రాష్ట్రీయం

మీవి తప్పుడు లెక్కలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణకు కేంద్రం అందించిన ఆర్థిక సాయంపై బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. తెరాసఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు తెలంగాణకు 90వేల కోట్లు ఇచ్చినట్టు అమిత్‌షా చేసిన ప్రకటన వాస్తవం కాదన్నారు. రెండేళ్లలో కేంద్రం నుంచి 36వేల కోట్ల నిధులు మాత్రమే వచ్చాయన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రాలు కేంద్రం వద్ద బిక్షమెత్తుకోవన్న విషయాన్ని బిజెపి నేతలు గుర్తించాలన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, మోదీ ప్రభుత్వానికి మానవీయ కోణం లేదన్నారు. ప్రచారం చేసుకోవడం, విదేశీ విహారాలు తప్ప బిజెపి ప్రభుత్వం గొప్పతనం ఏముందని ప్రశ్నించారు. రెండేళ్లలో 36వేల కోట్లు ఇచ్చి, 90వేల కోట్లు ఇచ్చినట్టు తప్పుడు లెక్కలు చెప్పడం సిగ్గుచేటని ఈటల విమర్శించారు. రాష్ట్రాలు కేంద్రం వద్ద బిక్షమెత్తుకోవని, కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక శక్తి ఆకాశం నుంచి ఊడిపడదని, రాష్ట్రాలే వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి వేల కోట్లు చెల్లిస్తున్నాయని అన్నారు. తెలంగాణకు 2014-15లో సిఎస్‌ఎస్ కింద 5,028కోట్లు, సెంట్రల్ ట్యాక్సెస్ కింద 8,189 కోట్లు, ఎన్‌డిఆర్‌ఎఫ్ ద్వారా 19 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా 2110 కోట్లు మొత్తం 15,345 కోట్ల రూపాయలు వచ్చాయని ఆయన తెలిపారు. 2015-16లో సిఎస్‌ఎస్ కింద 6,047 కోట్లు, సెంట్రల్ ట్యాక్సెస్ కింద 12,351కోట్లు, ఎన్‌డిఆర్‌ఎఫ్ ద్వారా 468 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా 1,078 కోట్లు మొత్తం 19,944 కోట్లు వచ్చినట్టు చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలో కేంద్రం నుంచి అందిన మొత్తం 35,289 కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పారు.
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుని స్థాయిలో ఉన్న వ్యక్తి అవాస్తవాలు వెల్లడించడం సరికాదన్నారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని, పాలన బాగాలేదని అమిత్‌షా చేసిన విమర్శల్లో వాస్తవం లేదని చెప్పారు. రెండేళ్లలో బిజెపి దేశంలో బలహీనపడిందని, తెలంగాణలో సైతం ఎక్కడా ప్రజాదరణకు నోచుకోలేదని, బిజెపికి తెలంగాణలో ఎక్కడా డిపాజిట్ దక్కలేదని గుర్తు చేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలో బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో కనీసం ఒక్క డివిజన్‌లోనూ గెలవలేకపోయారని గుర్తు చేశారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎక్కడ ఎన్నికలు జరిగినా కనీవినీ ఎరుగుని రీతిలో భారీ మెజారిటీతో తెరాస అభ్యర్థులు విజయం సాధిస్తున్నారని తెలిపారు. గ్రేటర్‌లో తెరాస కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలకు వచ్చినంత మెజారిటీ వచ్చిందని చెప్పారు. దేశంలోని పలు సంస్థలు, మేధావులు, చివరకు ప్రధాని సైతం తెలంగాణలో పాలన బాగుందని, పథకాలు దేశమంతా ఆచరించేట్టుగా ఉన్నాయని అభినందించినట్టు గుర్తు చేశారు.
గర్బిణీలకు పౌష్టికాహారం అందించడానికి ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు యూపిఏ ప్రభుత్వ హయాంలో 15,800 కోట్లు కేటాయించగా, బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దానిని ఎనిమిది వేల కోట్లకు కుదించిందని విమర్శించారు. ఎన్డీయే పేదల పక్షం కాదని, కార్పొరేట్ కంపెనీల పక్షమన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వ విధానాలే నిరూపిస్తున్నాయని ఈటల విమర్శించారు.
తెలంగాణను కుదిపేసిన కరవు నివారణకు కేంద్రాన్ని మూడువేల కోట్ల సాయం కోరితే, కేవలం ఏడువందల కోట్లు ఇచ్చి చేతులు దులిపేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నల్లధనం వెనక్కి తెప్పిస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైందో అమిత్‌షా చెబితే బాగుండేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, బిజెపి నేతలు ఉల్టాపల్టా మాటలు మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ రాములు నాయక్‌లు బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాపై మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూడడం తగదని విమర్శించారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయనే విషయం బిజెపి నేతలు గుర్తించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.