐ విచారణకు ముద్రగడ తిరస్కరించారని ఎస్పీ మీడియాకు చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న విచారణ చాలని, అయితే ఇప్పటివరకూ అరెస్టుచేసిన వారిని కేసుల్లేకుండా బేషరతుగా విడుదల చేయాలని ముద్రగడ డిమాండు చేశారని, ఈ డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తామని ఎస్పీ చెప్పారు. ముద్రగడ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుంటే అదుపులోకి తీసుకుని వైద్యశాలకు తరలించామని, అంతకుమించి ఆయనపై ఎటువంటి కేసులూ లేవని ఎస్పీ స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడ భార్య పద్మావతి, కోడలు సిరి కూడా స్వచ్ఛందంగా దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా తుని ఘటనలో ఇప్పటివరకూ అరెస్టయిన 13మంది నిందితులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో నిరాహార దీక్ష చేస్తున్నట్టు తెలిసింది.
ముద్రగడను పరామర్శించేందుకు వచ్చిన వైసిపి నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, పినిపే విశ్వరూప్‌లను మధురపూడి విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారిని కోరుకొండ పిఎస్‌కు తరలించారు. పోలీసు బందోబస్తులోనే వారిని వెనక్కి పంపించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాపు జెఎసి పిలుపుమేరకు తూర్పుగోదావరి జిల్లాలో బంద్ సాగింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాల చుట్టూ సుమారు రెండు కిలోమీటర్ల మేర ఇనుప కంచె వేసి సాయుధ దళాలు వైద్యశాలను పహరా కాస్తున్నాయి.