రాష్ట్రీయం

ఇక కొత్త పంపుసెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: రాష్ట్రంలో ప్రస్తుతంవున్న వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో మరింత నాణ్యత, సామర్థ్యంతో పనిచేసే కొత్త పంపుసెట్లు అమర్చనున్నట్టు సిఎం చంద్రబాబు చెప్పారు. కొత్త పంపుసెట్ల ద్వారా విద్యుత్ ఆదా కావడంతోపాటు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చన్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన పంపుసెట్ల మార్పు సత్ఫలితాలిచ్చిందని, 30శాతం వరకూ విద్యుత్ పొదుపు చేయగలిగామన్నారు. అలాగే సోలార్ పంపుసెట్లను అమర్చేలా రైతులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 2200 సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయగా, 4525 త్వరలోనే ఏర్పాటు చేయాలని విజయవాడలో సోమవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో అధికారులకు సూచించారు. తాము అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్‌రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారిందని వివరించారు. ఎల్‌ఈడీ బల్బుల మార్పు ద్వారా పెట్టిన పెట్టుబడిని విద్యుత్ ఆదాతో ఐదేళ్లలోనే తిరిగి రాబట్టవచ్చన్నారు. 2016 నాటికి రాష్ట్రంలో ఏ ఒక్క ఇల్లూ చీకటిలో మగ్గిపోకుండా చర్యలు తీసుకున్నామని చెప్పిన ముఖ్యమంత్రి, గృహావసరాలకు ఎల్‌ఈడీ బల్బుల పంపిణీని కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే పది జిల్లాల్లో 1.2 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేశామని, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో త్వరలో చేపట్టనున్న ఎల్‌ఈడీ బల్బుల పంపిణీని కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల పెట్టడంద్వారా 100 మిలియన్ యూనిట్లు ఏడాదికి ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 18 నెలల పాలనలో ఏడాదికి 4 వేల నిమిషాలున్న అంతరాయాన్ని 100 నిమిషాలకు తగ్గించగలిగామని అన్నారు. విద్యుత్ సరఫరాలోనూ నష్టాలు సింగిల్ డిజిట్‌కు తగ్గేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో 10వేల సబ్ స్టేషన్లను కంప్యూటరీకరించి మానిటరింగ్ చేయడంలో విజయవంతమయ్యామని చెప్పారు. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు రాయలసీమను నెలవుగా చేయాలని భావిస్తున్నామని, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి పనులు జరుగుతున్నాయని సిఎం వెల్లడించారు. కడప, అనంతపురం, కర్నూలును అమరావతితో నేరుగా కలిపేలా జాతీయ రహదారులను నూతనంగా నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి మలుపులులేని రహదారులు నిర్మించడం వల్ల దూరం చాలావరకు తగ్గుతుందని, కడప, అనంతపురం, కర్నూలు నుంచి రాజధానికి కేవలం ఐదునుంచి ఆరు గంటల్లో చేరుకోవచ్చన్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఈ జాతీయ రహదారులకు భూసేకరణ చేసి సహకరిద్దామని చెప్పారు. రహదారులు నిర్మించిన తర్వాత వాటి నిర్వహణ సరిగా వుండటం లేదని, మళ్లీ మెరుగైన రోడ్లను నిర్మించాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. భూసేకరణకు కలెక్టర్లు నిర్దేశిత సమయాన్ని పెట్టుకుని పనిచేయాలని నిర్దేశించారు.
రాష్ట్రంలో ప్రతి ఇంటికి 20 ఎంబిపిఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఇవ్వాలన్న లక్ష్యంతో మొదలుపెట్టిన ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం వచ్చే ఏడాది జూన్‌నాటికి పూర్తవుతుందని చంద్రబాబు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆటంకాలను తొలగించే విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలన్నారు. జనవరి నెలాఖరుకు ఉత్తరాంధ్రలో, ఏప్రిల్ నాటికి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో, మిగిలిన జిల్లాల్లో జూన్ 30నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఫైబర్‌గ్రిడ్ నిర్వహణకు అవసరమైన కార్యాలయ సముదాయాన్ని ప్రతి జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా కలెక్టర్లు కేటాయించాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే 56 శాతం విమాన సర్వీసులు పెరిగాయని, ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు సంబంధించి సర్వే పూరె్తైందని, వచ్చేనెలలో బిడ్స్ పిలుస్తామని అధికారులు వివరించారు. దగదర్తి, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూములు అప్పగిస్తామన్నారు. రాజమండ్రి విమానాశ్రయ విస్తరణకు అవసరమైన 300 ఎకరాలను అప్పగించడం పూర్తవుతుందన్నారు. మరోవైపు మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం పోర్టులకు భూసేకరణ ఇంకా పూర్తికావాల్సి ఉందని అధికారులు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించి మరోవారంలో టెండర్లు పిలవనున్నట్టు వివరించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కనె్వన్షన్ సెంటర్ల నిర్మాణంతోపాటు విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతిలో ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణం, ఇంకా విశాఖపట్నం, తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కలెక్టర్లు చొరవ చూపించాలని సిఎం సూచించారు. అమరావతిలో ఎనర్జీ యూనివర్సిటీ, కాకినాడలో లాజిస్టిక్ యూనివర్సిటీకి 150 ఎకరాల చొప్పున భూమిని గుర్తించాల్సిన బాధ్యతను సిఎం కలెక్టర్లకు అప్పగించారు. టూరిజం అభివృద్ధికి హాస్పిటాలిటీ యూనివర్సిటీ నెలకొల్పాలని యోచిస్తున్నట్టు సిఎం వెల్లడించారు. ఇచ్ఛాపురం నుంచి తడవరకు బీచ్ కారిడార్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, 13 జిల్లాల కలెక్టర్లు, కార్యదర్శులు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

చిత్రం... కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు